కుమారుడి మొదటి పుట్టిన రోజును బంధువుల మధ్య ఎంతో ఘనంగా చేయాలనుకుని స్వదేశం నుంచి వచ్చిన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కొడుకు పుట్టిన రోజుకు వచ్చి ఆత్మహత్య
Jan 22 2017 6:24 PM | Updated on Nov 6 2018 7:53 PM
విజయవాడ: కుమారుడి మొదటి పుట్టిన రోజును బంధువుల మధ్య ఎంతో ఘనంగా చేయాలనుకుని స్వదేశం నుంచి వచ్చిన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటు చేసుకుంది. మంగళగిరికి చెందిన మాజేటి భరత్ కుమార్(32)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
వీరికి ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. భార్య, కుమారుడు అంకిత్ ప్రస్తుతం మంగళగిరిలో ఉండగా కుమారుడి మొదటి పుట్టిన రోజును ఘనంగా చేయాలనుకుని భరత్ వారం క్రితం మంగళగిరి వచ్చాడు. ఆదివారం జరగనున్న పుట్టిన రోజు వేడుకలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన అతను రెండు రోజుల క్రితం కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
స్థానికులు అతడిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. భరత్ ఆచూకీ కోసం కుటుంబీకులు వెతకగా విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం వద్ద ఆదివారం మృతదేహం లభ్యమైంది. మృతుడిని గుర్తించిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఉద్యోగంలో ఒత్తిడి కారణంగా భరత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని స్నేహితులు చెబుతున్నారు.
Advertisement
Advertisement