విధిరాత.. మృత్యుగీత

MBBS Student Died With Cancer Disease Kurnool - Sakshi

శ్రీశైలంప్రాజెక్ట్‌ (కర్నూలు): ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ఓ యువకుడిని క్యాన్సర్‌ మహమ్మారి పొట్టన పెట్టుకుంది. తమ కుమారుడిని డాక్టర్‌ చేయాలనే తండ్రి ఆశలపై విధి నీళ్లు చల్లింది. సున్నిపెంటకు చెందిన ఓ మెడికో క్యాన్సర్‌ బారిన పడి మృతి చెందాడు. స్థానిక శ్రీశైలం ప్రాజెక్ట్‌ కాలనీకి చెందిన ప్రకాష్, సుజాత దంపతుల కుమారుడు గొట్టెముక్కుల దీపక్‌ ప్రకాష్, కుమార్తె అమృత ప్రియ సంతానం. సుజాత నాలుగేళ్ల క్రితం మృతి చెందగా.. ప్రకాష్‌ ఇద్దరు పిల్లలను కష్టపడి చదివిస్తున్నాడు. కుమారుడు దీపక్‌ ప్రకాష్‌ ఈ ఏడాది నీట్‌లో ఉత్తమ ర్యాంక్‌   సాధించాడు.

కన్వీనర్‌ కోటాలో నెల్లూరులోని నారాయణ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌లో చేరాడు. కుమారుడు డాక్టర్‌ కాబోతున్నాడని తండ్రి సంతోషిస్తున్న సమయంలో గత నెల 15వ తేదీన దీపక్‌ ప్రకాష్‌ రక్తపు వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోయాడు. డాక్టర్లు పరీక్షించి క్యాన్సర్‌గా నిర్ధారించడంతో హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీపక్‌ ప్రకాష్‌ మృతదేహాన్ని మధ్యాహ్నం సున్నిపెంటకు తరలించారు. మంగళవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు బంధువులు తెలిపారు. కుమారుడి మృతితో తండ్రి రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top