కూలీల ఆటోను ఢీకొట్టిన కారు | Sakshi
Sakshi News home page

కూలీల ఆటోను ఢీకొట్టిన కారు

Published Fri, Nov 28 2014 3:52 AM

కూలీల ఆటోను ఢీకొట్టిన కారు - Sakshi

అలంపురం (పెంటపాడు) : అలంపురం వద్ద జాతీయ రహదారి గురువారం నెత్తురోడింది. కూలీలతో వెళుతున్న ఆటో రోడ్డు పక్కన ఆగి ఉండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలవ్వగా, ఐదుగురు మహిళలు, ఆటోడ్రైవర్ సహా 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం మండలం పుల్లాయిగూడెంకు చెందిన మేస్త్రి సహా 12 మంది వ్యవసాయ కూలీలు తణుకు మండలం దువ్వలో వరి కోత పనుల నిమిత్తం గురువారం ఉదయం ఆటోలో గ్రామం నుంచి బయలుదేరారు. జాతీయరహదారి మీదుగా వెళుతూ అలంపురం వద్ద బంక్‌లో పెట్రోలు పోయించి తిరిగి బయలుదేరారు.

ఆటో రోడ్డుపైకి వచ్చిన తరువాత బంక్ సిబ్బంది నుంచి చిల్లర తీసుకోవడం మరిచిపోయానని ఆటోడ్రైవర్ జంజులూరి సతీష్‌కు గుర్తుకొచ్చింది. దీంతో ఆటోను రోడ్డుపై నిలిపి చిల్లర తెచ్చుకునేందుకు మేస్త్రి చలపటి సత్యనారాయణతో కలిసి బంక్‌లోకి వెళ్లాడు. తిరిగి వారు ఆటో వద్దకు వస్తుండగా, అదే సమయంలో విజయవాడ నుంచి తణుకు వైపు వెళుతున్న కారు ఈ ఆటోను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టి రోడ్డు డివైడర్‌దాటి అవతలి వైపునకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మైలవరపు సత్యనారాయణ (38), చలపాటి వెంకట్రావు (45) తల, చేతులు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి.

వీరిని గూడెం ఏరియా ఆసుపత్రికి అంబులెన్సులో తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగిలిన కూలీలు గొడిగిన వరలక్ష్మికి తల, ముఖంపై, చలపాటి పద్మకు తల, చేతులకు, బొల్లబాల నాగమ్మకు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని తొలుత తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అలాగే పామర్తి శ్రీనివాస్, ఆరుగొలను శ్రీనివాస్, తిరుపతి నాగేశ్వరరావు, పసుపులేటి సత్యవతి, కొనకళ్ల వెంకటేశ్వరరావు, పెదముత్తి జీవిత, ఆటోడ్రైవర్ జంజులూరి సతీష్‌లకు తీవ్రగాయలపాలై తాడేపల్లిగూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాగా మేస్త్రి అయిన చలపటి సత్యనారాయణ స్వల్పగాయాలు అయ్యాయి. కాగా మరో గుర్తు తెలియని వ్యక్తికి గాయాలు కాగా, అతను చికిత్స నిమిత్తం వేరే వాహనంలో వెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలం క్షతగాత్రుల ఆర్తనాదాలతో దద్ధరిల్లింది. స్థానికులు కొందరు వెంటనే స్పందించి బాధితులకు సహాయక చర్యలు చేపట్టారు. కారు డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పెంటపాడు ఎస్సై సీహెచ్ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement