
రిపబ్లిక్ డే సందర్భంగా విద్యుత్ వెలుగులతో విరాజిల్లుతున్న విజయవాడలోని రాజ్‌భవన్
సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, అమరావతి: గణతంత్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సర్వసన్నద్ధమైంది. ఆదివారం జరిగే 71వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఆయన వచ్చే ముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ స్టేడియానికి చేరుకోనున్నారు.
ఈ వేడుకలకు నగర కమిషనర్ ద్వారకా తిరుమలరావు నేతృత్వంలో దాదాపు 700 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. సరిగ్గా ఉదయం 9 గంటలకు జాతీయ గీతంతో గణతంత్ర వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం గవర్నర్ వాహనంలో పెరేడ్‌ను తిలకిస్తారు. తర్వాత మార్చ్‌ఫాస్ట్ కార్యక్రమం ఉంటుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన 14 శకటాలను ప్రదర్శిస్తారు. 9.41 గంటలకు గవర్నర్ ప్రసంగిస్తారు. 10.05 గంటలకు జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగుస్తుంది.
గణతంత్ర వేడుకలకు రాజ్‌భవన్ సిద్ధం
గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాజ్ భవన్ సిద్ధ్దమైంది. రాజ్‌భవన్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, పలువురు ఉన్నతాధికారులు ఎట్ హోమ్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై శనివారం సమీక్ష నిర్వహించారు. భద్రతాపరమైన కారణాల నేపథ్యంలో అన్ని వాహనాలనూ రాజ్‌భవన్ మెయిన్ గేటు వద్దే నిలిపివేయనున్నట్లు మీనా తెలిపారు. సీఎం వైఎస్ జగన్, హైకోర్టు సీజే జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్‌ల వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు.