ప్రజా పంపిణీ అవస్థ | Public distribution condition | Sakshi
Sakshi News home page

ప్రజా పంపిణీ అవస్థ

Dec 14 2014 2:20 AM | Updated on Sep 2 2017 6:07 PM

వాస్తవంలో చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పూర్తి స్థాయిలో అందించిన పాపాన పోలేదు.

కడప అగ్రికల్చర్: వాస్తవంలో చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పూర్తి స్థాయిలో అందించిన పాపాన పోలేదు. నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకాన్ని రద్దు చేసి ఎన్టీఆర్ ప్రజా పంపిణీ వ్యవస్థగా పేరు మార్పు చేశారు. పేరు మార్చినా వ్యవస్థ తీరు మాత్రం మారలేదు. చండీఘడ్, చత్తీస్‌గడ్ రాష్ట్రాలకు రాష్ట్ర మంత్రి సునీత, పౌరసరఫరాలశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు వెళ్లి అక్కడి ప్రజా పంపిణీ వ్యవస్థ తీరును చూసి వచ్చారు.
 
 వచ్చీరాగానే రాష్ట్రంలో అన్ని సరుకులు పేద ప్రజలకు అందజేస్తామని ఢంకా బజాయించి చెప్పారు. పర్యటనకు వెళ్లి వచ్చి నెలరోజులు దాటినా ఇంతవరకు పౌరసరఫరాల వ్యవస్థ తీరుతెన్నులపై సమీక్షించిన దాఖలాలు లేవని పేద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 7,79,328 రేషన్‌కార్డులు ఉండగా, ఈ రేషన్‌కార్డులకు 1737 షాపుల ద్వారా 3587.73 టన్నుల సరుకులను ప్రజలకు అందజేసేవారు. ఇందులో బియ్యం, చక్కెర, చింతపండు, గోధుమపిండి, పసుపు, కారం పొడి, ఉప్పు, కందిపప్పు, పామోలిన్ వంటి తొమ్మిది రకాల వస్తువులను రూ. 185లకే అందజేస్తూ వచ్చారు. 2014 సంవత్సరం ప్రారంభం వరకు ఆయా సరుకులను ఇస్తూ వచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తొమ్మిదింటిలో కేవలం బియ్యం, చక్కెరతోపాటు కిరోసిన్ మాత్రమే ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత కిరోసిన్ ఒక నెలలో ఇస్తే మరో నెలలో ఇవ్వడంలేదని వినియోగదారులు వాపోతున్నారు. ప్రభుత్వం అన్ని సరుకులను ప్రజలను అందజేస్తామని చెప్పి ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోయినా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు, ఐదుగురు సభ్యులు ఉన్న పేద కుటుంబాల వారు రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి ఉంటోంది. ఈ పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులను సక్రమంగా ఇస్తుంటే మూడు పూటల భోజనం చేసేవారు. ఈ సరుకులు ఇవ్వకపోవడంతో అప్పులు చేసి పప్పుకూడు తినలేని పరిస్థితికి వచ్చారంటే ప్రభుత్వ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
 మరో పక్క డీలర్లు కూడా ప్రభుత్వంపై ఆగ్రహంగానే ఉన్నారు. గతంలో తొమ్మిది సరుకులు ఇచ్చేటపుడు ప్రజల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావని, ఇప్పుడు ఆయా వస్తువులు ఇవ్వకపోవడంతో తాము మొత్తం సరుకులను తినేస్తున్నట్లు కార్డుదారులు శాపనార్థాలు పెడుతుంటే భరించలేక పోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేసే తప్పిదానికి తాము మాట పడాల్సి వస్తోందని డీలర్లు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement