'వర్షిం'చిన ముడుపులు !

permissions granted for varsha hospital opening - Sakshi

మళ్లీ తెరుచుకున్న వర్షా ఆస్పత్రి

పరోక్షంగా సహకరించిన ఆరోగ్యశాఖ

అధికారులకు భారీగా ముడుపులు ?

అనంతపురం న్యూసిటీ: నగరంలోని వర్ష ఆస్పత్రి తిరిగి తెరుచుకోవడం హాట్‌ టాపిక్‌గా మారింది. గత నెల 21న నగరంలోని వర్ష ఆస్పత్రిలో రక్తమార్పిడి, వివిధ కారణాలను చూపుతూ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కేవీఎన్‌ఎస్‌ అనిల్‌కుమార్‌ పంచనామా చేసి ఆస్పత్రిని సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే వైద్యాధికారులే తిరిగి ఆస్పత్రి తెరిచేందుకు అనుమతులివ్వడం విమర్శలకు దారితీస్తోంది. దీని వెనుక భారీగా ముడుపుల బాగోతం నడిచాయన్న ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి.

రాత్రికి రాత్రే కమిటీలు
వర్ష ఆస్పత్రి సీజ్‌ జిల్లాలోనే ఇది పెద్ద సంచలనమైంది.డీఎంహెచ్‌ఓ తీసుకున్న నిర్ణయంతో  నగరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆస్పత్రి నిర్వహణలో చాలా లోపాలున్నాయి, ఎటువంటి సురక్షిత ప్రమాణాలు లేవని డీఎంహెచ్‌ఓ తేల్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 2న ఆస్పత్రి నిర్వాహకురాలు డాక్టర్‌ సుప్రజాచౌదరి, ఇద్దరు వ్యక్తులు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని డెమో ముందు కూర్చుని వివరణ ఇచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా ఈ నెల 13న డీఎంహెచ్‌ఓ ఆస్పత్రిని తనిఖీ చేసేందుకు ఐదు మంది సభ్యులతో వెళ్లారు. ఈ విషయాలను బయటకు పొక్కనీయకుండా డీఎంహెచ్‌ఓ, డెమో జాగ్రత్త పడ్డారు. వాస్తవంగా ఈ నెల 11న కమిటీ వేశామని వైద్య ఆరోగ్యశాఖాధికారి చెబుతున్నా.. కమిటీ లిస్టులో మాత్రం తేదీని ఈ నెల 7 అని పెన్‌తో రాశారు. దీన్ని బట్టి పక్కా ప్లాన్‌తోనే వర్ష ఆస్పత్రిని ఓపెన్‌ చేసేందుకునే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పరోక్షంగా సహకరించారన్న ఆరోపణలు వినబడుతున్నాయి.

నిర్వాహకులకే తాళాలు
ఆస్పత్రిని సీజ్‌ చేసిన అధికారులు వారి సమక్షంలోనే తిరిగి ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు ఓపెన్‌ చేసుకునేందుకు నిర్వాహకుల చేతికే తాళాలివ్వడం పలు విమర్శలు తావిస్తోంది. ఇదే విషయాన్ని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కేవీఎన్‌ఎస్‌ అనిల్‌కుమార్‌ను సాక్షి ఆరా తీస్తే డెమో వెళ్లారని సమాధానం ఇచ్చారు. డెమో ఉమాపతిని ఆరా తీస్తే ఆర్డర్‌ ఇచ్చాం వారే ఓపెన్‌ చేసుకోవాలని చెప్పామన్నారు.

ప్రాక్టీస్‌కు అనుమతివ్వలేదు
వర్ష ఆస్పత్రిలో ప్రాక్టీస్‌ చేసుకునేందుకు ఇంకా అనుమతివ్వలేదు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేశాం. వారి నుంచి రిపోర్టు వచ్చాకే ప్రాక్టీస్‌కు అనుమతిస్తాం.
 – డాక్టర్‌ కేవీఎన్‌ఎస్‌ అనిల్‌కుమార్,డీఎంహెచ్‌ఓ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top