పునరావాసం కంటితుడుపే | Officials ignored the facilities in rehabilitation centers | Sakshi
Sakshi News home page

పునరావాసం కంటితుడుపే

Oct 27 2013 2:12 AM | Updated on Sep 2 2017 12:00 AM

గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమై వేలాదిమందికి కనీసం నిలువనీడ లేకుండా పోయింది.

సాక్షి, కాకినాడ : గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమై వేలాదిమందికి కనీసం నిలువనీడ లేకుండా పోయింది. వర్షాలు మొదలయ్యాక రెండురోజులు పట్టించుకోని అధికారులు ఆ తర్వాత పునరావాస కేంద్రాల ఏర్పాటుతో హడావిడి మొదలు పెట్టారు. గత నాలుగు రోజుల్లో జిల్లావ్యాప్తంగా 32 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 10,866 మందిని తరలించినట్టు అధికారులు ప్రకటించారు. వీరిలో 4,735 మందికి ప్రతి రోజూ రెండు పూటలా భోజన సదుపాయం కల్పిస్తున్నట్టు పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు. కానీ వాస్తవానికి డజనుకు పైగా  కేంద్రాల్లో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా తలదాచుకోలేదు. ఇక మిగిలిన కేంద్రాల్లో ఎక్కడా పట్టుమని 50 మంది కూడా లేరు. పునరావాస కేంద్రాలకు తరలిపోతే ఇళ్లు, ఇళ్లలోని సామాన్లు ఏమైపోతాయోనన్నఆందోళనతో కొందరు బాధితులు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. 
 
 కాగా మరికొందరు  అధికారుల చులకనభావం, సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం కారణంగా పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ముంపునకు గురైన ప్రాంతాల సమీపంలోని బడులు, గుడులనే పునరావాస కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. జిల్లాలో భారీ వర్షాల వల్ల ముంపునకు గురైన బాధితుల కోసం ఏర్పాటు చేసిన 32 పునరావాస కేంద్రాల్లో మూడవవంతు వాటిలో కనీస సదుపాయాల్లేవు. విధి లేక బాధితులు తరలివెళ్లినా వారిని పట్టించుకునే నాథులే ఉండడం లేదు. చాలామంది అధికారులు ‘పునరావాస కేంద్రాలకు తరలించాం..ఇక మా పనైపోయింది’ అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. కనీసం బాధితులు తిన్నారా, ఉన్నారా, వారి పరిస్థితి ఎలా ఉంది అని అడిగే వారే ఉండడం లేదు. పరిస్థితి ఇలా అఘోరించినందునే వర్షపునీరు ఇళ్లల్లోకి చేరి కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు బాధితులు ఆసక్తి చూపడం లేదు.
 
  పుష్కర, పీబీసీ కాలువలకు గండ్లు పడడంతో గొల్లప్రోలు మండలం సూరంపేట, ఈబీసీ, ఎస్సీ కాలనీ, శివాలయం మాన్యం, దేవీనగర్, మార్కండేయపురం నీటమునిగి సుమారు 3 వేల కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. వీరి కోసం మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఏ ఒక్కరూ వెళ్లలేదు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అరకొరగా భోజనసదుపాయం కల్పించారు. దీనిపై శనివారం ఉదయం తహశీల్దార్ పినిపే సత్యనారాయణను నిలదీయగా ‘నేను అలాగే పెడతాను.. మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోండి’ అంటూ పరుషంగా చెప్పడంతో బాధితులందరూ కాలనీ ఎదుట 216 జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు.
 
 కలెక్టర్ నీతూ  ప్రసాద్ వచ్చి, ఆదుకుంటామని హామీ ఇస్తే కానీ వారు శాంతించలేదు. ఈ పరిస్థితి ఒక్క గొల్లప్రోలులోనే కాక.. జిల్లావ్యాప్తంగా నెలకొంది. పునరావాస కేంద్రాలకు వెళ్లకుండా ఇళ్ల వద్దే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న వారిలో అత్యధికులకు ప్రభుత్వపరంగా అందేసాయం కనీసంగానైనా అందడంలేదు. ఇళ్లల్లో వండుకునే పరిస్థితి లేక, ఆదుకోవల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో పస్తులతో అలమటించాల్సిన దుస్థితి ఏర్పడింది. కొన్నిచోట్లయితే నాసిరకమైన ఆహారాన్ని ఇస్తుండడంతో గత్యం తరం లేక తింటూ అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నామంటూ బాధితులు వాపోతున్నారు. ఇప్పటి కైనా వర్ష  బాధితులను తగురీతిలో ఆదుకోవల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది.
 
 ఆదుకోని ప్రభుత్వం
 బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. వర్షాలు విపరీతంగా కురుస్తున్నా, పంటలు తీవ్రంగా దెబ్బతిన్నా పట్టించుకునే పాలకులు, అధికారులు లేకపోవడం బాధాకరం. మొక్కుబడిగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల వెళ్లేందుకు బాధితులు ఆసక్తిని చూపడం లేదు.
 - తమ్మన గోపాలకృష్ణ, చెముడులంక, ఆలమూరు మండలం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement