ఈత సరదా.. విషాదం కావొద్దు

People Should Fallow The Instruction While Swimming  - Sakshi

ఎగువన కురిసిన వర్షాలకు జిల్లాలో జలకళ సంతరించుకుంది. దీంతో అందమైన జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. మరోవైపు నదులు సైతం జలకళతో తొణికిసలాడుతున్నాయి.. నీటిని చూస్తే ఎవరికైనా జలకాలాటలు ఆడాలనిపించకమానదు.. అయితే అక్కడే ప్రమాదాలు పొంచి ఉన్నాయన్న విషయం గుర్తెరిగి వ్యవహరించాలి.. లేని పక్షంలో విహారం కాస్తా విషాదంగా మారే అవకాశాలు ఉన్నాయి.. నీటి వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కడుపుకోత తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో నీటిలో పడి పలువురు మృత్యువాత పడిన నేపథ్యంలో అప్రమత్తం చేసే ప్రత్యేక కథనం.. 

సాక్షి, కడప : నీటిని చూస్తే ఎవరికైనా ఆడుకోవాలనిపించక మానదు. దీనికి తోడు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు నదీతీరాల్లోనే ఉండటం విశేషం. ఈ ప్రదేశాలకు ఎంత ఉత్సాహంగా వెళతామో.. అంతే జాగ్రత్తగా మసలుకోవాలి. కడప నగరానికి సమీపంలోని పుష్పగిరి క్షేత్రానికి వెళ్లిన వారు అక్కడి సమీపంలోని ఆదినిమ్మాయకట్టలోని జలసోయగాలు చూసేందుకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇక్కడ నీరు పుష్కలంగా ఉండటంతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు తప్పవు. గతంలో జరిగిన పలు ప్రమాద సంఘటనలను గుర్తుంచుకుని మనం జాగ్రత్తగా వ్యవహరిస్తే మనం చేసే విహారయాత్ర.. ఆనందాన్ని మిగుల్చుతుంది.

నదీస్నానం సమయంలో అప్రమత్తత అవసరం..
శ్రావణమాసం, కార్తికమాసాలను హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. దీంతో సమీపంలోని పుష్పగిరి, గండి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు. ఈ సమయంలో నదీ స్నానాలకు వెళ్లే వారు అక్కడి స్థానికులతో మాట్లాడి నీటిలోతు గురించి తెలుసుకోవాలి. అదే విధంగా వీరి వెంట వెళ్లే చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు చిన్నారులను హెచ్చరిస్తూ ఉండాలి. నదిలో వెళ్లేటప్పుడు అంతా కలిసే ఉండాలి. ఏదైనా ప్రమాదం జరిగితే గుండెధైర్యంతో ఎదుర్కొవాలి. ఆలోచనా జ్ఞానం కోల్పోకూడదు. అదే విధంగా ఈత రానివారు నదులు, జలపాతాలకు కాస్త దూరంగా ఉండటం మేలు. ఈతరాని వారు గాలి నింపిన ట్యూబ్‌లను అందుబాటులో ఉంచుకోవాలి. నీటిలో ఎవరైనా మునిగిపోతుంటే ఆ సమయంలో నీట మునిగిన వ్యక్తిని కాపాడే యత్నం చేయాలి. ఈతరాని వారు దిగితే ఇరువురి ప్రాణాలకు ప్రమాదం. మునిగిపోతున్న వ్యక్తికి వెనుక నుంచి వెళ్లాలి. బాధితుడు సహకరించకపోతే అతని జుట్టు పట్టుకుని ఒడ్డుకు తీసుకురావాలి.

అధికారులు చేయాల్సినవి..
అధికారులు కూడా భక్తులు, పర్యాటకులు అధికసంఖ్యలో ఉండే ప్రాంతాల వద్ద నిఘా ఉంచాలి. ప్రమాదకర ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. రక్షణ కంచెలు ఏర్పాటు చేయడం మంచిది. ఈత తెలిసిన వ్యక్తులను అందుబాటులో ఉంచాలి. నీటిప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో గ్రామంలో, నదీపరివాహక ప్రాంతాల్లో దండోరా వేయించడం ద్వారా అవగాహన కల్పించాలి.

నీట మునిగితే చేయాల్సిన ప్రాథమిక చికిత్స..
⇒ నీట మునిగిన వ్యక్తికి శ్వాసకోశాల్లో నీరు చేరుతుంది. అందుచేత శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. నీటిని తాగడం వలన బురదనీరు శ్వాసకు అడ్డుపడవచ్చు. ఆ బురదను తొలగించే యత్నం చేయాలి.
⇒ అనంతరం ఆ వ్యక్తిని బోర్లా పడుకోబెట్టి ఓవైపుగా వీపు మీద గట్టిగా నొక్కి అదమాలి. ఈ విధంగా చేయడం ద్వారా అతని ఒంట్లో నుంచి, శ్వాసకోశాల్లోంచి కొంతనీరు బయటకు వస్తుంది.
⇒ ఇలా తనంతట తాను శ్వాస తీసుకునే వరకు నిమిషానికి 16 నుంచి 18 సార్లు నొక్కాలి.
⇒ తడిచిన దుస్తులు తొలగించి స్పృహలోకి రాగానే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

జాగ్రత్తలతో విహారం సుఖమయం..
నీటి వద్దకు వెళ్లే భక్తులు, పర్యాటక ప్రేమికులు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. జలపాతాల వద్ద పాచిపట్టి ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో ఏవైనా ఆధారం పట్టుకుని వెళ్లాలి తప్ప సాహసాలు చేయకూడదు. తుంటరి విద్యార్థులు ఒక్కోసారి ఆటపట్టించేందుకు చేసే యత్నాలు బెడిసికొడతాయి. ఆకతాయి పనులు జలకాలాటల్లో తగదు. నదీప్రాంతాల్లో లోతు తెలుసుకుని తక్కువ లోతు ఉన్న చోట స్నానాలు చేయడం మంచిది.     
– బాలగొండ గంగాధర్, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాధిపతి

అప్రమత్తతే శ్రీరామరక్ష..
నీటిప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈత కొట్టేందుకు దిగకూడదు. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి. నీటిలో ఎక్కడ గుంతలు ఉన్నాయో కొత్తవారికి తెలిసే అవకాశం ఉండదు. కనుక కొత్త ప్రదేశాల్లో తుంటరి చేష్టలు తగవు. నీటి ప్రవాహం ఉన్న చోట అప్రమత్తంగా ఉండటమే అన్నింటికీ మంచిది. 
– భూపాల్‌రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి, కడప 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top