‘పోలవరం’ రద్దు చేయాలి | Polavaram project should be cancelled, demands Telangana students JAC | Sakshi
Sakshi News home page

‘పోలవరం’ రద్దు చేయాలి

Nov 6 2013 5:45 AM | Updated on Aug 21 2018 8:34 PM

తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాన్ని ముంపునకు గురిచేసి ఆంధ్ర నాయకుల, కాంట్రాక్టర్ల స్వార్థం కోసం నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని తెలంగాణ విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ), తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర కన్వీనర్ చార్వాక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాన్ని ముంపునకు గురిచేసి ఆంధ్ర నాయకుల, కాంట్రాక్టర్ల స్వార్థం కోసం నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని తెలంగాణ విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ), తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర కన్వీనర్ చార్వాక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలను మోసగించేందుకు తెలపెట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం ఆపకపోతే తెలంగాణ ప్రజలు పెద్దఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతారని హెచ్చరించారు. గతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందిర్శంచేందుకు వెళ్లిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులను పోలీసులు అడ్డగించారని చెప్పారు.
 
 విద్యతోపాటు సమాజాన్ని చదివే హక్కు విద్యార్థులకు ఉందని అన్నారు. కొన్ని  రాజకీయ పార్టీలు కేవలం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని కోరడాన్ని ఆయన తప్పుబట్టారు. జాతీయ హోదా కల్పించాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగదని అన్నారు. రాజకీయ పార్టీలన్నీ ఏకమై పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరిస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్పినప్పటికీ అది ఆచరణలోకి రాలేదని విమర్శించారు. హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచటాన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధానిగా ఉండాలన్నారు. ఇదే డిమాండుతో పది విద్యార్థి సంఘాలు కలిసి ఈ నెల 6వ తేదీ నుంచి ‘ఉత్తర తెలంగాణ బస్సు యాత్ర’ను ఉస్మానియా యూనివర్శిటీలో ప్రారంభిస్తాయని చెప్పారు. ఈ యాత్ర 9వ తేదీన భద్రాచలంలో ముగుస్తుందని, ఆ సందర్భంగా భారీ సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ యాత్ర ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల మీదుగా భద్రాచలం చేరుకుంటుందన్నారు.
 
 ఆదివాసీ సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు సోందె వీరయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో ఏజెన్సీలోని ఆదివాసీలను, దళితులను పాలకులు బలిదానం చేస్తున్నారని విమర్శించారు. సీమాంధ్ర నాయకులను సంతృప్తిపరిచేందుకే భద్రాచలాన్ని ఆంధ్రాలో కలిపేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివాసీలకు, వారి హక్కులకు తెలంగాణ రాష్ర్టంలోనే మనుగడ ఉందని అన్నారు. భద్రాచలాన్ని తెలంగాణలో ఉంచాలన్న డిమాండుతో టీజేఏసీ నాయకులు చేస్తున్న ఉద్యమాలకు గిరిజన సంఘాలు మద్దతునిస్తున్నాయని అన్నారు. పోలవరం ప్రధాన సమస్యగా గిరిజన సంఘాలన్నీ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ సమావేశంలో టీజేఏసీ మండల కన్వీనర్ అలవాల రాజామాదిగ, వివిధ సంఘాల నాయకులు సోడె చలపతి(ఆదివాసీ విద్యార్థి సంఘం), ముర్రం వీరభద్రం(గిరిజన సంక్షేమ పరిషత్), దాసరి శేఖర్(మాల మహానాడు) తదితరులు పాల్గొన్నారు.
 
 జయప్రదం చేయండి
 ఖమ్మం మామిళ్లగూడెం: ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు జరిగే ‘ఉత్తర తెలంగాణ బస్సు యాత్ర’ను జయప్రదం చేయాలని తెలంగాణ విద్యార్థి సంఘాల జేఏసీ కోరింది. ఈ యాత్ర వాల్ పోస్టర్‌ను జేఏసీ నాయకులు మంగళవారం ఖమ్మంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. ఈ యాత్రను తెలంగాణవాదులంతా జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజాఫ్రంట్  రాష్ట ప్రధాన కార్యదర్శి  నలమల కృష్ణ, టీఎస్ జేఏసీ జిల్లా కన్వీనర్ నాగరాజు, టీవీవీ జిల్లా అధ్యక్షుడు చార్వాక, టీపీఎఫ్ నాయకులు రమేష్, వెంకన్న, శ్రీనివాస్, ఖాదర్ బాబా, వెంకటేశ్వర్లు, శ్రీను, శివ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement