మేకల పెంపకం లాభదాయకం

మేకల పెంపకం లాభదాయకం - Sakshi


వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోయి, సేద్యం చేయలేని పరిస్థితులు తలెత్తాయి. ఒక వేళ సాగు చేసినా పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదోనన్న భయం రైతులను వెంటాడుతోంది. పైగా జిల్లాలో అతివృష్టి, అనావృష్టి సమస్య ైరె తులను నిత్యం వేధిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు జీవాల పెంపకంపై దృష్టిసారిస్తే ఆర్థికంగా నష్టపోకుండా ఉండవచ్చని, ముఖ్యంగా మేకల పెంపకం మంచి ఆదాయాన్నిస్తుందని పశుసంవర్థక శాఖ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ ఎన్ రజనీకుమారి పేర్కొన్నారు. మేకల పెంపకంలో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ఆమె ‘సాక్షి ’కి వివరించారు.             మేకలను ఇలా మేపుకోవచ్చు

మేకలు స్వల్ప ఆహారం ఎక్కువసార్లు తీసుకుంటాయి. త్వరగా వృద్ధి చెందాలంటే వాటికి సరిపడా మేతను అందించాలి. రోజుకు 8-10 గంటల వరకు మేకలను మేపాల్సి ఉంటుంది. మేకలు ఉంచే ప్రాంతం చుట్టూ ఖాళీ స్థలంలో గ్రాసాన్ని పెంచాలి. ఇవి ఎక్కువగా ఆకులు, అలములు, పండ్లు, తొక్కలు, కూరగాయల ఆకులను తింటాయి. అవిశ, రావి, తుమ్మ, అల్లనేరేడు, సీమచింత, వేప, సుబాబుల్ మొదలైనవి నాటుకుని వాటి నుంచి ఆకులను కోసి మేపుతుండాలి. వీటితోపాటు కాయ జాతిలో ఏకవార్షిక రకాలైన జొన్న, కాయజాతి పశుగ్రాసాలైన లూసర్స్ మొదలైనవి పెంచాలి. పచ్చి మేత వేసేటప్పుడు మూడు కిలోల ఇతర పశుగ్రాసాలను ఇవ్వాలి.

 

పిల్లల పోషణ ఇలా..

మేక పిల్లల పోషణలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాలు, నోటిపై పొరలను తీసివేయాలి. బొడ్డుకు టింకర్ అయోడిన్ పూయాలి. పిల్లలను ఉంచిన ప్రదేశంలో 10 శాతం ఫినాయిల్ చల్లాలి. ఈనిన వెంటనే పొదుగును శుభ్రంగా కడిగి, తర్వాత పిల్లలకు పాలు తాగించాలి. ముర్రుపాలు బాగా తాగిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజుకు మూడు నుంచి నాలుగుసార్లు పాలు తాగించాలి. మొదటిసారి ముర్రుపాలను పుట్టిన ఆరుగంటల వ్యవధిలో తాగించాలి.రెండు నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు తాగించాలి. తర్వాత తల్లి నుంచి వేరు చేసి దాణా, పచ్చిమేత, లేత ఆకులు అందుబాటులో ఉంచాలి. రెండు వారాల సమయంలో 10 గ్రాముల దాణా ఇవ్వాలి. పిల్లల షెడ్ లేదా పాక శుభ్రంగా ఉంచాలి. అలా చేయకపోతే పిల్లలు నేలను నాకి అనారోగ్యానికి గురవుతాయి. షెడ్లు లేదా పాకల్లో ఉప్పు లవణ మిశ్రమ ఇటుకలు ఏర్పాటు చేయాలి. ముందు జాగ్రత్తగా రోగాలు రాకుండా టీకాలు వేయించాలి. మొక్కజొన్న, వేరుశనగ చెక్క, గోధుమ పొట్టు, బియ్యం, నూక, జొన్నలు, లవణ మిశ్రమం ఉండేలా చేయాలి.

 

విత్తన మేకపోతుల పెంపకం

విత్తన మేకపోతులను ప్రత్యేకంగా పెంచాలి. వసతి కల్పించాలి. ఒక్కోదానికి 300 గ్రాముల మిశ్రమ దాణా ఇవ్వాలి. మేకలను దాటడానికి ఉపయోగించే రోజుల్లో దాణా రోజుకు 500 గ్రాములు ఇవ్వాలి. రోజూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. పోతులు, పెద్ద మేకలకు ఇచ్చే దాణా మిశ్రమంలో 20 శాతం మొక్కజొన్నలు, 50 శాతం వేరుశనగ పిండి, 20 శాతం గోధుమ పొట్టు, 20 శాతం తవుడు, 18 శాతం బియ్యం నూకలు, జొన్నలు, సజ్జలు, రెండు శాతం లవణ మిశ్రమం, ఒక భాగం ఉప్పు ఉండాలి. స్థానికంగా దొరికే ముడి సరుకులను ఉపయోగించి కావాల్సిన పోషక విలువలు ఉండేలా దాణా మిశ్రమం తయారు చేసుకోవచ్చు.

 

సకాలంలో టీకాలు వేయించాలి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మేత, నీరు ఉండే ప్రాంతాల్లో మేపాలి. ఈ పరిస్థితుల్ల తినే గడ్డి, ఇతర ఆకులతో పాటు ఏలిక పాములు, బద్దె పురుగులు వాటి శరీరంలో చేరి పోషకాల్ని పీల్చి పిప్పి చేస్తాయి. దీంతో మేకలు అనారోగ్యానికి గురై మరణించే ప్రమాదం ఉంది. సకాలంలో టీకాలు వేయించాలి. మూడు నెలలు దాటిన తర్వాత పిల్లలకు నట్టల నివారణ మందు తాగించాలి. ఇంకా పేలు, పిరుదులు, గోమార్లు మొదలైనవి శరరీంలో రక్తాన్ని పీల్చుతాయి. వీటి నివారణకు పశువైద్యాధికారిని సంప్రదించి వారు సూచించిన మందులను వాడాలి. మందులను శరీరానికి పిచికారీ చేసినప్పటి నుంచి ఆరిపోయే వరకు మూతులకు చిక్కంలాగా ఉట్టి లాంటి తాడు కట్టాలి. అలా చేయకపోతే మందును నాలుకతో నాకే ప్రమాదం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top