breaking news
Parthi gang members
-
ముగ్గురు పార్థి గ్యాంగ్ సభ్యుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గత నెల 26న తార్నాకలో నివాసం ఉండే సతీష్ రెడ్డి ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చేధించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పార్థి గ్యాంగ్ ఈ నేరానికి పాల్పడినట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆరుగురు వ్యక్తులు దొంగతనానికి పాల్పడగా వారిలో మనీషా డిస్కో, అలీ రాజా ఖాన్, రూపా బాయ్‌లను అరెస్ట్‌చేశామన్నారు. అంతేకాక వారి వద్ద నుంచి 22 లక్షల రూపాయల విలువ చేసే 60 తులాల బంగారం, 2 కిలోగ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నమన్నారు. ఈ గ్యాంగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 2004 నుంచి దొంగతనాలకు పాల్పడుతుందని తెలిపారు. ఈ గ్యాంగ్ మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంజనీ కుమార్ పేర్కొన్నారు. మొదటిసారి మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు MP09CK2347 కార్లో వచ్చి దొంగతనం చేసి పారిపోయారన్నారు. ఆ తరువాత వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారని.. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, రేణిగుంట పోలీస్ స్టేషన్లలో ఈ గ్యాంగ్‌పై దాదాపు 12 కేసులు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ ఈ గ్యాంగ్‌లో 99శాతం మందికి ఉద్యోగం, ఉపాధి లాంటివి కల్పించామని.. మిగిలిన కొద్ది మంది ఇంకా ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నారని అంజనీ కుమార్ తెలిపారు. -
పెద్దపల్లిలో పట్టుబడ్డ ఇద్దరు ఖైదీలు
సహకరించిన ముత్తారం, గౌరెడ్డిపేట యువకులు పెద్దపల్లి : జిల్లా జైలు నుంచి శుక్రవారం అర్ధరాత్రి పారిపోయిన పార్థీ ముఠాకు చెందిన ఇద్దరు ఖైదీలను పెద్దపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. స్టేషన్ సమీపంలోని ముత్తారం, గౌరెడ్డిపేట గ్రామస్తులు ఇద్దరు ఖైదీలను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించారు. జిల్లా జైలు నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకున్నట్లు సమాచారం అందుకున్న పెద్దపల్లి సీఐ మహేశ్ వారు రైల్లో పారిపోయే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు పెద్దపల్లి, రాఘవాపూర్, కొత్తపల్లి పోలీసులను అప్రమత్తం చేశారు. రైల్వే స్టేషన్ల వద్ద నిఘా పెట్టారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్‌కు వస్తున్న ఖైదీలు యోగేందర్, జితేందర్ అక్కడే ఉన్న పోలీసులను గమనించి పరుగందుకున్నారు. పోలీసులు వారిని వెంబడించారు. ఈ క్రమంలో ముత్తారం, గౌరెడ్డిపేటకు చెందిన యువకులు కూడా పోలీసుల వెంట దొంగలను పట్టుకునేందుకు బయల్దేరారు. గ్రామస్తుల సహకారంతో ఖైదీలను అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తులు, పోలీసులను అభినందించిన ఎస్పీ పార్థీ ముఠా సభ్యులు పెద్దపల్లిలో పోలీసులకు చిక్కిన సమాచారం తెలుసుకున్న ఎస్పీ జోయల్ డేవిస్ ఇక్కడి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ప్రజలకు హాని కలిగిస్తున్న దొంగల ముఠాను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించిన ముత్తారం, గౌరెడ్డిపేట గ్రామస్తులను స్టేషన్‌కు ఆహ్వానించి సత్కరించారు. మాజీ ఉప సర్పంచ్ కొమురయ్య, ఆటో డ్రైవర్లు అస్గర్, ప్రవీణ్, మరో 14 మందిని అభినందించారు. దొంగలను పట్టుకున్న సీఐ మహేశ్, ఎస్సై శ్రీనివాస్‌తోపాటు కానిస్టేబుళ్లను అభినందించారు. ఎస్పీ వెంట గోదావరిఖని ఎఎస్పీ విష్ణు ఎస్.వారియర్ ఉన్నారు. -
పార్థీ గ్యాంగ్ పనేనా?
సంగారెడ్డి కంది జైలు నుంచి తప్పించుకున్న పార్థీ గ్యాంగ్ సభ్యులు ► ఒకే తరహాలో కావలి, పెద్దచెరుకూరుల్లో జంట హత్యలు ► ఆ దిశగా పోలీసుల విచారణ నెల్లూరు (క్రైమ్) : జిల్లాలో నెల రోజుల వ్యవధిలో సంచలనం రేకెత్తించిన రెండు హత్య కేసులు ఒకే తరహాలో జరిగాయి. దుండగులు నగదు కోసం వారిని అత్యంత కిరాతకంగా మట్టుపెట్టారు. ఈ తరహా నేరాలకు పాల్పడేదిపార్థీగ్యాంగ్గా అనుమానిస్తున్నారు. దేశంలోనే అత్యంత కరుడు గట్టిన నరరూప రాక్షసులుగా పిలువబడే పార్థీ గ్యాంగ్ జిల్లాలో మకాం వేసి ఈ దుశ్చర్యలకు పాల్పడుతోందా అనే అనుమానాలతో పోలీ సు యంత్రాగం అప్రమత్తమైంది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎవరీ పార్థీగ్యాంగ్ మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారు. మహారాష్ట్రలోని చత్రి, పర్బాని, నాసిక్, ఇంజన్‌ఘాట్, గుల్బర్గా, బాంబే, ఔరంగాబాద్, మధ్యప్రదేశ్, భూపాల్ తదితర ప్రాంతాల్లో వీరు నివసిస్తుంటారు. వీరి కుటుంబాల్లో అందరూ దోపిడీలు, దొంగతనాలు చేయడంలో సిద్దహస్తులు. కుటుంబాలు.. కుటుంబాలు ఉపాధి కూలీల్లా ఇతర ప్రాంతాలకు వలస వస్తారు. గ్రామ సరిహద్దులు, పట్టణశివార్లు, ఫ్లైఓవర్బ్రిడ్జిల కింద, రైల్వేస్టేషన్, బస్స్టేషన్ల సమీపంలో గుడారాలు వేసుకుని సంచార జీవనం సాగిస్తారు. మహిళలు పగటి వేళల్లో వారు నివసిస్తున్న పరిసర ప్రాంతాల్లో చిత్తుకాగితలు ఏరుకోవడం, పిన్నీసులు, పూసలు అమ్మడం, బిచ్చం ఎత్తుకోవడం వంటివి చేస్తూ తమ పనులకు వీలుగా ఉండే ఇంటిని లక్ష్యంగా ఎంచుకుంటారు. రాత్రి వేళల్లో ఆ ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతారు. ఆనవాళ్లు దొరక్కుండా.. వీరు దొంగతనం చేసే ఇంటికి వెళ్లిన సమయంలో తమ ఆనవాళ్లను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుం టారు. వీరి వ్యవహార శైలి అత్యంత క్రూరం గా ఉంటుంది. లక్ష్యంగా ఎంచుకున్న ఇంట్లో భయానక వాతావరణం సృష్టిస్తారు. ఇంట్లో ఉన్న చిన్న, పెద్దా, వృద్ధులు, వికలాంగులనే తేడా లేకుండా అందర్ని అతి క్రూరంగా (రాడ్లు, కర్రలతో తలపై విచక్షణా రహితంగా కొట్టడం, కత్తులతో గొంతులు కోయడం) మట్టుపెట్టి అందిన కాడికి దోచుకెళుతారు. నేరానికి పాల్పడే సమయంలో ఎవరు అడ్డొచ్చినా వారిని హత మారుస్తారు. పార్థీ గ్యాంగ్‌లు సుమారు 10 ఉండొచ్చని పోలీసు లు అంచనా. ఒక్కో బృందంలో 14 నుంచి 20 మంది సభ్యులు ఉన్నట్లు సమాచారం. గ్యాంగ్‌లో పురుషులే కాదు మహిళలు సైతం చురుకుగా వ్యవహరిస్తారు. ఈ గ్యాంగ్‌లోని పలువురిని 2007లో జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 2014లో వరంగల్, 2015లో విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. 2015 ఆగస్టులో కండి జైలు నుంచి సంగారెడ్డి కోర్టుకు తరలిస్తున్న నలుగురు పార్థీ గ్యాంగ్ సభ్యులు తప్పించుకున్నారు. గత నెలలో కావలిలో.. ఈ ఏడాది మార్చి మొదటి వారంలో కావలిలోనూ ఇదే తరహాలో హత్య జరిగింది. మార్చి 4వ తేదీ సాయంత్రం రాజీవ్‌నగర్ అరటి తోటలో వెంకటేశ్వర్లురెడ్డి ఇంటికి ఓ దుండగుడు వచ్చాడు. ఇంటి బయట ఉన్న సుశీలమ్మను ఆధార్ కార్డు కావాలని కోరగా ఆమె ఎందుకని ప్రశ్నించింది. దీంతో కళ్లలో కారం చల్లి వెంట తెచ్చుకున్న ఆయుదంతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఇంట్లో ఉన్న ఆమె కోడలు కవితపై విచక్షణా రహితంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన భయానక వాతావరణాన్ని కల్పించింది. ఈ ఘటనపై కావలి పోలీసులు మహారాష్ట్రకు సైతం వెళ్లి పార్థీ గ్యాంగ్ కోసం ఆరా తీసినట్లు సమాచారం. తాజాగా పెద్దచెరుకూరులో... పెద్దచెరుకూరులోని చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో ఎన్. చంద్రమౌళీశ్వరరావు, పుష్పవేణి దంపతులు ఇట్లో నిద్రిస్తుండగా దుండగులు అతి కిరాతకంగా తలపై కొట్టి హత్య చేశారు. పుష్పవేణి మెడలోని బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. ఈ సంఘటన జరిగిన తీరు భయానక వాతావరణాన్ని కల్పించింది. ఈ మూడు ఘటనలు ఒకే తరహాలో చోటు చేసుకోవడంతో పార్థీ గ్యాంగ్ పనేగా పోలీసులు భావిస్తున్నారు. ఒకే తరహాలో నాలుగు హత్యలు జిల్లాలో గడిచిన ఏడాదిన్నర కాలంలో ఒకే తరహాలో నాలుగు హత్యలు చోటు చేసుకున్నాయి. 2014 డిసెంబర్ 1వ తేదీన నగర శివారుల్లోని చింతాళమ్మ వైన్స్‌లో నైట్ సేల్స్‌మన్ దేవినేని శ్రీనివాసులు (38) హత్య జరిగింది. ఆ రోజు తెల్లవారు జామున నలుగురు యువకులు వైన్షాపులోనికి ప్రవేశించి బల్లపై నిద్రిస్తున్న శ్రీనివాసులు తలపై రాడ్‌తో విచక్షణా రహితంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. క్యాషియర్ చంద్రను సైతం తీవ్రంగా కొట్టి కౌంటర్లోని చిల్లర డబ్బులు, రెండు మద్యం బాటిళ్లను తీసుకెళ్లారు. ఈ హత్యకు పాల్పడిన పార్థీ గ్యాంగ్‌ను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు.