చేతకాకపోతే వెళ్లిపోండి..?

Minister Narayana Fires On Officials In Visakhapatnam - Sakshi

నిధులున్నా పనులు చేపట్టరెందుకు?

స్మార్ట్‌ సిటీ రివైజ్డ్‌ ప్లాన్‌ తయారు చేయండి

డిసెంబర్‌ 31 కల్లా పనులు పూర్తవ్వాలి

అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహం

విశాఖ సిటీ: ‘నిధులు ఉన్నా.. పనులెందుకు పూర్తి చేయడం లేదు.? పని చేయడం మీకు ఇష్టం లేదా.? ప్రభుత్వ పనుల విషయంలోనే ఇంత జాప్యం చేస్తున్నారంటే ఇక ఇతర పనులెలా చేస్తారో అర్థం చేసుకోవచ్చు’ అని జీవీఎంసీ ప్రాజెక్ట ఎస్‌ఈ వెంకటేశ్వరరావుపై పురపాలక శాఖ మంత్రి నారాయణ వ్యాఖ్యలు చేశారు. జీవీఎంసీ పాత కౌన్సిల్‌ హాల్‌లో శుక్రవారం స్మార్ట్‌ సిటీ, గృహ నిర్మాణం, అన్న క్యాంటీన్ల నిర్వహణపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. గృహ నిర్మాణాలకు సంబంధించిన ప్లాన్‌ కాపీ షీట్‌లను ఉన్నతాధికారులకు అందివ్వకపోవడంపై చీఫ్‌ సిటీ ప్లానర్‌ విద్యుల్లతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని కార్పొరేషన్ల నుంచి కాపీలు వచ్చినా.. జీవీఎంసీ నుంచి ఒక్కటి కూడా అందకపోవడంపై మండిపడ్డారు. అమరావతిలో ఉన్న టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ కూడా సకాలంలో గృహ నిర్మాణాల మ్యాప్‌లు, ఇతర వివరాలు అందిస్తున్నారనీ, ఇక్కడ మాత్రం ఏదైనా సమాచారం అడిగితే చూస్తాను, చేస్తానంటూ రెండు మూడు రోజులు కాలయాపన చేస్తున్నారంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయడం ఇష్టం లేకపోతే వెళ్లిపోండంటూ వ్యాఖ్యానించారు. స్మార్ట్‌ సిటీ పనుల్లో జరుగుతున్న జాప్యంపైనా మంత్రి నారాయణ అసహనం వ్యక్తం చేశారు. రూ.399 కోట్లకు రూ.113 కోట్ల పనులు మాత్రమే పూర్తవ్వడమేంటని, పనితీరును మార్చుకోవాలంటూ ఎస్‌ఈ వెంకటేశ్వరరావును హెచ్చరించారు. నిర్దేశించిన గడువులోపు అన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.

మూడు నెలల్లో పూర్తి..
అనంతరం మీడియాతో నారాయణ మాట్లాడుతూ మొదటి విడత గృహ నిర్మాణంలో భాగంగా 4120 ఇళ్ల పనులు మూడు నెలల్లో పూర్తి కానున్నాయన్నారు. విశాఖలో గృహనిర్మాణానికి స్థలం కొరత సమస్యగా మారుతోందని, దీన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 15 నుంచి 25 రోజుల్లోగా ప్రభుత్వ భూమిని అనుభవిస్తున్న ప్రజలకు సంబంధించిన 400 నుంచి 500 ఎకరాలకు సంబంధించి ల్యాండ్‌ పూలింగ్‌ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ భూ సమీకరణ పూర్తయితే ప్రస్తుతం మంజూరైన 57,499 ఇళ్లతో పాటు మరో 30 వేల ఇళ్లు కార్పొరేషన్‌ పరిధిలో మంజూరవుతాయన్నారు. స్మార్ట్‌ సిటీకి ఇంతవరకూ రూ.113 కోట్లతో 17 పనులు పూర్తయ్యాయనీ, రూ.314 కోట్లతో జరుగుతున్న మరో 10 పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. రూ.245 కోట్లు విలువ చేసే 9 పనులు టెండర్‌ దశలో ఉండగా, రూ.95 కోట్లు విలువ చేసే 6 పనులు డీపీఆర్‌ దశలో ఉన్నాయన్నారు. రూ.750 కోట్లతో పలు శాఖలతో కలిసి పనులు చేపడుతున్నట్లు వివరించారు. డిసెంబర్‌ 31కి స్మార్ట్‌ సిటీకి సంబంధించిన రూ.395 కోట్లు విలువ చేసే పనులన్నీ పూర్తయ్యేలా డిజైన్‌ చేయాలని అధికారులను ఆదేశించానన్నారు. ఈ సమీక్షలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పి.జి.వి.ఆర్‌.నాయుడు, విష్ణుకుమార్‌రాజు, బండారు సత్యనారాయణ, వాసుపల్లి గణేష్‌కుమార్, వెలగపూడి రామకృష్ణబాబు, పీలా గోవింద సత్యనారాయణ తమ నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్, జేసీ సృజన, వుడా వీసీ, జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌ బసంత్‌కుమార్, వుడా సెక్రటరీ శ్రీనివాస్, జీవీఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ దుర్గాప్రసాద్, అదనపు కమిషనర్లు పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయం ఆలోచించండి
సమీక్షలో భాగంగా.. గృహ నిర్మాణంపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి గంటా మాట్లాడుతూ ఇంత వరకూ ల్యాండ్‌ పూలింగ్‌ చేయలేదు, పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు. ఇంకా సమయం 8 నెలలు మాత్రమే ఉంది. ఈ 8 నెలల్లో ఏం పూర్తి చేస్తారని వ్యాఖ్యానించారు. దీనిపై కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పందిస్తూ ల్యాండ్‌ పూలింగ్‌ జీవో వచ్చిన వెంటనే పనులు చేపడతామని జవాబిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top