ఉలికిపాటు | Police teams alert on maoist | Sakshi
Sakshi News home page

ఉలికిపాటు

Mar 13 2014 3:07 AM | Updated on Oct 9 2018 2:51 PM

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మందుపాతర పేల్చి పదకొండు మంది సీఆర్పీఎఫ్ జవానులను, నలుగురు పోలీసులను, ఒక పౌరుడిని హతమార్చడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ :  ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మందుపాతర పేల్చి పదకొండు మంది సీఆర్పీఎఫ్ జవానులను, నలుగురు పోలీసులను, ఒక పౌరుడిని హతమార్చడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దుగా ఉండటం, జిల్లాలో దట్టమైన అడవులు ఉండటంతో మావోయిస్టులు ప్రవేశించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు సరిహద్దుల్లోని పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

 రెండు నెలల వ్యవధిలోనే సార్వత్రిక, స్థానిక, మున్సిపల్ ఎన్నికలు ఉండటం, నక్సల్స్ అలజడి తోడవడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఉందని, అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీ సులకు డీజీపీ ప్రసాద్‌రావు సూచించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనాన్ని అనువణువు  తనిఖీ చేస్తున్నారు.

 మావోయిస్టు ప్రభావిత ఠాణాలు
 ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పదకొండింటిని మావోయిస్టు ప్రభావిత ఠాణాలుగా గుర్తించారు. ఇందులో వాంకిడి, సిర్పూర్, బెజ్జూర్, దహెగాం, ఈద్గావ్, తిర్యాణి, నెన్నెల, కోటపల్లి, చెన్నూరు, నీల్వాయి, భీమినీ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పది బృందాలుగా ప్రత్యేక బలగాలతోపాటు, రెండు గ్రేహౌండ్స్ బలగాలను ఏర్పాటు చేసి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వీటితోపాటు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఎనిమిది చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి బందోబస్తు ఉంచారు. ఇందులో వాంకిడి వెంకటాపూర్, కొబ్బాయి, కరంజి, ఘన్‌పూర్, స్వర్ణ, బోరజ్, బెల్త్రోడాలు ఉన్నాయి. ప్రత్యేక పోలీసు బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

 యాక్షన్ టీంల కదలికలు
 జిల్లా సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రాల నుంచి మావోయిస్టు యాక్షన్ టీంలు జిల్లాలో రెక్కీలు నిర్వహించే ప్రమాదం ఉన్నట్లు రాష్ట్ర పోలీసు శాఖ నుంచి జిల్లా పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర పోలీసులతో జిల్లా పోలీసులు అందుబాటులో ఉండి ఏజెన్సీ ప్రాంతాల్లో నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లా నుంచి 37 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యలాపాల్లో ముఖ్యభూమిక పోషిస్తున్నారు.

ముగ్గురు దళ కమాండర్‌లు ఉండగా 20 మంది వరకు రాష్ట్ర, సెంట్రల్ కమిటీల్లో, మిలటరీ ప్లాటూన్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా మంది దళ సభ్యులుగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. జిల్లాకు సంబంధించిన మావోలు ఉండటంతో నిఘా పెంచారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని గడ్చిరోలి ప్రాంతంతోపాటు మిగతా ప్రాంతాల్లో నిఘా పెంచారు. అనుమానితులను విచారించేలా చర్యలు తీసుకుంటున్నారు.

 భయం.. భయంగా..
 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తమ వ్యూహాలను పదును పెడుతున్న రాజకీయ నేతల్లో కూడా మావోల కదలికలు భయం పుట్టిస్తున్నాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోటీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితుల్లో నిలబడ్డ అభ్యర్థుల ప్రచారానికి వెళితే ఏం జరుగుతుందోనని ఆందోళన వీరిలో వ్యక్తమవుతోంది. మరోవైపు అటవీ ప్రాంత గ్రామాల్లోకి ప్రచారం నిమిత్తం వెళ్లే రాజకీయ నాయకులకు భద్రత కల్పించడం కూడా పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.

ప్రచారం సమయంలో పోలీసులకు సరైన వివరాలు తెలుపకుండా అటవీ ప్రాంత గ్రామాల్లోకి వెళ్లొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎన్నికలు, మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉండటంతో సరిహద్దు ప్రాంతాల్లో, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక బలగాలను మోహరించాయి. ఈ క్రమంలో ఎప్పుడు ఏం జరుగుతోందని ప్రజలు, గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement