నగరానికి ఎక్కిళ్లు !

People Suffering With Water Problem In Krishna - Sakshi

విజయవాడలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి

కొండ ప్రాంతాల్లో కానరాని ట్యాంకర్లు

జనాభాకు అనుగుణంగా లేని పైపులైన్లతో ఇబ్బందులు

బెజవాడలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. ఓ పక్క మండుటెండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరో పక్క గుక్కెడు నీరు దొరక్క నగరవాసుల గొంతులెండిపోతున్నాయి. ట్యాంకర్ల వద్ద బిందెడు నీరు పట్టుకోవాలంటే భగీరధ ప్రయత్నం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో  నివసించే వారి పరిస్థితి దయనీయంగా ఉంది. రెండు మూడు రోజులకొకసారి కూడా నీళ్లు రాకపోవడంతో రోజువారీ అవసరాలూ తీర్చుకోలేకపోతున్నామని వాపోతున్నారు. గొంతు తడవక ఎక్కిళ్లు వస్తున్నాయంటున్నారు.

సాక్షి, అమరావతి బ్యూరో : రాజధాని నేపథ్యంలో నగరంలో ప్రస్తుత జనాభా  దాదాపు 15 లక్షల వరకు చేరింది  పెరుగుతున్న జనాభాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య క్రమేపీ పెరగటం, శివారు ప్రాంతాల్లో నూతన గృహ సముదాయాలు ఏర్పడటంతో తాగునీటి డిమాండ్‌ పెరిగింది. శివారు ప్రాంతాల్లోని రామలింగేశ్వరనగర్, ప్రకాష్‌నగర్, భవానీపురం, కరెన్సీనగర్‌లో ఇటీవల కాలంలో భవన నిర్మాణాలు  ఎక్కువయ్యాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా నీటి సరఫరా కావడం లేదు. కొండప్రాంతాలైన వన్‌టౌన్‌లోని ఆంజనేయవాగుసెంటర్, చిట్టినగర్, భవానీపురం, ఎర్రకట్ట, గుణదల గంగిరెద్దుల దిబ్బ ప్రాంతం, మాచవరం, గుణదల,  మొగల్రాజపురం, క్రీస్తురాజపురం ప్రాంతాలతోపాటు పటమట, ఆటోనగర్, భవానీపురం, కృష్ణలంక, ప్రకాష్‌నగర్, సింగ్‌నగర్‌లోని ఇందిరానాయక్‌నగర్‌ ప్రాంతంలో తాగునీటి కోసం జనం అలమటిస్తున్నారు.  ఆయా ప్రాంతాల్లో పాత పైపులైన్లు ద్వారానే నీటి సరఫరా కొనసాగుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. చాలా ప్రాంతాల్లో మూడు–నాలుగు అంగుళాల పైపులే ఉంటున్నాయని, వీటిని తొలగించి ఆరు అంగుళాల పైపులు మార్చాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

పురోగతి లేని పనులు...
కార్పొరేషన్‌ పరిధిలోని  59 డివిజన్లలో అ«ధికారులు సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేసినప్పటికీ పూర్తిస్థాయిలో నీటి ఎద్దడిని నిరోధించటంలో అధికారులు విఫలమయ్యారని విమర్శలొచ్చాయి. 14వ ఫైనాన్స్‌ కమిటీ నుంచి నిధులు ఖర్చు చేయటానికి పాలకపక్షం సిద్ధమయినప్పటికీ  కొండప్రాంతాల్లో, స్లమ్‌ ఏరియాల్లో రిజర్వాయర్ల నిర్మాణం, వాటర్‌ట్యాంకుల నిర్మాణాల విషయంలో అధికారులు  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొందరు కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇటీవల మేయర్‌ కోనేరు శ్రీధర్‌కు కార్పొరేటర్ల నుంచి పలు ప్రతిపాదనలు వచ్చాయి.  32వ డివిజన్‌లో 5 ఎంజీడీ ప్లాంట్‌కు ఇన్‌టెక్‌వెల్‌ నిర్మాణం, హెడ్‌ వాటర్‌వర్క్స్‌లోని 5 ఎంజీడీ ప్లాంట్‌ నిర్మాణం, 28వ డివిజన్‌లోని హౌసింగ్‌బోర్డు కాలనీలో 1500 కేఎల్‌ఎస్‌ఆర్‌ నిర్మాణం, 53వ డివిజన్‌లో ఎక్సెల్‌ప్లాంట్‌ హౌసింగ్, పక్కనే ఉన్న గద్దె వెంకటరామయ్యనగర్‌లో 1000 కేఎల్‌ కెపాసిటీ తాగునీటి నిర్మాణం చేయాలని తలపెట్టారు. ఇప్పటి వరకు పనుల పురోగతి లేదు.   2వ డివిజన్‌లోని కనకదుర్గా నగర్‌ కాలనీ, రామచంద్రనగర్, ఇతర క్రాస్‌ రోడ్లకు 400 ఎంఎం డయాట్రంక్‌లైన్‌ వేయటం, 12వ డివిజన్‌లోని పటమట లంకలోని 1500 కెఎస్‌ఎస్‌ఆర్‌ నిర్మాణం, 2వ డివిజన్‌లోని గురునానక్‌కాలనీలో 1000 కేఎల్‌ కెపాసిటీ ఈఎల్‌ఎస్‌ఆర్‌ నిర్మాణం, 19వ డివిజన్‌లోని నిమ్మతోట కొండ ప్రాంతంలో 200 కేఎల్‌ కెపాసిటీ జీఎల్‌ఎస్‌ఆర్‌ నిర్మాణం చేపట్టేదుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వేసవి ముగుస్తున్నా ఇప్పటి వరకు అక్కడ తలపెట్టిన పనుల్లో ఎలాంటి çపురోగతిలేదు.

కొండపైకి నీరు కష్టమే...
ఆయా ప్రాంతాల్లో సమ్మర్‌ యాక్షన్‌ప్లాన్‌ కింద రూ. 15 కోట్లు నిధులు ఖర్చుచేస్తున్నట్లు పాలకులు చేసిన ప్రకటనలు నీటి మూటలుగా మిగిలిపోయాయి. ఇప్పటి వరకు సమ్మర్‌ యాక్షన్‌ప్లాన్‌లో కొండప్రాంతాల్లో నీరు కొండపైకి ఎక్కేందుకు బూస్టర్లు కొత్తవి ఏర్పాటు చేయటం, పాతవి మరమ్మతులుకు చేయాలని ప్రకటించారే తప్పా వాటి ఆయా యంత్రాలు యథాతథంగా మరమ్మతులు జరుగుతునే ఉన్నాయి. ఆయా పనులకు, బూస్టర్ల కొనుగోలు/మరమ్మతులు, ఇతర పనులకు ఇప్పటి వరకు రూ. కనీసం రూ. 5 కోట్లు కూడా ఖర్చుచేసిన దాఖలాలు లేవని ప్రతి పక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు.

కొండ ప్రాంతవాసులంటే చులకన
కొండప్రాంతవాసులంటే ప్రభుత్వానికి, అధికారులకు చులకన భావం ఉన్నట్లుంది. రెక్కాడితే గానీ డొక్కాడని ప్రజలు నివసించే ప్రాంతంలో అర్ధరాత్రిపూట తాగునీరు సరఫరా చేస్తున్నారు. దీనికితోడు నీళ్లు ఇచ్చేది కూడా గంట మాత్రమే. అవసరమైన మేరకు నీరు సరఫరా చేయటంలో అధికారులు విఫలమయ్యారు. వేసవిలో ట్యాంకర్లను ఏర్పాటు చేయాల్సి ఉన్న మూడు–నాలుగు రోజులకు ట్యాంకర్లు వస్తున్నాయి. మా గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.     – కె. ఆంజనేయులు, చిట్టినగర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top