అక్రమాల రూటు వదలని ప్రైవేటు ట్రావెల్స్‌

Private Travels Owners Violets The Rules And Regulations In AP - Sakshi

ఒకే పర్మిట్‌తో రెండు బస్సులు

పండుగలు, రద్దీ సమయాల్లో భారీగా దోపిడీ

స్టేజి క్యారియర్లుగా తిప్పడంతో ఆర్టీసీకి ఏటా రూ.2,400 కోట్ల నష్టం

నిబంధనలకు విరుద్ధంగా సరుకు రవాణా

ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారుల హడావుడి

ఆ తర్వాత అంతా ‘మామూలే’ 

ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకుల తీరు మారడం లేదు. ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నా పట్టించుకోకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ ముందుకు దూసుకెళుతున్నాయి. అడ్డుకోండి.. చూద్దాం అనే రీతిలో ట్రావెల్స్‌ నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. వారాంతాల్లోనూ, పండుగల సీజన్‌లలో టిక్కెట్ల ధరలు అమాంతం పెంచేసి ప్రయాణికుల నుంచి భారీగా దోచుకుంటున్నారు. పండుగలప్పుడు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. అదనపు బెర్తులు, సీట్లు ఏర్పాటు చేసి మరీ పండుగ సీజన్‌ను క్యాష్‌ చేసుకుంటున్నారు. ఒకే పర్మిట్‌తో రెండు బస్సుల్ని తిప్పుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. కాంట్రాక్టు క్యారియర్లుగా అనుమతులు పొంది స్టేజి క్యారియర్లుగా తిప్పుతూ ఆర్టీసీకి ఏటా రూ.2400 కోట్లు నష్టం చేస్తున్నారు. అడ్డుకోవాల్సిన రవాణా అధికారులు షరా‘మామూలు’గానే మిన్నకుండిపోతున్నారు.  

సాక్షి, అమరావతి: ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు అదనపు సీట్లు/బెర్తుల ఏర్పాటుతో బస్సుల పొడవు పెంచి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మోటారు వాహనాల చట్టంలో రూల్‌ 351ఎ ప్రకారం.. స్లీపర్‌ బస్సుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. దీని ప్రకారం.. బస్సులో 36 సీట్లు, 32 బెర్తులు ఉండాలి. కానీ అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, కర్ణాటక, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న బస్సులు నిబంధనలకు విరుద్ధంగా అదనపు సీట్లు, బెర్తులతో తెలుగు రాష్ట్రాల్లో తిరిగాయి. దీంతో ఆ రాష్ట్రాలు 2017 జూన్‌లో రిజిస్ట్రేషన్లు నిలిపివేశాయి. ఆ తర్వాత ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కూడా ఆ బస్సుల్ని సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత ఏపీలో మళ్లీ బస్సుల్ని రవాణా శాఖ అనుమతించింది. సీట్లు, బెర్తులు తగ్గించి మోటారు వాహనాల చట్టంలో ఏఐఎస్‌–119 నిబంధనను అనుసరించి తిప్పాలని ట్రావెల్స్‌ నిర్వాహకులకు అధికారులు సూచించారు. అప్పట్లో అధికారుల ఆదేశాల మేరకు సీట్లు, బెర్తులు తగ్గించిన ట్రావెల్స్‌ నిర్వాహకులు ఇప్పుడు సంక్రాంతి సీజన్‌ డిమాండ్‌ దృష్ట్యా అదనపు బెర్తులు ఏర్పాటు చేస్తున్నారు. తనిఖీలు చేయాల్సిన రవాణా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప తర్వాత షరా‘మామూలు’గానే వదిలేస్తున్నారు.
 
అదనపు బెర్తులతో దందా.. 
గతేడాది రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలతో ఇతర రాష్ట్రాల బస్సులను తిరగనిచ్చేందుకు అనుమతిచ్చింది. అయితే రవాణా శాఖ ఎన్‌వోసీ (నిరభ్యంతర ధ్రువపత్రం) కలిగి ఉండటంతోపాటు ఏఐఎస్‌ –119 ప్రకారం.. బెర్తుల సంఖ్య తగ్గించాలని స్పష్టం చేసింది. ఆలిండియా పర్మిట్లు పొంది ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న బస్సుల్లో స్లీపర్‌ బెర్తులు 36 వరకు ఉన్నాయి. ఇలా ఉండటం మోటారు వాహన చట్టం ప్రకారం నిబంధనలకు విరుద్ధం. ఈ బస్సులు ఏపీలో తిరగాలంటే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ స్పెసిఫికేషన్స్‌ ప్రకారం.. బెర్తులను 30కి తగ్గించి తిప్పాల్సిందే.
 
తనిఖీలకు మంగళం! 
కేంద్ర మోటారు వాహనాల చట్టం 125 సి (4) ప్రకారం.. ప్రభుత్వ రవాణా సంస్థలు, రాష్ట్ర, జిల్లా స్థాయి పర్మిట్లు పొందిన ప్రైవేటు ట్రావెల్స్‌ మాత్రమే బెర్తులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఏపీఎస్‌ఆర్టీసీలో ఏఐఎస్‌–119 నిబంధనలున్న బెర్తుల బస్సులు కేవలం రెండు మాత్రమే ఉండటం గమనార్హం. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న బస్సులు బెర్తులను 36 నుంచి 30కి తగ్గిస్తేనే వాటి నుంచి త్రైమాసిక పన్ను వసూలు చేయాలి. కానీ రాష్ట్రంలో రాజకీయ ఒత్తిళ్లతో రవాణా శాఖ తనిఖీలకు మంగళం పాడింది. దీంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యథేచ్ఛగా ఆన్‌లైన్‌లో రిజర్వేషన్లు చేస్తూ ఆక్యుపెన్సీ పెంచుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న బెర్తుల బస్సులు రాష్ట్రంలో 655 ఉన్నాయి. రవాణా అధికారులకు పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ బస్సులు నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నాయా అనే అంశంలో లేకపోవడం గమనార్హం.
 
హైదరాబాద్‌ రూటే టార్గెట్‌ 
ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు ప్రధానంగా హైదరాబాద్‌ రూట్‌ను టార్గెట్‌ చేసుకున్నారు. ఈ రూట్లోనే అధికంగా బస్సులు నడిపి.. కాంట్రాక్టు క్యారియర్లుగా అనుమతులు పొంది.. స్టేజి క్యారియర్లుగా తిప్పుతూ రోజూ 70 వేల మంది ప్రయాణికుల్ని చేరవేస్తున్నారు. సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఏసీ సర్వీసుకు రూ.550గా ఉన్న టిక్కెట్టు ధరను పండుగలు, రద్దీ సమయాల్లో రూ.990కు పెంచి వసూలు చేస్తున్నారు. స్లీపర్‌ సర్వీసుల్లో సాధారణ రోజుల్లో రూ.850–రూ.1000గా ఉన్న టిక్కెట్టు ధరను ఈ సీజన్‌లో రూ.1,200 – రూ.1,850కు పెంచి వసూలు చేయడం గమనార్హం. హైదరాబాద్‌ – విశాఖపట్నం రూట్‌లోనూ సాధారణ రోజుల్లో స్లీపర్‌ సర్వీసుల్లో రూ.1,500– రూ.1,700 ఉండే టిక్కెట్‌ ధరను పండుగల సీజన్‌లో ఏకంగా రూ.2,500 – రూ.2,700కు వరకు పెంచి వసూలు చేస్తున్నారు.
 
హైకోర్టు ఆదేశాలతో.. 
ప్రైవేటు ట్రావెల్స్‌ డ్రైవర్ల గుర్తింపునకు, వారి సంక్షేమానికి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఖచ్చితంగా చేపట్టాల్సిందేనని హైకోర్టు గతంలోనే స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయితే డ్రైవర్ల రిజిస్ట్రేషన్‌ విషయంలో కార్మిక శాఖ, రవాణా శాఖలు తమ బాధ్యత కాదంటే తమది కాదని కొన్నాళ్లపాటు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈ విషయం మీద హైకోర్టు సీరియస్‌గా స్పందించడంతో రవాణా శాఖ డ్రైవర్ల సంక్షేమ చట్టం అమలు బాధ్యత తీసుకుంది.   

సరుకులు తరలించకూడదనే నిబంధన ఉన్నా..
ప్రైవేటు ట్రావెల్స్‌ ప్రయాణికుల మాటున యథేచ్ఛగా సరుకు తరలిస్తున్నాయి. చెన్నై, బెంగళూరుల నుంచి జోరుగా జీరో వ్యాపారం నిర్వహించేవారికి ఊతమిస్తున్నాయి. కాంట్రాక్టు క్యారేజీ అనుమతులు పొంది స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ వల్ల ఆర్టీసీకి ఏటా రూ.2,400 కోట్లు నష్టాలు వస్తున్నట్లు అంచనా. ఆర్టీసీ ఆక్యుపెన్సీని దెబ్బకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్‌ కార్గో వ్యాపారంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రైవేటు బస్సుల్లో వెండి, ఫర్నీచర్‌ సామగ్రి పెద్ద ఎత్తున మళ్లిపోతోంది. బిల్లులు లేకుండా సామగ్రిని తరలిస్తున్నా రవాణా అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలోనూ ప్రైవేటు బస్సుల్లో బాణాసంచా తరలించడంతో అగ్నిప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రైవేటు బస్సుల్లో సరుకులు తరలించకూడదనే నిబంధన ఉన్నా.. ప్రైవేటు ట్రావెల్స్‌ మాఫియా పెడచెవిన పెట్టి ఆయా నగరాల్లో సరుకులను తరలించేందుకు ఏకంగా బుకింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.  

ఇష్టారాజ్యంగా టిక్కెట్‌ ధరలు పెంపు 
ప్రైవేటు ట్రావెల్స్‌ యజమానులు ఇష్టారాజ్యంగా టిక్కెట్‌ ధరలను పెంచి ప్రయాణికుల అవసరాలను భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్ని తనిఖీ చేస్తే అంతిమంగా ప్రయాణికులే ఇబ్బందులు పడతారని రవాణా అధికారులు చెబుతున్నారంటే.. వీరి దోపిడీకి ఏ విధంగా సహకరిస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. టిక్కెట్ల ధరల నియంత్రణ తమ చేతుల్లో లేదని రవాణా అధికారులు చేతులెత్తేయడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు తమకు అడ్డే లేదన్న రీతిలో ప్రయాణికుల్ని దోచుకుంటున్నారు. ఏటా ఈ దందా సాగుతూనే ఉందే తప్ప ట్రావెల్స్‌ కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. సాధారణంగా పండుగ సీజన్‌ల ముందు ఆయా జిల్లాల్లో రవాణా శాఖ అధికారులు ముందుగా ట్రావెల్స్‌ నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రయాణికుల్ని వారి వారి ప్రాంతాలకు చేరవేయడంలో సహకరించాలని, టిక్కెట్ల ధరలు పెంచి ప్రయాణికుల్ని దోచుకోవద్దని హెచ్చరికలు చేయాలి. అంతేకాకుండా టిక్కెట్ల ధరల నియంత్రణపై ట్రావెల్స్‌ నిర్వాహకుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ సంక్రాంతికి ఏ జిల్లాలోనూ ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. 

  • ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న కాంట్రాక్టు క్యారేజీ బస్సులు: 750
  • వీటిలో 2 ప్లస్‌ వన్‌ బెర్తులున్న బస్సులు: 600
  • రాష్ట్ర పరిధిలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న కాంట్రాక్టు క్యారేజీ బస్సుల సంఖ్య: 491 
  • ఈ బస్సుల్లో రోజూ ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య: 70 వేలు 
  • రాష్ట్ర పరిధిలో స్లీపర్‌ బస్సుల సంఖ్య: 50 

ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకుల ఆగడాలకు అద్దంపట్టే కొన్ని సంఘటనలు

  • తిరుపతికి చెందిన ఎస్‌.లక్ష్మీపవన్‌ సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌లో ఉన్న తన అక్క ఇంటికి వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. బస్సు టికెట్‌ బుక్‌ చేసుకోవడం కోసం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు వెళ్లగా సెమీ స్లీపర్‌ ఏసీ బస్సుకు రూ.1900 చెల్లించాలని చెప్పడంతో బిత్తరపోయాడు. అంతకుముందు పలుమార్లు రూ.1000తోనే హైదరాబాద్‌కు వెళ్లొచ్చిన ఆయనకు ఈసారి ట్రావెల్స్‌ నిర్వాహకులు రూ.900 ఎక్కువ చెప్పడంతో చేసేదేమీ లేక వారు అడిగినంతా చెల్లించి టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. 
     
  • గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బి.ప్రమోద్‌ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. సంక్రాంతి పండుగకు ఊరికి రావడానికి టికెట్‌ కోసం ప్రయత్నించగా ఆర్టీసీ, రైల్వే టికెట్లు అప్పటికే అయిపోయాయి. దీంతో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు వెళ్లగా వారు సాధారణ సూపర్‌ లగర్జీ బస్సుకు రూ.1000 ఇమ్మనడంతో కంగుతిన్నాడు. విడిరోజుల్లో హైదరాబాద్‌ నుంచి తెనాలికి రూ.450 తీసుకునేవారని, ఇప్పుడు రెట్టింపు వసూలు చేస్తున్నారని ప్రమోద్‌ వాపోతున్నాడు.  
     
  • విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన బి.సురేశ్‌ హైదరాబాద్‌లో కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకుంటున్నాడు. సంక్రాంతి పండుగకు తన ఊరికి రావడం కోసం ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు వెళ్లగా వారు సాధారణ లగ్జరీ బస్సుకు రూ.1700 చెల్లించాలని చెప్పడంతో విస్తుపోయాడు. హైదరాబాద్‌ నుంచి అనకాపల్లికి రూ.700 నుంచి రూ.800 మాత్రమే ఛార్జీ అని చెప్పగా ‘ఇష్టముంటే ఎక్కు.. లేదంటే మానుకో’ అని ట్రావెల్స్‌ నిర్వాహకులు దురుసుగా సమాధానం చెప్పారు.  
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top