ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతారా!

kotamreddy sridhar reddy fire on NH officials  - Sakshi

ఎన్‌హెచ్‌ అధికారులపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం 

నెల్లూరు(అర్బన్‌): నగర శివారు ప్రాంతాల్లో సర్వీసు రోడ్లు నిర్మంచకుండా నేషనల్‌ హైవే అధికారులు ప్రజల ప్రాణాలతో  చెలగాటమాడుతున్నారంటూ నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మండి పడ్డారు. శుక్రవారం కలెక్టర్‌ బంగ్లాలో భారత్‌మాల ప్రాజెక్ట్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరం కనుపర్తిపాడు, గొలగమూడి క్రాస్‌రోడ్డు, సింహపురి ఆస్పత్రి క్రాస్‌రోడ్డు, ఎన్‌టీఆర్‌ నగర్, రాజుపాళెం క్రాస్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ఫ్‌లైఓవర్‌లు, అండర్‌పాస్‌లు లేక జనం ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నా హైవే అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేదన్నారు.

 టోల్‌ గేట్లు పెట్టి ప్రజల ముక్కు పిండి డబ్బులు వసూలు చేసుకునే శ్రద్ధ ప్రజల ప్రాణాల పట్ల లేకపోవడం సిగ్గు చేట న్నారు. సర్వీసు రోడ్లు నిర్మించాలని ఒక ఎమ్మెల్యేగా ఢిల్లీ నుంచి గల్లీదాక చెప్పులు అరిగేలా తిరుగుతున్నానని తెలిపారు. ఇదిగో.. అదిగో సర్వీసు రోడ్లు అంటూ కాలయాపన చేస్తారా అని నిలదీశారు. బుజబుజనెల్లూరులో ప్రజల ప్రాణాలకు పెనుసవాలుగా మారిన 300 మీటర్ల సర్వీస్‌ రోడ్డు అనేక పోరాటాల ద్వారా ఏర్పాటు చేశారన్నారు. అయితే ఇంకా బీటీ రోడ్డుగా మార్చలేదన్నారు. తక్షణమే అక్కడ బీటీ రోడ్డు వేయకపోతే ఎమ్మెల్యేగా తాను కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు.

 కలెక్టర్‌ ముత్యాలరాజు జోక్యం చేసుకుని  ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్పిన సమస్య చాల తీవ్రమైందన్నారు. వెంటనే పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఎన్‌హెచ్‌ అధికారులను కోరారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి 2016 నవంబర్‌ 21న, 2018 ఏప్రిల్‌ 14వ తేదీన తీసుకెళ్లామన్నారు. అయినా కేంద్ర మంత్రి చూద్దాం.. చేద్దాం.. పరిశీలిస్తాం, చర్యలు తీసుకుంటామంటూ కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో జేసీ వెట్రిసెల్వి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top