కృష్ణపట్నం రైల్వేలైన్‌కు పచ్చజెండా

Railway Department Green Signal To Krishnapatnam Train Track - Sakshi

21న ప్రారంభించనున్న ఉప రాష్ట్రపతి

ఏర్పాట్లు పూర్తి చేస్తున్న రైల్వేమంత్రిత్వ శాఖ

వైఎస్సార్‌ సహకారంతోనే సకాలంలో భూసేకరణ

కృష్ణపట్నం పోర్ట్‌ – వెంకటాచలం – ఓబులవారిపల్లె రైల్వేలైన్‌ ప్రాజెక్ట్‌

కృష్ణపట్నం (వెంకటాచలం)–ఓబులవారిపల్లె కొత్త రైలుమార్గం పూర్తి కావడానికి దశాబ్దన్నర కాలంపట్టింది. ఈలైను నిర్మాణం ముగింపుదశలో ఉంది.నెల్లూరు వైపు వెలుగొండల్లో నిర్మితమవుతున్న (6.5కి.మీ) టన్నెల పూర్తిఅయితే అంతాసిద్ధమైనట్లే. ఈనెల 21న లాంఛనంగా ఉపరాష్ట్రపతి చేతులమీదుగా ప్రారంభించేందుకు రైల్వేఅధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు.

వైఎస్‌ఆర్‌ జిల్లా, రాజంపేట : దక్షిణమధ్య రైల్వే రవాణా సదుపాయం కల్పిస్తున్న ఓడరేవుల్లో ముఖ్యమైనది కృష్ణపట్నం ఓడరేవు. జోన్‌ నుంచి రవాణా అయ్యే సరుకు రవాణాల్లో గణనీయభాగం ఈ పోర్ట్‌ నుంచి జరుగుతోంది. ప్ర స్తుతం కృష్ణపట్నం పోర్ట్‌ విజయవాడ–గుంటూరు–గుడూరు ప్రధాన రైలుమార్గంలోని వెంకటాచలం స్టే షన్‌ వద్ద అనుసంధానమైంది. వెంకటాచలం నుంచి ఓబులవారిపల్లెని కలుపుతూ చెన్నై–హౌరా, చెన్నై– ముంబాయి రైలుమార్గాలకు దగ్గరి దారిగా ఉంది.

ఉపరాష్ట్రపతి మానస పుత్రిక ఈలైను
ఉపరాష్ట్రపతి మానస పుత్రిక అయిన ఈ రైల్వేలైన్‌ను ఆయన లాంఛనంగా త్వరలో ప్రారంభించనున్నారు. గతంలో ఎన్‌డీఏ హయాంలో ఈలైను మంజూరుకు తన హోదాలో కృషి చేశారు.  ఈ మేరకు నెల్లూరు రైల్వేస్టేషన్‌ పరిధిలో రైల్వేమంత్రిత్వ శాఖ సన్నహాలు చేస్తున్నారు. ఈనెల 21న ఈ మార్గం ప్రారంభోత్సవానికి సంబంధించి శిలాఫలకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించనున్నారు.

రెండు మెయిన్‌లైన్లకు అనుసంధానం
కృష్ణపట్నం పోర్ట్‌ –వెంకటాచలం–ఓబులవారిపల్లె కొత్త రైలుమార్గం ప్రాజెక్టు రెండు ప్రధానరైలు మార్గాల మధ్య అనుసంధానమై గుంతకల్‌ డివిజన్‌ నుంచి కృష్ణపట్నం వచ్చే రైళ్లకు 72 కిలోమీటర్ల దూరం తగ్గుతోంది. ఓబులవారిపల్లె–రేణిగుంట–గుడూరు సెక్షన్‌లో రద్దీకూడా తగ్గనుంది. ప్రస్తుత కొత్త రైల్వేలైన్‌ ప్రాజెక్టులో వెంకటాచలం రోడ్‌ జంక్షన్‌–వెలికల్లు మధ్య (60కిమీ), చెర్లోపల్లె–వెలికల్లు మధ్య 7కిమీ అడవిలో సొరంగం పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పనులు పూర్తియితే కృష్ణపట్నం–వెంకటాచలం–ఓబులవారిపల్లె కొత్త రైలుమార్గంలో రైళ్లను నడపడానికి వీలవుతోంది.

వైఎస్సార్‌తోనే సకాలంలోరైల్వేలైన్‌ భూసేకరణ
దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి వల్లనే ఓబులవారిపల్లె –కృష్ణపట్నం రైల్వేలైనుకు సంబంధించి భూసేకరణ పూర్తి అయ్యింది. రైల్వేలైను కోసం 1900 ఎకరాల భూసేకరణ చేశారు. ఇదే విషయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గతంలో కేంద్రమంత్రి హోదా  టన్నెల్‌ పరిశీలన సందర్భంగా తెలియజేయడం గమనార్హం. అప్పట్లో అటవీశాఖ మంత్రి అటవీ భూమికి సంబంధించి 325 ఎకరాలు రైల్వేలైనుకు కేటాయించారు.

ప్రయాణికుల, సరుకుల రవాణాకు..
కొత్త రైల్వేలైన్‌ మార్గం చేపట్టడం వల్ల విజయవాడ–గూడూరు–రేణిగుంట –గుంతకల్లు సెక్షన్‌లో ప్రయాణికుల, సరుకుల రవాణా రైళ్లు నిరంతరాయంగా సాగడానికి వీలవుతుంది. ఈ మార్గం అందుబాటులోకి రాగానే సరుకుల రవాణాలో ఆశించిన అభివృద్ధి సాధ్యపడుతుందని అంచనా.  వెనుకబడిన ప్రాంతాల్లో సాంఘిక, ఆర్థిక పురోభివృద్ధికి అవకాశాలు మెరుగవుతాయి.  

రద్దీగా ఉన్న విజయవాడ–గూడూరు రైలుమార్గం
ప్రస్తుతం విజయవాడ–గూడూరు రైలుమార్గం నిరంతరం రైళ్ల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉంటోంది. ముంబై, పశ్చిమ తీర ప్రాంతాలకు సరుకుల రవాణా చేయడంలో సౌలభ్యంతో పాటు నిరంతరాయ రవాణా సౌకర్యం కల్పించాలని , సరుకు రవాణా వినియోగదారులు కోరుతున్నారు. 2005–2006లో ఈ కొత్త రైలుప్రాజెక్టు మంజూరైంది. ఈ ప్రాజెక్టు మొత్తం ఏపీలోని నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల మధ్య నుంచి సాగుతోంది. సరుకు రవాణా అవసరాలు తీర్చడానికి, వేగన్ల టర్న్‌ అరౌండ్‌ అభివృద్ధి , రైల్‌వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్, కృష్ణపట్నం పోర్ట్‌ , ఏపీ సర్కారు, సాగరమాల డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, ఎన్‌ఎంజీసీ , బ్రహ్మిణి స్టీల్స్‌ సంస్థలు కలిసిన స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీపీ) ద్వారా కృష్ణపట్నం రైల్వే కంపెనీ లిమిటెడ్‌ (కెఆర్‌సీఎల్‌)ఈ ప్రాజెక్టును చేపట్టింది.

ప్రాజెక్టులో ప్రధానంశాలివే..
ఓబులవారిపల్లె నుంచి వెంకటాచలం రోడ్‌ జంక్షన్‌ వరకున్న రైలుమార్గం పొడవు 93 కి.మీ.
వెంకటాచలం రోడ్‌ జంక్షన్‌–వెలికల్లు , చెర్లోపల్లె–ఓబులవారిపల్లె మధ్య పూర్తయిన రైలుమార్గం పొడవు  82 కి.మీ.
వెంకటాచలం రోడ్‌ జంక్షన్‌–ఓబులవారిపల్లె మధ్య రైల్వేలైన్‌ కోసం సవరించిన నిర్మాణ వ్యయం రూ.1,656 కోట్లు.
ఈ మార్గంలో 23 భారీ వంతెనలు, 123 చిన్న వంతెనలు, సబ్‌వేలు 60 ఉన్నాయి.
వెంకటాచలం రోడ్‌ జంక్షన్‌–ఓబులవారిపల్లె మధ్య కసుమూరు, కొత్తుండిపల్లె, బ్రహ్మణపల్లె, ఆదూర్‌పల్లి, నెల్లెపల్లి, రాపూరు, వెల్లికల్లు, చెర్లోపల్లె,నేతివారిపల్లె, మంగపేటరోడ్‌ కొత్త రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
చెర్లోపల్లె–వెలికల్లు మధ్య కిలోమీటర్‌ పొడ వు సొరంగం మార్గం నిర్మాణం పూర్తయిం ది. 7కి.మీ పొడవు ఉన్న మరో భారీ సొరంగమార్గం నిర్మాణదశలో కొనసాగుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top