జాయింట్‌ కలెక్టర్‌గా కోటేశ్వరరావు

Koteswar Rao Appointed For YSR Kadapa Joint Collector - Sakshi

ఎట్టకేలకు జేసీ నియామకం

ఏపీపీఎస్‌సీ సెక్రటరీగా పనిచేస్తూ కడపకు బదిలీ

 సాక్షి, కడప : జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ)గా పులిపాటి కోటేశ్వరరావును నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఈయనకు తొలుత రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్‌ ఇచ్చారు. తర్వాత గవర్నర్‌ పేషీలో పనిచేశారు. అనంతరం హైదరాబాద్‌లో బీసీ కార్పొరేషన్‌ విభాగంలో పనిచేసిన ఆయనకు 2009లో ఐఏఎస్‌ క్యాడర్‌ ఇచ్చిన ప్రభుత్వం జేసీగా పదోన్నతి కల్పించింది. తర్వాత మూడు సంవత్సరాల మూడు నెలల పాటు పశ్చిమ గోదావరి జేసీ పనిచేశారు. నిజాయితీ గల అధికారిగా ఆయనకు పేరుంది. ఏపీపీఎస్‌సీ కార్యదర్శిగా కేవలం నెలన్నర రోజులు మాత్రమే పనిచేశారు. ఈలోపే కడపకు బదిలీచేశారు. అంతేకాకుండా వివాదాలకు దూరంగా ఉండడంతోపాటు పేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ అందరికీ న్యాయం చేసే వ్యక్తిగా కోటేశ్వరరావు మంచిపేరు గడించారు.

ఎన్నాళ్లకెన్నాళ్లకు..: జిల్లాకు సంబం ధించి చాలారోజుల తర్వాత ప్రభుత్వం జేసీని నియమించింది. నెలన్నర రోజుల కిందట కమర్షియల్‌ ట్యాక్స్‌ కమిషనర్‌కు సెక్రటరీగా పనిచేస్తున్న నాగరాణిని జేసీగా బదిలీ చేసినప్పటికీ ఆమె విధుల్లో చేరలేదు. అంతకుముందు ఇక్కడ జేసీగా పనిచేస్తున్న శ్వేత మార్చిలో సెలవులపై వెళ్లి తర్వాత బదిలీ అయ్యారు. అప్పటి నుంచి జేసీగా ఎవరినీ నియమించలేదు. జేసీగా నాగరాణిని నియమించినా రాకపోవడంతో ప్రభుత్వం తాజాగా కోటేశ్వరరావును నియమించింది. గత నెలలో ఇన్‌చార్జి జేసీగా పనిచేస్తున్న జేసీ–2 శివారెడ్డి విదేశీ పర్యటన నిమిత్తం వెళ్లడంతో అప్పటినుంచి ఇన్‌చార్జి  జేసీగా కడప స్పెషల్‌ కలెక్టర్‌ నాగేశ్వరరావు బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. కోటేశ్వరరావు మంగళవారం కడపకు చేరుకుని జేసీగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top