కిలో ప్లాస్టిక్‌..కప్పు కాఫీ..

Plastic Parlor To Open In Visakhapatnam Tomorrow - Sakshi

రేపటి నుంచి ప్లాస్టిక్‌ పార్లర్‌ ప్రారంభం 

ప్లాస్టిక్‌ నియంత్రణకు కృషి చేస్తూ 

ఇండియా యూత్‌ ఫర్‌ సొసైటీ వినూత్న ఆలోచన 

సాక్షి, విశాఖపట్నం: ప్లాస్టిక్‌ భూతం ప్రపంచాన్ని శాసిస్తోంది. పర్యావరణాన్ని ప్రమాదంలో పడేస్తోంది. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చాలా మంది ఇస్తుంటారు. వాటిని ఆచరణలో పెట్టమంటే మాత్రం ఒకడుగు వెనక్కు వేస్తుంటారు. కానీ.. పర్యావరణంపై నిజమైన ప్రేమ ఉన్నవారు మాత్రం సంకల్పంతో ముందడుగు వేస్తారు. సరిగ్గా అలాంటి వినూత్న ఆలోచనతోనే ప్లాస్టిక్‌ నియంత్రణకు తమవంతు కృషి చేస్తున్నారు ఇండియా యూత్‌ఫర్‌ సొసైటీ ప్రతినిధులు. ఇందుకోసం బీచ్‌రోడ్డులో ఓ ప్రత్యేక పార్లర్‌ను ఈ నెల 27న ప్రారంభించనున్నారు.

మీకు కాఫీ తాగాలని ఉందా? అయితే.. మీ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్‌ కవర్లు, బాటిల్స్, ఇతర వ్యర్థాలు తీసుకురండి.. మంచి కాఫీని సముద్రం ఒడ్డున కూర్చొని ఆస్వాదించండి... 
ఆకలిగా ఉందా..? బ్రేక్‌ఫాస్ట్‌ చెయ్యాలని అనుకుంటున్నారా..? ఇంకెందుకాలస్యం.. మొత్తం ప్లాస్టిక్‌ని పోగెయ్యండి.. మంచి సమతులాహారాన్ని లాగించెయ్యండి..? 
ఇదేంటి..? ప్లాస్టిక్‌కు.. కాఫీ, టిఫిన్‌కు ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా.? ఇదే ఇప్పుడు ట్రెండ్‌.. పర్యావరణ పరిరక్షణకు కీలకమైన ప్లాస్టిక్‌ నియంత్రణ కోసం ఇండియా యూత్‌ ఫర్‌ సొసైటీ బీచ్‌రోడ్డులో మొబైల్‌ పార్లర్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 27న బీచ్‌రోడ్డులోని వైఎంసీఏ ఎదురుగా ‘ప్లాస్టిక్‌ పార్లర్‌’ను ప్రారంభిస్తున్నారు. గివ్‌ ప్లాస్టిక్‌.. గెట్‌ ప్రొడక్ట్స్‌ నినాదంతో ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణకు ఈ పార్లర్‌ మొదలు పెడుతున్నారు.

ప్లాస్టిక్‌ నియంత్రణకు.. 
దేశవ్యాప్తంగా ‘ప్లాస్టిక్‌ ఇచ్చి పుచ్చుకో’ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. కేజీ ప్లాస్టిక్‌ ఇస్తే.. కేజీ బియ్యం ఇచ్చిన కార్యక్రమంతో ఈ ఉద్యమం మొదలైంది. ఇటీవల హైదరాబాద్‌లో దోసపాటి రాము అనే సామాజిక వేత్త.. ప్లాస్టిక్‌ కవర్లు ఇస్తే.. నర్సరీలో నచ్చిన మొక్కని తీసుకెళ్లి పచ్చదనాన్ని పెంపొందించండి అంటూ మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే స్ఫూర్తితో తాజాగా ఇండియా యూత్‌ఫర్‌ సొసైటీ ప్రతినిధులు ప్లాస్టిక్‌ పార్లర్‌ను ప్రారంభిస్తున్నారు. దాదాపు నెల రోజుల పాటు ఈ పార్లర్‌ను నడుపుతామని సొసైటీ అధ్యక్షుడు అప్పలరెడ్డి తెలిపారు. మొత్తంగా 30 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించడమే లక్ష్యంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించామని వివరించారు. ప్రజల్లో అవగాహన కలి్పంచి.. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడంలో తమ వంతు పాత్ర పోషించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. విశాఖ నగర ప్రజలంతా తమ ప్రయత్నానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ పార్లర్‌లో ధరలివీ.. 
►కప్పు కాఫీ కావాలంటే.. 1 కిలో ప్లాస్టిక్‌ ఇవ్వాలి
►ఒక క్లాత్‌ బ్యాగ్‌ కావాలంటే.. 2 కిలోల ప్లాస్టిక్‌ ఇవ్వాలి
►ఒక జ్యూట్‌ బ్యాగ్‌ కావాలంటే.. 4 కిలోల ప్లాస్టిక్‌ ఇవ్వాలి
►100 మి.లీ. పాలు, 2 బిస్కెట్లు, నట్స్, 1 అరటిపండు,  ఉడకబెట్టిన గుడ్డు మెనూతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ తినాలంటే.. 3 కిలోల ప్లాస్టిక్‌ ఇవ్వాలి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top