
మీడియా సంస్థలపై వివక్ష లేదు: కోడెల
అసెంబ్లీ వ్యవహారాలను కవర్ చేయడంలో కొన్ని మీడియా సంస్థల పట్ల వివక్ష లేదని ఆంధ్రప్రదేశ్ శాసనసభా స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు.
హైదరాబాద్: అసెంబ్లీ వ్యవహారాలను కవర్ చేయడంలో కొన్ని మీడియా సంస్థల పట్ల వివక్ష లేదని ఆంధ్రప్రదేశ్ శాసనసభా స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వ్యవహారాలను కవర్ చేయడానికి ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ప్రతినిధులకు అనుమతి ఇవ్వలేదని, ఇలాంటి వివక్ష సరైంది కాదంటూ ఐజేయూ సీనియర్ నేత కె.శ్రీనివాస్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ డి.అమర్, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కె.అమర్‌నాథ్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, సీనియర్ నాయకులు వై.నరేందర్‌రెడ్డి, సలీముద్దీన్, రాజేశ్ తదితరులు స్పీకర్‌ను కలిశారు.
పరిపాలనా పరమైన ఇబ్బందుల వల్ల కొందరికి పాసులు రాలేదని, కావాలని ఏ పత్రికకూ పాసులు నిరాకరించలేదని కోడెల వారికి తెలిపారు. మీడియా సలహా మండలిని ఏర్పాటుచేసి, అన్ని పత్రికలకూ పాసులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పీకర్ కోడెల హామీ ఇచ్చారు.