
‘ఖరీఫ్’కు కార్యాచరణేది?
ఖరీఫ్ ముంచుకొస్తున్నా ... జిల్లా వ్యవసాయశాఖ పట్టించుకునే పరిస్థితులు లేవు. ఈ పాటికే ప్రణాళికను రూపొందించి అమలుకు సన్నద్ధం కావాలి.
- వ్యవసాయానికి విభజన కష్టాలు
- సీజన్ ముంచుకొస్తున్నా పట్టని అధికారులు
- వరి విస్తీర్ణం, ఎరువులు,విత్తన సరఫరాపై మౌనం
- ఎన్నికల విధులూ మరో సమస్య
సాక్షి,విశాఖపట్నం: ఖరీఫ్ ముంచుకొస్తున్నా ... జిల్లా వ్యవసాయశాఖ పట్టించుకునే పరిస్థితులు లేవు. ఈ పాటికే ప్రణాళికను రూపొందించి అమలుకు సన్నద్ధం కావాలి. రాష్ట్ర విభజన దీనికి గుదిబండగా మారింది. ప్రభుత్వ శాఖలను విడగొట్టే పనుల్లో బిజీగా ఉన్న అధికారులు మరో నెలన్నరలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సాగును పట్టించుకోవడం లేదు. వరివిత్తనాలు, ఎరువుల కోసం అన్నదాతలు ఏటా రోడ్డెక్కడం పరిపాటి.
ఈ ఏడాది జిల్లాలో అటువంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ముందుగానే మేల్కోవాలి. ఈపాటికే ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలి.గడువు దాటిపోతున్నా జిల్లా వ్యవసాయశాఖ చేష్టలుడిగి చూస్తోంది. ఏమంటే శాఖల విభజనలో మునిగిపోయిన ఉన్నతాధికారుల నుంచి తమకు ఏ సమాచారం,ఆదేశాలు రావడం లేదంటున్నారు.
ఈ ఏడాదీ అంతేనా... : జిల్లాలో ఏటా జూన్ నుంచి ఖరీఫ్ పనులు ఊపందుకుంటా యి. ఈమేరకు ఏప్రిల్ నాటికే సాగు ప్రణాళికతో వ్యవసాయశాఖ సిద్ధమవుతుంది. ఎంత విస్తీర్ణంలో వరి, ఇతర పంటలు చేపట్టాలి, వాటికి ఏ మేరకు ఎరువులు అవసరమవుతాయి? విత్తనాల సరఫరా? వంటివాటితో కార్యాచరణను సిద్ధం చేసుకుంటుంది.
రైతులకు అవసరమైనవన్నీ మండలస్థాయిలో సమకూర్చిపెట్టుకుంటుంది. కానీ ఈఏడాది ఇందుకు భిన్నమైన పరిస్థితి చోటుచేసుకుంది. సాగు కాలం ముంచుకొస్తున్నా...ఇంతవరకు దీనిగురించి పట్టించుకున్న పాపాన పోలేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం వివిధ ప్రభుత్వశాఖల విభజన ప్రక్రియ కొనసాగుతుండడమే ఇందుకు కారణం. వాస్తవానికి ఖరీఫ్‌లో ఏ జిల్లాలో ఏఏ పంటలు ఏమేరకు చేపట్టాలి? ఎరువులు?విత్తనాలు సరఫరా ఎంత? వంటివన్నీ రాజధాని నుంచి జిల్లాస్థాయి అధికారులకు వస్తాయి. కానీ ఇంతవరకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు,సమాచారం లేదు.
ఇలా వ్యవసాయశాఖ ఖరీఫ్ ప్రణాళికను గాలికొదిలేసింది. జిల్లాలో ఖరీఫ్ వరి సాధారణ విస్తీర్ణం 98,718 హెక్టార్లు. దీనికి అనుగుణంగా అవసరమైన విత్తనాలను మే 20లోగా రైతులకు సరఫరా చేయాలి. ఇంతవరకు అసలు వరిసాగు ఎంతన్నది ఇప్పటికీ నిర్ణయించలేదు. అంచనాగా 1.10లక్షల హెక్టార్లు అని చెబుతున్నారు. ఈనేపథ్యంలో గడువులోగా విత్తనాలు అన్నదాతలకు దొరుకుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రాథమిక అంచనా ప్రకారం 24వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉంటాయి. గతేడాది 76,849 మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించినట్లు రికార్డులు చెబుతున్నాయి. వీటిని ముందుగానే సేకరించి గోడౌన్లకు తరలించాలి. ఇప్పటికీ ఎన్ని ఎరువులు అవసరమన్నది కూడా తేల్చలేదు. ఇంకోపక్క కింది నుంచి పై వరకూ వ్యవసాయశాఖ సిబ్బంది సార్వత్రిక ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. మే 7వ తేదీ దాటే వరకు ఖరీఫ్ ప్రణాళిక జోలికి ఎవరూ వెళ్లేలా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో అన్నదాతల కష్టాలు గతేడాదికన్నా రెట్టింపయ్యేటట్టు కనిపిస్తోంది.