నగరంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి వేళ రోడ్డుపై వెళ్తున్న వారి వెంటబడి తరుముతున్నాయి.
అనంతపురం సిటీ : నగరంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి వేళ రోడ్డుపై వెళ్తున్న వారి వెంటబడి తరుముతున్నాయి. ఈ క్రమంలో ద్విచక్ర వాహన చోదకులు అదుపుతప్పి కిందపడి ప్రమాదాలకు గురవుతున్నారు. అనంతపురం నగరంతో పాటు జిల్లాలోని దాదాపు అన్ని పురపాలక సంఘాల పరిధిలోనూ ఇదే సమస్య ప్రజలను వేధిస్తోంది. కుక్కకాటుకు గురై ఆస్పత్రుల పాలవుతున్న వారి సంఖ్య ప్రతి రోజూ వందల్లో ఉంటోంది.
పరిస్థితి ఇంతలా ఉన్నా.. కుక్కల నియంత్రణకు అవసరమైన చర్యలను తీసుకోవడం లేదు. అనంతపురం నగరంలోని దాదాపు అన్ని కాలనీల్లోనూ వీధి కుక్కల బెడద అధికంగా ఉంది. చిన్న పిల్లలు వీధుల్లోకి వెళితే కరుస్తున్నాయి. రాత్రి వేళ వీటి దాడి మరింతగా ఉంటోంది. మహిళలు, వృద్ధులు, పిల్లలపై దాడులు చేస్తున్నాయి. తెల్లవారుజామున దినపత్రికలు వేసే బాయ్‌లు, పాల పాకెట్లు వేసే వారిపై దాడి చేస్తున్నాయి. కుక్కల బెడద నివారించాలంటూ నగర పాలక సంస్థకు నిత్యం ఫిర్యాదులు వస్తూనే ఉన్నా పట్టించుకునే నాథులే కరువయ్యారు.
పేరుకే ‘ఆపరేషన్ భైరవ్’
నగరంలో కుక్కల బెడద నివారణకు ‘ఆపరేషన్ భైరవ్’ పేరుతో గత కమిషనర్ రంగయ్య.. పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుక్కలకు సంతానోత్పత్తి నిరోధక ఆపరేషన్లు చేయడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. అయితే.. నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పని ప్రారంభించలేదు.