నిధుల కొరత లేదు: మంత్రి బుగ్గన

To Prevention Of Water Resistance Minister Buggana Said There Was No Shortage Of Funds - Sakshi

ఎండిన బోర్లను మరింత లోతుగా తవ్వించండి 

నీటి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు రూ.కోటి 

రైతులకు అన్నివిధాలా చేయూత 

ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం: మంత్రి బుగ్గన 

సాక్షి, కర్నూలు(అర్బన్‌): జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు నిధుల కొరత లేదని రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు తమ పరిధిలోని అధికారులతో సమీక్షించి.. నీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు వీలుగా ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి కింద ప్రతి ఎమ్మెల్యేకు రూ.కోటి చొప్పున ఇస్తున్నామన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సైతం ఈ నిధులు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలోని తాగునీటి సమస్య, వ్యవసాయ, అనుబంధ శాఖల కార్యక్రమాలపై  శనివారం కలెక్టరేట్‌ సమావేశ భవనంలో మంత్రి వివిధ శాఖల అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సమీక్ష సమావేశాలకు కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ సభ్యులు డాక్టర్‌ సింగరి సంజీవకుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం, కర్నూలు, నందికొట్కూరు, కోడుమూరు, పత్తికొండ, పాణ్యం ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, హఫీజ్‌ఖాన్, ఆర్థర్, డాక్టర్‌ సుధాకర్, కంగాటి శ్రీదేవి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి,జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్, జాయింట్‌ కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, ట్రైనీ కలెక్టర్‌ విధేఖరే, జేసీ–2 ఖాజామొహిద్దీన్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ  వర్షాలు ఆలస్యం కావడం వల్ల రాయలసీమ జిల్లాల్లో సహజంగానే నీటి సమస్య ఉత్పన్నమవుతుందని,  దీని పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తు న్నామని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉన్న సమయాల్లో బోర్లను అద్దెకు తీసుకొని నీటిని సరఫరా చేయాలన్నారు. ట్యాంకర్ల ద్వారానూ సరఫరా చేయాలని,  ట్రిప్పులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. చెడిపోయిన చేతిపంపులను వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. అమృత్‌ పథకం పనులను స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని చేపట్టాలని ఇంజినీర్లను ఆదేశించారు.  

ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం 
జిల్లాలో ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నందున కొంత ఊరట లభిస్తోందని, ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో వర్షాలు పడకపోతే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేస్తామని మంత్రి బుగ్గన తెలిపారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల విత్తనాల సమస్య వచ్చిందని, దీన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవలం రూపాయి చెల్లించి బీమా చేసుకోవచ్చన్నారు. ఇందు కోసం రూ.1,000 కోట్లు బడ్జెట్‌ కేటాయించా మని తెలిపారు. దీన్ని రాష్ట్రంలోని 15 లక్షల మంది కౌలు రైతులకు కూడా అమలు చేస్తున్నామన్నారు. గోదాముల్లోని శనగలను బ్యాంకర్లు వేలం వేయకుండా ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.  గత ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి రూ.551.57 కోట్లు, రబీకి సంబంధించి రూ.107.83 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల కావాల్సి ఉందని జేడీఏ ఠాగూర్‌ నాయక్‌ మంత్రి దృష్టికి తెచ్చారు.

పంటలు ఎండిపోకుండా ప్రత్యా మ్నాయ సాగునీటి వనరులను గుర్తించాలని మంత్రి ఆదేశించారు. తాగునీరు, వ్యవసాయం.. కేవలం ఈ రెండు అంశాలపైనే రోజంతా ఫలవంతంగా చర్చించడం ఇదే మొదటిసారని మంత్రి గుర్తు చేశారు. గతంలో ఉద యం 11.30 గంటలకు సమీక్ష ప్రారంభించి..మధ్యాహ్నం 1.30 గంటలకు ముగించేవారన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ తాగునీటి ఎద్దడి నివారణకు ప్రతి ఎంపీడీఓకు రూ.లక్ష కేటా యించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ ప్రాం తాల్లోని నీటి సమస్యలను మంత్రి, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ శ్రీనాథ్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ సీఈఓ ఎం.విశ్వేశ్వరనాయుడు, జిల్లా పంచాయతీ అధికారి కేఎల్‌ ప్రభాకర్‌రావు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ జే హరిబాబు, కర్నూలు మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.   

విపత్తులు ఎదుర్కోవడమే ముందున్న లక్ష్యం 
విపత్తులు, ఇతర అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడమే అగ్ని మాపక శాఖ ముఖ్య లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రూ.3.20 కోట్లతో  కొత్తగా కొనుగోలు చేసిన 8 అగ్ని మాపక వాహనాలను శనివారం ఆయన కర్నూలు ఎస్టీబీసీ కళాశాల ఆవరణలో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రత, సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన వెల్లడించారు. అందుకు తగ్గట్టుగా అగ్ని మాపక శాఖ అధికారులు పనిచేయాలని సూచించారు. విపత్తు సమయాల్లో వచ్చే ఫైర్‌ కాల్స్‌పై వెంటనే స్పందించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఫైర్‌ స్టేషన్‌ భవనాల మరమ్మతు, కొత్త భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. అగ్ని మాపక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రాధాన్యత క్రమంలో భర్తీ చేస్తామన్నారు. పొదుపు మహిళలకు వడ్డీ లేని రుణాల మంజూరుకు ప్రభుత్వం రూ.1,140 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. ఎన్నికల నాటికి పొదుపు మహిళలకు ఉన్న రుణాల మొత్తాన్ని నాలుగేళ్లలో వారికే చెల్లించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణకు ఇస్తున్న శిక్షణ అందరికీ ఉపయోగపడేలా ఉందన్నారు.

అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ అనురాధ మాట్లాడుతూ విపత్తులు, అగ్ని, విద్యుత్, గ్యాస్, పెట్రోలియం వంటి ప్రమాదాలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఫైర్‌ కాల్‌ వచ్చిన మరుక్షణమే బయలుదేరి సంఘటనా స్థలానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.  ప్రమాద ప్రాంతాల్లో మంటలు ఆర్పడంతోపాటు ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. రెస్క్యూ, ప్రమాదాల్లో వాహనాల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు తమ వద్ద ప్రత్యేక పరికరాలు ఉన్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ, కర్నూలు, కోడుమూరు, నందికొట్కూరు ఎమ్మెల్యేలు, కలెక్టర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి, డీఐజీ వెంకటరామిరెడ్డి, రీజినల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ (సదరన్‌ రీజియన్‌) స్వామి, జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ వి.శ్రీనివాసరెడ్డి, ఏడీఎఫ్‌ఓ జయన్న, కర్నూలు స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ ప్రభాకర్, వైఎస్సార్‌సీపీ నాయకులు తోట వెంకట కృష్ణారెడ్డి, సీహెచ్‌ మద్దయ్య, ధనుంజయ ఆచారి పాల్గొన్నారు. అనంతరం ఫైర్‌ సిబ్బంది ప్రదర్శన ఇచ్చారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top