దొంగతనాలపై పోలీసులు ఓ వైపు అవగాహన సదస్సు నిర్వహిస్తుండగా.. అక్కడికి సమీపంలోని ఓ ఇంట్లో కొందరు దుండగులు దోపిడీకి
విజయనగరం క్రైం: దొంగతనాలపై పోలీసులు ఓ వైపు అవగాహన సదస్సు నిర్వహిస్తుండగా.. అక్కడికి సమీపంలోని ఓ ఇంట్లో కొందరు దుండగులు దోపిడీకి పాల్పడి ఝలక్ ఇచ్చారు. మహిళను కత్తితో బెదిరించి 3 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. పోలీసులు నివ్వెరపోయేలా జరిగిన ఈ దోపిడీ వివరాలిలా ఉన్నాయి. విజయనగరం పట్టణంలోని ఉడా కాలనీ ఫేజ్-4లో చౌదరి సరోజమ్మ, నర్సయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. దొంగతనాల నిరోధంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వన్‌టౌన్ పోలీసులు పాల్‌నగర్ వద్ద శనివారం సాయంత్రం సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు నర్సయ్య వెళ్లారు. అదే సమయంలో నలుగురు యువకులు ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. సరోజమ్మ నోట్లో గుడ్డలు కుక్కి మెడపై కత్తి పెట్టి బెదిరించారు. ఆమె వద్ద ఉన్న 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. సదస్సు ముగిశాక ఇంటికి చేరుకున్న నర్సయ్య దోపిడీ గురించి తెలుసుకున్నారు. వెంటనే వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. విజయనగరం డీఎస్పీ పి.వి.రత్నం, సీసీఎస్ డీఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి, వన్‌టౌన్ సీఐ ఆర్.శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు.
బొబ్బిలిలో తనిఖీలు
బొబ్బిలి: విజయనగరంలో దోపిడీ జరిగినట్టు సమాచారం అందటంతో శనివారం రాత్రి బొబ్బిలి పోలీసులు స్థానిక రైల్వేస్టేషన్ జంక్షన్‌లో వాహనాలను తనిఖీ చేశారు. బొబ్బిలి డీఎస్పీ బీవీ రమణమూర్తి, సీఐ తాండ్ర సీతారాంల పర్యవేక్షణలో పోలీసులు విజయనగరంవైపు నుంచి వచ్చిన వాహనాలు, బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎస్‌ఐలు నాయుడు, ప్రసాద్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు హఠాత్తుగా వాహనాలను తనిఖీ చేయటంతో స్థానికులు కంగారు పడ్డారు.