ప్రాణం తీసి.. ‘బీ పాజిటివ్‌’ అంటున్నారు

Maternal death with the Doctors Negligence In Ananthapur Govt Hospital - Sakshi

అనంతపురం సర్వజనాస్పత్రిలో ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో కలెక్టర్‌ విచారణ 

కలెక్టర్‌నూ బురిడీ కొట్టించేందుకు యత్నించిన వైద్యులు 

బాలింత బ్లడ్‌ గ్రూప్‌ ఓ పాజిటివ్‌ కాగా..బీ పాజిటివ్‌ అని నివేదిక 

వైద్యుల నిర్లక్ష్యం ప్రాణం తీసిందని నిర్ధారణ 

అనంతపురం న్యూ సిటీ: అనంతపురం సర్వజనాస్పత్రిలో తాడిపత్రికి చెందిన బాలింత ఎస్‌.అక్తర్‌భాను మృతిపై తక్షణ విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దీంతో కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చేందుకు సాక్షాత్తు జిల్లా కలెక్టర్‌నే బురిడీ కొట్టించేందుకు వైద్యుల బృందం యత్నించింది. సర్వజనాస్పత్రిలో వైద్యసేవలు పొందుతూ ఈ నెల 27న బాలింత ఎస్‌.అక్తర్‌భాను మృతి చెందిన విషయం విదితమే. ఆమెకు ఓ పాజిటివ్‌ రక్తం ఎక్కించాల్సి ఉండగా.. బీ పాజిటివ్‌ రక్తాన్ని ఎక్కించారు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె మరణించింది. ఈ విషయమై ‘ఆస్పత్రి నిర్లక్ష్యం–బాలింత మృతి’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితం కాగా.. ఈ ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. బాలింత మృతికి కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణను ఆదేశించారు.

రంగంలోకి దిగిన కలెక్టర్‌ విచారణలో భాగంగా సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కేఎస్‌ఎస్‌ వెంకటేశ్వరరావు, మెడిసిన్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌తో శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ఘటనపై పక్కా నివేదిక ఇవ్వాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్‌ ఆస్పత్రిలోని బ్లడ్‌ బ్యాంక్‌కు వెళ్లారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్, బ్లడ్‌ బ్యాంక్‌ వైద్యులు, పెథాలజిస్టులు మృతురాలు అక్తర్‌భాను బ్లడ్‌ గ్రూపు బీ పాజిటివ్‌ అని రాసి ఉన్న రికార్డులను కలెక్టర్‌కు చూపించారు. అంతేకాకుండా వేరొకరి రక్తాన్ని తీసుకొచ్చి కలెక్టర్‌ సమక్షంలో బీ పాజిటివ్‌గా నిర్థారణ చేశారు. అయితే, ఆస్పత్రి యాజమాన్యం వాదనతో ఏకీభవించని కలెక్టర్‌ నగరపాలక సంస్థ కమిషనర్, ఐఏఎస్‌ అధికారిణి పి.ప్రశాంతిని విచారణ అధికారిగా నియమించగా, వారు సుదీర్ఘంగా విచారించి మృతురాలి బ్లడ్‌ గ్రూపు ఓ పాజిటివ్‌ కాగా.. బీ పాజిటివ్‌ రక్తం ఎక్కించినట్టు గుర్తించారు. గైనిక్‌ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల బాలింత మరణించినట్టు నిర్థారణకు వచ్చారు. కాగా, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం ఆస్పత్రిని సందర్శించి వివరాలు తెలుకుంటారు.

డీఎంహెచ్‌ఓ చొరవతో వెలుగులోకి.. 
ఈ నెల 26న ఇతర రక్త పరీక్షల కోసం ఆస్పత్రి బ్లడ్‌ బ్యాంక్‌ నిర్వాహకులు బాలింత బ్లడ్‌ శ్యాంపిల్స్‌ను రాయలసీమ డయాగ్నొస్టిక్‌కు పంపారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కేవీఎన్‌ఎస్‌ అనిల్‌ పలుమార్లు పెథాలజిస్టుతో బ్లడ్‌ శాంపిల్స్‌ పరీక్ష చేయించగా అసలు నిజం వెలుగు చూసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top