జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వడం నుంచి కళాశాలల్లో ప్రవేశం.. ఆ తర్వాత ఉద్యోగం వరకూ..
సాక్షి, ఏలూరు: జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వడం నుంచి కళాశాలల్లో ప్రవేశం.. ఆ తర్వాత ఉద్యోగం వరకూ.. వృద్ధాప్య పింఛను నుంచి వ్యవసాయ రుణాలు, విద్యుత్ సర్వీసులు.. చివరకు ఆస్పత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలు, ఆపరేషన్ల వరకూ ప్రతిచోటా అవినీతి పేరుకుపోయింది. జనం కూడా దానికి అలవాటుపడిపోయారు. కానీ రోజులు మారుతున్నాయి. జనం ఆలోచనా దృక్పథంలో మార్పులు వస్తున్నాయి.
అటెండర్ స్థాయి నుంచి ఉన్నతాధికారి వరకూ లంచం ఇవ్వనిదే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏపనీ జరగదని, ఎంతోకొంత ఇచ్చేస్తే అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగక్కరలేదనే అపోహల నుంచి జనం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకూ 11 మంది లంచావతారాలను ప్రజలే ఏసీబీకీ పట్టించారు. తమను పట్టిపీడించే అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. దీంతో ప్రజల్ని డబ్బులు అడగాలంటే అక్రమార్కులు భయపడుతున్నారు.
మేలుకున్న ఏసీబీ
ఇన్నాళ్లూ నిద్రాణంలో ఉన్న అవినీతి నిరోధక శాఖ జన చైతన్యంతో మేలుకుంది. జిల్లాలో ఈ శాఖ ఉందనే విషయాన్ని రెండేళ్లపాటు జనం మర్చిపోయారు. 2011లో మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ రాష్ట్ర స్థాయిలో సమరం ప్రారంభించింది. జిల్లాల్లో మద్యం వ్యాపారులు, వారికి సహకరించిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారుల గుండెల్లో అప్పట్లో దడ పుట్టించింది. ఆ సమయంలో జిల్లాలో మద్యం సిండికేట్ల వ్యవహారాన్ని తేల్చడానికి జిల్లా ఏసీబీలో కీలక అధికారులెవరూ లేకపోవడంతో విజయవాడ నుంచే వచ్చేవారు. ప్రతిసారి వారు రావడం, ఇక్కడ రికార్డులు తనిఖీ చేడయం కష్టంగా ఉందని భావించి జిల్లా ఏసీబీ కార్యకలాపాలను విజయవాడ ప్రధాన కార్యాలయానికి తాత్కాలికంగా బదలాయించారు.
ఈ పరిణామంతో జిల్లా ఏసీబీని ఎత్తివేశారనే అపోహలు తలెత్తాయి. వాటికి బలం చేకూర్చేలా అవినీతి నిరోధర శాఖ జిల్లాలో 2012లో కేవలం ఇద్దరిని మాత్రమే పట్టుకోగలిగింది. ఏ శాఖపైనా స్వయంగా దాడులు జరపలేదు. ప్రజల నుంచి వచ్చిన విమర్శల అనంతరం కళ్లు తెరిచిన ఏసీబీ ఏడాదిగా జిల్లాలో ఉనికిని కాపాడుకునే పనిలో పడింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోస్టర్లు అతికించింది. వాటిలో ఫోన్ నంబర్లను పొందుపరిచింది. అవినీతిపరుల గురించి తమకు తెలియజేయమని, సమాచారాన్ని చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అభ్యర్థించింది. ఎట్టకేలకు ఈ ప్రయత్నం కాస్త ఫలితమిచ్చింది. ఈ ఏడాది జిల్లాలో 11 మంది అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు. వీరందరినీ జనమే పట్టించారు.
‘సాక్షి’ సైతం: అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ప్రజల్ని పీడిస్తున్న ప్రభుత్వ అధికారుల గుట్టువిప్పి ‘సాక్షి’ ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతోంది. సోమవారం ఏసీబీ వలలో చిక్కిన జిల్లా క్షయ నియంత్రణ శాఖ అధికారి ఆర్.సుధీర్‌బాబు లీలలను గతేడాది నవంబర్‌లో అవినీతి అ‘క్షయ’ం శీర్షికన బయటపెట్టింది. ఆ కథనం అప్పట్లో అధికార వర్గాల్లో సంచలనం రేపింది. విద్యుత్ శాఖలోనూ పేరుకుపోయిన అవినీతిపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో ఆ శాఖపైనా విజిలెన్స్, ఏసీబీ ప్రత్యేక నిఘా ఉంచినట్లు సమాచారం.