పాత్రికేయుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.
విజయనగరం క్రైం: పాత్రికేయుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో నివాసం ఉంటున్న తాళ్లపూడి సత్యనారాయణ సాయంకాల దినపత్రికను నడుపుతున్నారు. బుధవారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఆయన ఎస్‌సీఎస్ థియేటర్ ఎదురుగా ఉన్న పెద్దచెరువు గట్టుపక్కన కాలకృత్యాలు తీర్చుకోవడానికి ద్విచక్ర వాహనం ఆపి ముందుకు సాగాడు.
అదే సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఒకరు వాహనం నడుపుతుండగా.. మరో వ్యక్తి సత్యనారాయణపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ వెంటనే తన స్నేహితుడికి ఫోన్ చేసి, విషయం తెలియజేశారు. స్నేహితుడు అక్కడకు చేరుకుని అతనిని పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. ఇదే విషయమై వన్‌టౌన్ ఎస్సై వర్మ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. సంఘటనపై తనకు ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఫిర్యాదు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.