ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయిస్తాం

Kakani Govardhan Reddy Open Grain buying center SPSR Nellore - Sakshi

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు, పొదలకూరు: రైతులు పండించే ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయిస్తామని, కొనుగోలు కేంద్రాల్లో, మిల్లర్ల వద్ద వచ్చే తేమ శాతం ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని డేగపూడిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గతంలో మండలంలో ఐదు కొనుగోలు కేంద్రాలు ఉండగా, కొత్తగా చెన్నారెడ్డిపల్లి, మరుపూరు, డేగపూడి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించామని తెలిపారు. రబీలో మండలంలో అనుకున్న దానికంటే అదనంగా ధాన్యం దిగుబడులు వస్తున్నాయన్నారు.

ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ఇబ్బంది పడకుండా అదనంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి కేంద్రంలో ఐదు వేల గోతాలకు తగ్గకుండా ఉంచాలని అధికారులకు సూచించామని, అవసరమైతే ఇంకా గోతాలను అందజేస్తామన్నారు. సంఘబంధాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. రైతులు సంఘబంధాలనే కోరుకునేలా పనితీరు ఉండాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని కోరుకున్న గ్రామాల్లో డేగపూడి ఉందని, ఇక్కడి నుంచి తనకు 295 ఓట్ల మెజార్టీ లభించిందని తెలిపారు. దివంగత సీఎం వైఎస్సార్‌ పాలన మళ్లీ వచ్చిందన్నారు. ఈ ఏడాది  జలాశయాలు నిండడంతో ఒక్క సెంటు కూడా ఎండకుండా సాగునీటిని అందజేశామన్నారు. డేగపూడి–బండేపల్లి కాలువ ద్వారా సాగునీరు అవసరమైన గ్రామాలకు అందజేస్తామన్నారు.

సాగునీటికి రాజకీయాలు ముడిపెట్టలేదు
గత పాలకుల్లా తాను సాగునీటిని రాజకీయాలకు ముడిపెట్టి పబ్బం గడుపుకోవాలనుకోలేదని ఎమ్మెల్యే కాకాణి అన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మంత్రి పదవిలో ఉండి గ్రామాలకు సాగునీటిని నిలిపివేయిస్తే రైతులు వస్తారనే ఆలోచన చేశారని ఆరోపించారు. తాను దిగుజారుడు రాజకీయాలు చేయలేనన్నారు. పార్టీలకతీతంగా సాగునీటిని అందించి పంటలు పండించామని గుర్తుచేశారు. కండలేరు 1వ బ్రాంచి కాలువకు నిరంతరం 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించామని తెలిపారు. దేశానికి పట్టెడు అన్నం పెట్టే రైతు సుఖసంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం వారి సంక్షేమం కోసం అనేక పథకాలను  అమలు చేస్తుందన్నారు. రైతును రాజుగా చూడాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, మాజీ ఎంపీపీ కోనం చినబ్రహ్మయ్య, రాపూరు ఏఎంసీ చైర్మన్‌ నోటి రమణారెడ్డి, నాయకులు బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, ఏ బుజ్జిరెడ్డి, నోటి రామలింగారెడ్డి, జీ ఈశ్వర్‌రెడ్డి, జీ పెంచలయ్య, కే నారాయణరెడ్డి, నోటి శ్రీనివాసులురెడ్డి, పులి కృష్ణారెడ్డి, పులి వెంకట్రామిరెడ్డి, తహసీల్దార్‌ స్వాతి, ఏపీఎం వనజాక్షి, ఈఓపీఆర్డీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top