నేటితో ముగియనున్న మహా సంప్రోక్షణ

Maha Samprokshanam to end today - Sakshi

     తులాలగ్నం శుభ ముహూర్తంలో క్రతువు ముగింపు

     పలు రాష్ట్రాలనుంచి వచ్చిన రుత్వికులు, అర్చకులు

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ గురువారంతో ముగియనుంది. నేడు ఉదయం 10 : 16 గంటల నుంచి 12 గంటల లోపు తులాలగ్నం శుభముహూర్తంలో స్వామివారి మూలమూర్తిలో 48 జీవకళలను మళ్లీ ప్రవేశపెట్టి మహాసంప్రోక్షణ క్రతువును ముగిస్తారు. మహాసంప్రోక్షణకు ఈనెల 11వతేదీ రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. 12వ తేదీన ఆలయంలో వైదిక కార్యక్రమాలను వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 45 మంది రుత్వికులు, 20 మంది యాగ పారాయణదారులు, 50 మంది పురాణ పఠనదారులు, 40 మంది దివ్య ప్రబంధనదారులు వైదిక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి సేవలందించారు.  

శాస్త్రోక్తంగా తిరుమంజనం 
మహాసంప్రోక్షణంలో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం శ్రీవారి మూలమూర్తికి ఇతర పరివార దేవతలకు క్షీరాధివాస తిరుమంజనం క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోపురాల కలశాలను అద్దంలో తిలకించి వాటి ప్రతిబింబాలకు అభిషేకం నిర్వహించారు. శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, శ్రీ గరుడాళ్వార్, శ్రీవరదరాజస్వామి, శ్రీభాష్యకారులు, శ్రీ యోగనరసింహస్వామివారికి, ధ్వజస్తం భం, శ్రీ బేడి ఆంజనేయస్వామివారి గోపురాల కలశాలకు పవిత్ర జలం, పాలతో అభిషేకం చేశారు. 

వాస్తు హోమం.. 
మహాసంప్రోక్షణ మొదటి ఘట్టంలో ఉదయం స్వామివారికి నిర్వహించే సేవల అనంతరం ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో హోమగుండాలు వెలిగించారు. పుణ్యాహవచనం అనంతరం వాస్తుహోమం చేశారు. దేహ శుద్ధి కోసం ఆకల్మషా హోమాన్ని అర్చకులు నిర్వహించారు. ప్రాతఃకాలంలో ప్రత్యేక హోమాలు, పూజలు జరిగాయి. ఈ కార్యక్రమాలన్నీ మధ్యాహ్నం 12 గంటల లోపు పూర్తి చేశారు. 12 గంటల నుంచి శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతించారు. రాత్రి 7 గంటలకు వైదిక కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. రాత్రి 9 గంటలకు వైఖానస భగవత్‌ శాస్త్రం ప్రకారం ముందుగా కలకర్షణ కార్యక్రమం చేశారు.  

అష్టదిక్కుల్లో సంధి బంధనం 
వైఖానస ఆచార్యుల ఆధ్వర్యంలో సంప్రదాయ శిల్పాచార్యుల సహకారంతో అష్టబంధన ద్రవ్యాలను సేకరించి, ఆయా ద్రవ్యాలకు సంబంధించిన దేవతలను ఆరాధించి అష్టబంధనం తయారు చేస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రుత్వికులు శాస్త్రోక్తంగా అష్టబంధనం ద్రవ్యాలను సేకరించారు. శ్రీవారి మూలమూర్తితోపాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలకు అష్టబంధనాన్ని సమర్పిస్తారు.  

8 రకాల ద్రవ్యాలతో.. 
ఎనిమిది రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారు చేస్తారు. వీటిలో శంఖచూర్ణం 25.5 తులాలు, మధుజ (తేనెమైనం) 3.5 తులాలు, లాక్షా(లక్క) 3.75 తులాలు, గుగ్గులు(వక్షపు బంక) 9 తులాలు, కార్పాసం(ఎర్ర పత్తి) 1 తులం, త్రిఫలం(ఎండిన ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ) 7.5 తులాలు, రక్తశిలాచూర్ణం (గైరికము) 7.5 తులాలు, మాహిష నవనీతం (గేదె వెన్న) 15 తులాలు ఉంటాయి. వీటికి ఔషధ గుణాలుంటాయి.  

ఆగమోక్తంగా అష్టబంధనం సమర్పణ 
గర్భాలయంలోని శ్రీవారి మూలమూర్తితోపాటు ఉప ఆలయాలైన గరుడాళ్వార్, పోటు తాయార్లు, వరదరాజస్వామి, యోగ నరసింహస్వామి, విష్వక్సేన, భాష్యకార్లు, వేణుగోపాలస్వామి, బేడి ఆంజనేయస్వామివారి విగ్రహాలకు అష్టబంధన సమర్పణ జరిగింది. అష్టబంధనాన్ని పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కలా తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో సమర్పించారు. 

అధివాసం... 
విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ సమయంలో విశ్వంలోని శక్తిని ఆవాహన చేసేందుకు అధివాసం నిర్వహిస్తారు. ప్రాణప్రతిష్ట ద్వారా విగ్రహాలు అనంతమైన శక్తిని పొందుతాయి. విగ్రహరూపంలో ఉన్న దేవతలను దర్శించడం ద్వారా కోరిన కోరికలు తీరడంతోపాటు మానసిక శాంతి చేకూరుతుంది. 

అధివాసం రకాలు 
శాస్త్రాల ప్రకారం ఆలయాల ప్రాణప్రతిష్ఠ సమయంలో క్షీరాధివాసం, జలాధివాసం, ఫలాధివాసం, ఛాయాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం, శయనాధివాసం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. 

క్షీరాధివాసం...  
శ్రీవారి మూలమూర్తిని పవిత్రమైన పాలతో అభిషేకం చేయడాన్నే క్షీరాధివాసం అంటారు. ’క్షీరసాగర తరంగ శిఖర సార తరకిత చారుమూర్తే’ అంటూ ముకుందమాల స్తోత్రంలో శ్రీకులశేఖరాళ్వార్‌ క్షీరాధివాసం వైశిష్ట్యాన్ని తెలియజేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top