
సాక్షి, అమరావతి: పాస్‌పోర్టు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. ఇప్పటివరకూ జనన ధ్రువీకరణకు ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్ లేదా పంచాయతీ లేదా మున్సిపాలి టీలు ఇచ్చిన పత్రాలు మాత్రమే చెల్లుబాటయ్యేది. ఇకపై ఆ అవసరం లేదు. ఆధార్, ఓటర్ కార్డుల్లోని పుట్టిన తేదీలను పరిగణనలోకి తీసుకుంటారు. భార్యాభర్తలు విడాకులకు దరఖాస్తు చేసుకుని పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే విధిగా భాగస్వామి పేరు రాయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ నిబంధనను కూడా సడలించారు. ఇప్పటికే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
తాజా మార్గదర్శకాల ప్రకారం
♦ ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటి వరకూ ఎన్‌వోసీ ఇవ్వవలసి వచ్చేది. ఇకపై తమ సర్వీసు రికార్డును చూపిస్తే సరిపోతుంది. పెన్షనర్లు అయితే పెన్షన్ పొందుతున్న వివరాలు ఇస్తే చాలు.
♦ టీసీ (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్), పాన్‌కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డుల్లో ఏవైనా రెండు ఉంటే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
♦ అనాథ పిల్లలు దరఖాస్తుకు అనాథ శరణాలయం లేఖ ఇస్తే సరిపోతుంది. లేదా శిశుసంరక్షణ సంస్థ తమ లెటర్‌హెడ్‌పైన వివరాలు రాసి ఇస్తే అనుమతిస్తారు.
♦ వివాహం అయిన మహిళ దరఖాస్తు చేసుకోవాలంటే మ్యారేజీ సర్టిఫికెట్ అక్కర్లేదు. భాగస్వామి పేరు రాస్తే సరిపోతుంది.
♦ విడాకులు తీసుకున్న వారు కోర్టు ధ్రువీకరించిన పత్రాలను కూడా సమర్పించాల్సిన అవసరం లేదు.
♦ సాధువులు, సన్యాసులు తమ గురువు పేరు రాసి దరఖాస్తు చేసుకోవచ్చు.
♦ తల్లీబిడ్డలు సమ్మతిస్తే భర్త పేరు రాయాల్సిన అవసరం లేదు.