మల్లన్న సన్నిధిలో అపచారం

Mistake In Srisailam Mallanna Temple kurnool - Sakshi

పరిచారకునికి విచిత్ర వేషధారణ

పీఠాధిపతిగా అలంకరించి అర్చకుల సేవలు

అమ్మవారి పూజ సామగ్రి వినియోగం

ఆలస్యంగా వెలుగులోకి  

సంబంధిత వారిపై వేటుకు రంగం సిద్ధం 

కర్నూలు, శ్రీశైలం:  శ్రీశైల మహాక్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం  మరింత పెంపొందించేందుకు నిత్య పూజలు జరిగేలా ఈఓ చర్యలు తీసుకుంటుండగా కొందరు ఆలయ అర్చకుల ప్రవర్తన ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా మారింది. ఇటీవల చోటు చేసుకున్న ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మల్లన్న ఆలయ ఆవరణలోనే కొందరు అర్చకులు ఓ పరిచారకుడిని పీఠాధిపతిగా వేషధారణ చేయించి పూల కిరీటం, చేతిలో కమండలం, త్రిశూలం మొదలైన వాటిని అలంకరింప జేశారు. అంతటితో ఊరుకోకుండా వామనావతారం తరహాలో గొడుగు పట్టి, ప్రసాదం సమర్పించారు.

అనంతరం అమ్మవారి అలంకార మండపం వద్ద కూర్చొబెట్టి పీఠాధిపతి తరహాలో  సేవలు చేశారు. ఈ తతంగమంతా శ్రీభ్రమరాంబాదేవి ప్రధానార్చకులు సన్నిధిలో జరిగినట్లు తెలుస్తోంది. అలాగే అమ్మవారి సేవకు ఉపయోగించే పూజా సామగ్రి వినియోగించినట్లు సమాచారం. ఆ సంఘటనను వీడియో తీసి సన్నిహితులకు పంపడంతో వైరల్‌గా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై భక్తులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవిత్ర క్షేత్రంలో ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడం అర్చకులకు తగదని విమర్శిస్తున్నారు. ఈ తతంగమంతా ఈఓ శ్రీరామచంద్రమూర్తి దృష్టికి వెళ్లడంతో ఆ సదరు పరిచారకున్ని తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. అతనితో పాటు అర్చక పరిచారకులపై కూడా వేటు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విచిత్ర వేషధారణ యువకుడు ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగి కుమారడని సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top