మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు | more rain forecast for next two days | Sakshi
Sakshi News home page

మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు

Jul 18 2017 11:49 AM | Updated on Aug 18 2018 5:57 PM

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడనుంది.

- వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
- తీరం వెంబడి ఈదురుగాలులు
- మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచన
 
 
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడనుంది. ఇది మంగళవారం నాటికి వాయుగుండంగా మారనుంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. మరోవైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర, రాయలసీమల మీదుగా అల్పపీడనద్రోణి కొనసాగుతోంది. వీటన్నిటి ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
 
రాయలసీమలోనూ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవవచ్చని తెలిపింది. అదే సమయంలో కోస్తాంధ్రలో పశ్చిమదిశ నుంచి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. గడచిన 24 గంటల్లో శ్రీకాకుళం, వరరామచంద్రపురంలలో 5, కొయ్యలగూడెంలో 4, టెక్కలి, తిరువూరు, సోంపేట, పాతపట్నం, చింతూరు, మందస, నూజివీడు, కుకునూరు, కళింగపట్నంలలో 3 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement