సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఘోరం జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మంగళవారం ఘోరం జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ప్రియదర్శిని అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోని 10వ నెంబర్ ప్లాట్ఫామ్పై తల్లిదండ్రుల కళ్ల ఎదుటే ఈ దారుణం చోటుచేసుకుంది. అడ్డు వచ్చినవారిపై కూడా ఉన్మాది దాడి చేశాడు. మెదక్ జిల్లా సిద్ధిపేటకు చెందిన దంపతులు వివాహ వేడుకకు హాజరవడానికి షోలాపూర్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు వచ్చారు.
ఆ ఉన్మాది వీరంగం సృష్టించడంతో రైల్వే స్టేషన్లో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సైకోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను చిత్తూరు జిల్లాకు చెందిన కుమార్గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతనిపై పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.