breaking news
District Agriculture
-
సింహపురి ఎడారే !
కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుకోవచ్చన్న బ్రిజేష్‌కుమార్ తీర్పు సింహపురి పాలిట శాపంగా మారుతోంది. పెన్నానది పరివాహక ప్రాంతంలో సోమశిలతో పాటు నిర్మాణంలో ఉన్న చిన్న ప్రాజెక్టులు నిరుపయోగంగా మారే ప్రమాదం ఏర్పడింది. తాజాగా ఎగువన తెలంగాణలో కృష్ణానదిపై రెండు కొత్త ప్రాజెక్టులు నిర్మించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించడం ఇక్కడి రైతుల గుండెల్లో గుబులురేపుతోంది. ఎగువన కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే దిగువకు కృష్ణా మిగులు జలాలు వచ్చే పరిస్థితి ఉండదు. ఫలితంగా నెల్లూరుకు నీటి రాక నిలిచిపోయి లక్షలాది ఎకరాల మాగాణి బీడుగా మారే ప్రమాదం నెలకొంది. సాక్షి, నెల్లూరు: జిల్లాలో వ్యవసాయం పూర్తిగా సోమశిల జలాశయంలోని నీటిపై ఆధారపడి ఉంది. కర్ణాటకలో పుట్టిన పెన్నానది అనంతపురం, కడప మీదుగా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. దీనికి పాపాగ్ని, చిత్రావతి, జైమంగలి, చెయ్యేరు, సగిలేరు ఉపనదులుగా ఉన్నాయి. ఇప్పటికే పెన్నాపై ఎగువన గండికోట, అప్పర్ పెన్నార్, మైలవరం జలాశయాలు ఉన్నాయి. 78 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన సోమశిల జలాశయం పరిధిలో 7.5 లక్షల ఎకరాలు, తెలుగుగంగలో అంతర్భాగమైన కండలేరు జలాశయ పరిధిలో మరో 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఏటికేటికి వర్షాలు తగ్గి, పెన్నానదికి నీరు చేరడం గగనమైపోతోంది. అదే సమయంలో మిగులు జలాలు వచ్చే మార్గాలు మూసుకుపోతుండడం జిల్లా రైతులను కలవరపెడుతోంది. ఐదేళ్లలో జూన్ నాటికి సోమశిల నీటి నిల్వ వివరాలను పరిశీలిస్తే..2008లో 40.674 టీఎంసీలు ఉండగా 2,570 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో ఉంది. 2009లో 24.797 టీఎంసీల నిల్వ 2,580 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో, 2010లో 28.445 టీఎంసీల నిల్వ, 50 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో, 2011లో 50.313 టీఎంసీల నిల్వ, 2 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో, 2012లో 33.731 టీఎంసీల నిల్వ, 2 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. గత ఏడాది మాత్రం మొదట్లో కేవలం 8.33 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఆ తర్వాత వర్షాలు ఆలస్యంగా కురవడం, కృష్ణా జలాలు 60 టీఎంసీలు రావడంతో సోమశిల జలాశయం జలకళ సంతరించుకుంది. మిగులు జలాలే ఆధారం పెన్నానదికి నీటి లభ్యత తగ్గడంతో శ్రీశైలం జలాశయం ద్వారా వచ్చే కృష్ణాజలాలపైనే జిల్లా రైతులు ఆధారపడాల్సి వస్తోంది. తెలుగుగంగ పథకంలో భాగంగా చెన్నై ప్రజల తాగునీటి అవసరాల కోసం కేటాయించిన 15 టీఎంసీల కృష్ణా జలాలు ఇక్కడి రైతులను ఆదుకుంటున్నాయి. చెన్నై వాసులు ఏ నాడు 6 టీఎంసీలకు మించి వాడుకోకపోవడంతో మిగిలిన నీటిని సోమశిల, కండలేరు జలాశయాల పరిధిలోని ఆయకట్టు రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే గత ఏడాది బ్రిజేష్‌కుమార్ తీర్పు ప్రకారం తెలుగుగంగకు 25 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయించారు. ఈ నీటితో కర్నూలు, కడప జిల్లాల పరిధిలోని వెలుగోడు, కేసీ కాలువల ఆయకట్టు 5.25 లక్షల ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. కేటాయించిన నీరు ఆ ఆయకట్టుకే సరిపోయే పరిస్థితి లేకపోవడంతో జిల్లాకు మిగులు జలాలు వచ్చే అవకాశముండదు. పెన్నా పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోతే సోమశిల, కండలేరు ఆయకట్టు రైతులకు కష్టాలు తప్పని పరిస్థితి. కొత్త ప్రాజెక్టులు వస్తే.. కృష్ణానదిపై ఎగువన కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే మిగులు జలాలపై ఆధారపడి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారనుంది. ప్రస్తుతం 90 చెరువులకు, 2 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో రూ. 1,500 కోట్లతో సోమశిల-స్వర్ణముఖి కాలువ పనులు చేపట్టారు. దీనికి 15 టీఎంసీల నీరు అవసరం. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల ప్రజలకు తాగునీరు అందించడంతోపాటు 90 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సోమశిల నుంచి హైలెవల్ కాలువ నిర్మాణానికి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. దీనికి రూ.1,500 కోట్లు అవసరమవుతాయని లెక్కలుగట్టారు. కృష్ణపట్నం ఓడరేవుకు 5 టీఎంసీల నీరు కేటాయించారు. మరోవైపు నెల్లూరు, సంగం ఆనకట్టలతో పాటు తెలుగుగంగ కాలువల నిర్మాణం పూర్తికాలేదు. ఇవన్నీ ఇలా ఉంటే చిత్తూరు జిల్లా తాగునీటి అవసరాలంటూ కండలేరు నుంచి 7.5 టీఎంసీల నీటిని తరలించేందుకు సుమారు రూ.7 వేల కోట్లతో పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. అయితే మిగులు జలాలపై ఆధాపడి చేపట్టిన ఈ ప్రాజెక్టులన్నింటి పాలిట రాష్ట్ర విభజన తీవ్ర ప్రభావం చూపుతోంది. బ్రిజేష్ తీర్పుతో ఆల్మట్టి డ్యాం ఎత్తు మరింత పెరిగితే మన ప్రాంతానికి మిగులు జలాలు రావడం ప్రశ్నార్ధకం కానుండ గా, ఎగువన కృష్ణానదిపై మరికొన్ని ప్రాజెక్టులు నిర్మించాలన్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో దిగువకు నీరు వచ్చే పరిస్థితి ఉండదు. ఫలితంగా కృష్ణ జలాలు జిల్లాకు రాక రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవచూపి దిగువ రాష్ట్రం, ప్రాంతాలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. -
‘ఖరీఫ్’కు కార్యాచరణేది?
వ్యవసాయానికి విభజన కష్టాలు సీజన్ ముంచుకొస్తున్నా పట్టని అధికారులు వరి విస్తీర్ణం, ఎరువులు,విత్తన సరఫరాపై మౌనం ఎన్నికల విధులూ మరో సమస్య సాక్షి,విశాఖపట్నం: ఖరీఫ్ ముంచుకొస్తున్నా ... జిల్లా వ్యవసాయశాఖ పట్టించుకునే పరిస్థితులు లేవు. ఈ పాటికే ప్రణాళికను రూపొందించి అమలుకు సన్నద్ధం కావాలి. రాష్ట్ర విభజన దీనికి గుదిబండగా మారింది. ప్రభుత్వ శాఖలను విడగొట్టే పనుల్లో బిజీగా ఉన్న అధికారులు మరో నెలన్నరలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సాగును పట్టించుకోవడం లేదు. వరివిత్తనాలు, ఎరువుల కోసం అన్నదాతలు ఏటా రోడ్డెక్కడం పరిపాటి. ఈ ఏడాది జిల్లాలో అటువంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ముందుగానే మేల్కోవాలి. ఈపాటికే ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలి.గడువు దాటిపోతున్నా జిల్లా వ్యవసాయశాఖ చేష్టలుడిగి చూస్తోంది. ఏమంటే శాఖల విభజనలో మునిగిపోయిన ఉన్నతాధికారుల నుంచి తమకు ఏ సమాచారం,ఆదేశాలు రావడం లేదంటున్నారు. ఈ ఏడాదీ అంతేనా... : జిల్లాలో ఏటా జూన్ నుంచి ఖరీఫ్ పనులు ఊపందుకుంటా యి. ఈమేరకు ఏప్రిల్ నాటికే సాగు ప్రణాళికతో వ్యవసాయశాఖ సిద్ధమవుతుంది. ఎంత విస్తీర్ణంలో వరి, ఇతర పంటలు చేపట్టాలి, వాటికి ఏ మేరకు ఎరువులు అవసరమవుతాయి? విత్తనాల సరఫరా? వంటివాటితో కార్యాచరణను సిద్ధం చేసుకుంటుంది. రైతులకు అవసరమైనవన్నీ మండలస్థాయిలో సమకూర్చిపెట్టుకుంటుంది. కానీ ఈఏడాది ఇందుకు భిన్నమైన పరిస్థితి చోటుచేసుకుంది. సాగు కాలం ముంచుకొస్తున్నా...ఇంతవరకు దీనిగురించి పట్టించుకున్న పాపాన పోలేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం వివిధ ప్రభుత్వశాఖల విభజన ప్రక్రియ కొనసాగుతుండడమే ఇందుకు కారణం. వాస్తవానికి ఖరీఫ్‌లో ఏ జిల్లాలో ఏఏ పంటలు ఏమేరకు చేపట్టాలి? ఎరువులు?విత్తనాలు సరఫరా ఎంత? వంటివన్నీ రాజధాని నుంచి జిల్లాస్థాయి అధికారులకు వస్తాయి. కానీ ఇంతవరకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు,సమాచారం లేదు. ఇలా వ్యవసాయశాఖ ఖరీఫ్ ప్రణాళికను గాలికొదిలేసింది. జిల్లాలో ఖరీఫ్ వరి సాధారణ విస్తీర్ణం 98,718 హెక్టార్లు. దీనికి అనుగుణంగా అవసరమైన విత్తనాలను మే 20లోగా రైతులకు సరఫరా చేయాలి. ఇంతవరకు అసలు వరిసాగు ఎంతన్నది ఇప్పటికీ నిర్ణయించలేదు. అంచనాగా 1.10లక్షల హెక్టార్లు అని చెబుతున్నారు. ఈనేపథ్యంలో గడువులోగా విత్తనాలు అన్నదాతలకు దొరుకుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 24వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉంటాయి. గతేడాది 76,849 మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించినట్లు రికార్డులు చెబుతున్నాయి. వీటిని ముందుగానే సేకరించి గోడౌన్లకు తరలించాలి. ఇప్పటికీ ఎన్ని ఎరువులు అవసరమన్నది కూడా తేల్చలేదు. ఇంకోపక్క కింది నుంచి పై వరకూ వ్యవసాయశాఖ సిబ్బంది సార్వత్రిక ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. మే 7వ తేదీ దాటే వరకు ఖరీఫ్ ప్రణాళిక జోలికి ఎవరూ వెళ్లేలా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో అన్నదాతల కష్టాలు గతేడాదికన్నా రెట్టింపయ్యేటట్టు కనిపిస్తోంది.