పార్థీ గ్యాంగ్ పనేనా? | Parthi gang members escaped from prison Kandi SANGAREDDY | Sakshi
Sakshi News home page

పార్థీ గ్యాంగ్ పనేనా?

Apr 4 2016 1:09 AM | Updated on Oct 8 2018 6:18 PM

పార్థీ గ్యాంగ్ పనేనా? - Sakshi

పార్థీ గ్యాంగ్ పనేనా?

జిల్లాలో నెల రోజుల వ్యవధిలో సంచలనం రేకెత్తించిన రెండు హత్య కేసులు ఒకే తరహాలో జరిగాయి.

సంగారెడ్డి కంది జైలు నుంచి తప్పించుకున్న పార్థీ గ్యాంగ్ సభ్యులు     
ఒకే తరహాలో కావలి, పెద్దచెరుకూరుల్లో జంట హత్యలు
ఆ దిశగా పోలీసుల విచారణ
 

నెల్లూరు (క్రైమ్) : జిల్లాలో నెల రోజుల వ్యవధిలో సంచలనం రేకెత్తించిన రెండు హత్య కేసులు ఒకే తరహాలో జరిగాయి. దుండగులు నగదు కోసం వారిని అత్యంత కిరాతకంగా మట్టుపెట్టారు. ఈ తరహా నేరాలకు పాల్పడేదిపార్థీగ్యాంగ్‌గా అనుమానిస్తున్నారు. దేశంలోనే అత్యంత కరుడు గట్టిన నరరూప రాక్షసులుగా పిలువబడే పార్థీ గ్యాంగ్ జిల్లాలో మకాం వేసి ఈ దుశ్చర్యలకు పాల్పడుతోందా అనే అనుమానాలతో పోలీ సు యంత్రాగం అప్రమత్తమైంది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


 ఎవరీ పార్థీగ్యాంగ్
మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారు. మహారాష్ట్రలోని చత్రి, పర్బాని, నాసిక్, ఇంజన్‌ఘాట్, గుల్బర్గా, బాంబే, ఔరంగాబాద్, మధ్యప్రదేశ్, భూపాల్ తదితర ప్రాంతాల్లో వీరు నివసిస్తుంటారు. వీరి కుటుంబాల్లో అందరూ దోపిడీలు, దొంగతనాలు చేయడంలో సిద్దహస్తులు. కుటుంబాలు.. కుటుంబాలు ఉపాధి కూలీల్లా ఇతర ప్రాంతాలకు వలస వస్తారు. గ్రామ సరిహద్దులు, పట్టణశివార్లు, ఫ్లైఓవర్‌బ్రిడ్జిల కింద, రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్ల సమీపంలో గుడారాలు వేసుకుని సంచార జీవనం సాగిస్తారు. మహిళలు పగటి వేళల్లో వారు నివసిస్తున్న పరిసర ప్రాంతాల్లో చిత్తుకాగితలు ఏరుకోవడం, పిన్నీసులు, పూసలు అమ్మడం, బిచ్చం ఎత్తుకోవడం వంటివి చేస్తూ తమ పనులకు వీలుగా ఉండే ఇంటిని లక్ష్యంగా ఎంచుకుంటారు. రాత్రి వేళల్లో ఆ ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతారు.  


 ఆనవాళ్లు దొరక్కుండా..
 వీరు దొంగతనం చేసే ఇంటికి వెళ్లిన సమయంలో తమ ఆనవాళ్లను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుం టారు. వీరి వ్యవహార శైలి అత్యంత క్రూరం గా ఉంటుంది. లక్ష్యంగా ఎంచుకున్న ఇంట్లో భయానక వాతావరణం సృష్టిస్తారు. ఇంట్లో ఉన్న చిన్న, పెద్దా, వృద్ధులు, వికలాంగులనే తేడా లేకుండా అందర్ని అతి క్రూరంగా (రాడ్‌లు, కర్రలతో తలపై విచక్షణా రహితంగా కొట్టడం, కత్తులతో గొంతులు కోయడం) మట్టుపెట్టి అందిన కాడికి దోచుకెళుతారు. నేరానికి పాల్పడే సమయంలో ఎవరు అడ్డొచ్చినా వారిని హత మారుస్తారు.  పార్థీ గ్యాంగ్‌లు సుమారు 10 ఉండొచ్చని పోలీసు లు అంచనా. ఒక్కో బృందంలో 14 నుంచి 20 మంది సభ్యులు ఉన్నట్లు సమాచారం. గ్యాంగ్‌లో పురుషులే కాదు మహిళలు సైతం చురుకుగా వ్యవహరిస్తారు. ఈ గ్యాంగ్‌లోని పలువురిని 2007లో జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 2014లో వరంగల్, 2015లో విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. 2015 ఆగస్టులో కండి జైలు నుంచి సంగారెడ్డి కోర్టుకు తరలిస్తున్న నలుగురు పార్థీ గ్యాంగ్ సభ్యులు తప్పించుకున్నారు.


 గత నెలలో కావలిలో..
 ఈ ఏడాది మార్చి మొదటి వారంలో కావలిలోనూ ఇదే తరహాలో హత్య జరిగింది. మార్చి 4వ తేదీ సాయంత్రం రాజీవ్‌నగర్ అరటి తోటలో వెంకటేశ్వర్లురెడ్డి ఇంటికి ఓ దుండగుడు వచ్చాడు. ఇంటి బయట ఉన్న సుశీలమ్మను ఆధార్ కార్డు కావాలని కోరగా ఆమె ఎందుకని ప్రశ్నించింది. దీంతో కళ్లలో కారం చల్లి వెంట తెచ్చుకున్న ఆయుదంతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఇంట్లో ఉన్న ఆమె కోడలు కవితపై విచక్షణా రహితంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన భయానక వాతావరణాన్ని కల్పించింది. ఈ ఘటనపై కావలి పోలీసులు మహారాష్ట్రకు సైతం వెళ్లి పార్థీ గ్యాంగ్ కోసం ఆరా తీసినట్లు సమాచారం.


 తాజాగా పెద్దచెరుకూరులో...
 పెద్దచెరుకూరులోని చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో ఎన్. చంద్రమౌళీశ్వరరావు, పుష్పవేణి దంపతులు ఇట్లో నిద్రిస్తుండగా దుండగులు అతి కిరాతకంగా తలపై కొట్టి హత్య చేశారు. పుష్పవేణి మెడలోని బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు.  ఈ సంఘటన జరిగిన తీరు భయానక వాతావరణాన్ని కల్పించింది. ఈ మూడు ఘటనలు ఒకే తరహాలో చోటు చేసుకోవడంతో పార్థీ గ్యాంగ్ పనేగా పోలీసులు భావిస్తున్నారు.

 
 ఒకే తరహాలో నాలుగు హత్యలు
జిల్లాలో గడిచిన ఏడాదిన్నర కాలంలో ఒకే తరహాలో నాలుగు హత్యలు చోటు చేసుకున్నాయి. 2014 డిసెంబర్ 1వ తేదీన నగర శివారుల్లోని చింతాళమ్మ వైన్స్‌లో నైట్ సేల్స్‌మన్ దేవినేని శ్రీనివాసులు (38) హత్య జరిగింది. ఆ రోజు తెల్లవారు జామున నలుగురు యువకులు వైన్‌షాపులోనికి ప్రవేశించి బల్లపై నిద్రిస్తున్న శ్రీనివాసులు తలపై రాడ్‌తో విచక్షణా రహితంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. క్యాషియర్ చంద్రను సైతం తీవ్రంగా కొట్టి కౌంటర్‌లోని చిల్లర డబ్బులు, రెండు మద్యం బాటిళ్లను తీసుకెళ్లారు. ఈ హత్యకు పాల్పడిన పార్థీ గ్యాంగ్‌ను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement