వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు | Krsnastami grander celebrations | Sakshi
Sakshi News home page

వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

Aug 30 2013 5:13 AM | Updated on Sep 1 2017 10:14 PM

జిల్లాలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక కన్యకాపరమేశ్వరీ ఆలయంలో కొలువైన మురళీ కృష్ణ స్వామికి విశేష పూజలు నిర్వహించారు.

విజయనగరం కల్చరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక కన్యకాపరమేశ్వరీ ఆలయంలో కొలువైన మురళీ కృష్ణ స్వామికి విశేష పూజలు నిర్వహించారు. వేకువ జామున స్వామివారికి పంచామృతాభిషేకం, సహస్ర తులసీ దళార్చన పూజలు జరిపారు.  శ్రీకృష్ణ మూలమంత్ర హోమాన్ని ఆలయంలో నిర్వహించారు. మోహన్ హోమ కార్యక్రమాన్ని జరిపారు. మహిళలు శ్రీకృష్ణ సంకీర్తనలు గానం చేశారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలుగుకుండా దేవస్థానం సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆలయ అర్చకుడు ఆరవిల్లి ఉమామహేశ్వరశర్మ పూజాకార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు ఉచితంగా ప్రసాదాన్ని పంపిణీ చేశారు. 
 
 బొబ్బిలి రూరల్: మండలంలో పలు గ్రామాల్లో గురువారం శ్రీకృష్ణ అష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిరిడి, కృష్ణాపురం,చింతాడ, కలువరాయి, కోమటపల్లి తదితర గ్రామాల్లో ఉదయం నుంచి చిన్ని కృష్ణుడుకి పూజలు నిర్వహించి, సాయంత్రం యువత  ఉట్టికొట్టి వేడుకలు నిర్వహించారు. వివిధ గ్రామాల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికలు వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు. రాత్రి వరకు వేడుకలు నిర్వహించి ఉట్టికొట్టిన విజేతలకు పలు ఆకర్షణీయ బహుమతులను ప్రదానం చేశారు.  
 
 బొబ్బిలి టౌన్‌లో...
 బొబ్బిలి టౌన్ : పట్టణంలో వాడవాడల్లో శ్రీకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక యాదవ వీధిలో ఇటీవల ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుని విగ్రహానికి ఆ వార్డు మాజీ కౌన్సిలర్ వైఎస్‌ఆర్ సీపీ నాయకులు బీసపు చిన్నారావు పూలమాల వేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పట్టణం నుంచి వందలాది మంది భక్తులు హాజర య్యారు. అనంతరం యాదవ వీదిలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 
 గీతా ధ్యాన మందిరంలో అష్ట ప్రహరి నగర సంకీర్తన
 పార్వతీపురం టౌన్ : స్థానిక జగన్నాథపురంలోని శ్రీ గీతా ధ్యానమందిరంలో రెండు రోజులుగా జరుగుతున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దీనిలో భాగంగా గురువారం ధ్యానమందిరంలో ఒడిశాకు చెందినశ్రీ చైతన్య రామ్ యోగిచే అఖండ హరినామ సంకీర్తన పరిసమాప్తిని చేపట్టారు. దీనంలో భాగంగా గోకుల కృష్ణుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం హరినామ సంకీర్తన లతో, బళ్లవేషధారణాలతో తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు చింతల రామస్వామి సారధ్యంలో అఖండ నామ సంకీర్తన (అష్ట ప్రహరి)ని ప్రారంభించారు. దీనిలో భాగంగా ‘గోపాలకృష్ణుని’ అర్చన, పంచామృత అభిషేకం, హోమం, అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు.  రాయగడకు చెందిన రాధాకృష్ణ మందిర సంకీర్తన బృందం, ఒడిశాలోని సంత సోరిపిల్లికి చెందిన బంకుతుల్య సంకీర్తన మండలి, కుంబారిపుట్టికి చెందిన నీలోఛక్రో సంకీర్తన మండలిచే ఏర్పాటు చేసిన 24 గంటల భజన కార్యక్రమంలో భాగంగా జగన్నాథపురం నుంచి పట్టణ ప్రధాన రహదారిలో నగర సంకీర్తన కార్యక్రమాన్ని చేపట్టారు. రాధాకృష్ణుల వేషధారణలో ఊరేగింపు చేపట్టారు. 
 
 బెలగాంలో... 
 బెలగాం : స్థానిక పాఠశాలలు, ఆలయాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వవిజ్ఙాన విద్యాలయం, ఆదిత్య పాఠశాలలో విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చిన్నారులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. స్థానిక  సాయినగర్ కాలనీలో ఉన్న సాయిబాబ మందిరంలో ఉట్టి కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement