మునిగిపో..తున్న చదువుల తల్లి

Kafar Dam Is Likely To Submerge More Than 35 Government Schools - Sakshi

కాఫర్‌ డ్యామ్‌ ముంపు ప్రాంతాల్లో బడుల మునక 

పిల్లల చదువుల మాటేమిటంటున్న నిర్వాసితులు 

 పట్టించుకోని అధికారులు 

సాక్షి,రంపచోడవరం/దేవీపట్నం(తూర్పు గోదావరి): అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమ్మ ఒడి పథకం అమలుకు చర్యలు తీసుకోవడంతో.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు పరుగులు తీస్తున్నారు. జిల్లాలోని ప్రజలందరూ చదువుల వైపు దృష్టి సారిస్తున్నారు. మరో పక్క.. గత టీడీపీ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కాఫర్‌ డ్యామ్‌ వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో పాఠశాలలు ఉంటాయో ఉండవో తెలియని పరిస్థితి ఏర్పడింది.

నిర్వాసితులకు పునరావాసాన్ని కల్పించే కాలనీలే ఇప్పటికీ పూర్తి కాలేదు. అక్కడ పాఠశాలల ఏర్పాటు విషయాన్ని అప్పటి పాలకులు పట్టించుకోలేదు. దీంతో ముంపు ప్రాంతాల్లో విద్య కొండెక్కినట్టేనా? అన్న అనుమానాలు ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితుల్లో వ్యక్తమవుతున్నాయి. వీటిని నివృత్తి చేసేందుకు అధికారులూ సిద్ధంగా లేరు. ఈ విషయంపై దేవీపట్నం గ్రామంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మిస్తున్న కాఫర్‌ డ్యామ్‌ ముంపు ప్రాంతాల్లోని విద్యార్థులను చదువులకు దూరం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 35 కాంటూర్‌ వరకు వరద వస్తే ముంపునకు గురయ్యే గ్రామాలను ఖాళీ చేసి నిర్వాసితులకు తాత్కాలికంగా టెంట్లు వేసి అక్కడకు తరలించేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. అయితే ముంపు గ్రామాల్లో ఉన్న పాఠశాలల గురించి విద్యార్థుల విషయంపై మాత్రం అధికారులు ఇప్పటి వరకు నోరు మెదపలేదు.

వరద సమయంలో ఈ ముంపు గ్రామాల్లో పాఠశాలల పరిస్ధితి ఏమిటనేది అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. ఈ ఏడాది వరద సమయంలో తమ పిల్లలు పాఠశాలలకు దూరం కావాల్సిందేనా? అంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా వరద వస్తే.. ఈసారి రెండు, మూడు రోజుల్లో నీటిమట్టం తగ్గి పరిస్థితి ఉండదు. సమీపంలోని పోశమ్మ గండి వద్ద గోదావరిపై కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణమే ఇందుకు కారణం. 

చదువు ముందుకు సాగేనా? 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఐదు మండలాలు ముంపునకు గురవుతున్నాయి. ముంపు గ్రామాల్లో వచ్చే వరదలకు పాఠశాలలు నిర్వహించే పరిస్థితి లేదు. కాఫర్‌ డ్యామ్‌ వల్ల విలీన మండలాల్లోని పాఠశాలల్లో ఈ ఏడాది ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే దేవీపట్నం మండలంలోని సుమారు 37 ప్రాథమిక పాఠశాలలు, ఒక జెడ్పీ పాఠశాల, ఒక గిరిజన సంక్షేమ పాఠశాల, ఒక జూనియర్‌ కళాశాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. తాత్కాలిక పునరావాసం అందరకీ ఒకే చోట కల్పించే అవకాశం కనిపించడం లేదు.

పలువురు మండలాన్ని వదిలి బయటకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. అధికారులు కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం కోసం కేవలం గ్రామాల్లో పునరావాసంపై దృష్టి సారించారు. అయితే నేటికీ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల నిర్మాణం పూర్తి కాలేదు. అక్కడ పాఠశాలల భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. అధికారులు తీరు ఎలా ఉందంటే.. ‘కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం చేస్తున్నారు. మీ చావు మీరు చావండి’ అన్న చందంగా ఉందని నిర్వాసితులు విమర్శిస్తున్నారు. 

టీడీపీ ప్రభుత్వం నిర్వాసితులు, ముంపు ప్రాంతాల్లోని విద్యార్థుల గురించి ఆలోచనే చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణ వరదలు వస్తేనే పది రోజుల పాటు విద్యార్థులు చదువుకు దూరం అవుతుంటారు. కాఫర్‌ డ్యామ్‌ వల్ల వరద నీరు రోజుల తరబడి ఉండిపోతుంది. దీంతో 42 గ్రామాలు జలమయం అవుతాయి. 

దిగువకు నీరు వెళ్లే మార్గం లేదు  
పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌ నిర్మాణం కోసం గోదావరి నీటిని మళ్లించేందుకు ఎగువన కాఫర్‌ డ్యామ్‌ నిర్మించారు. అయితే ఫీ డ్యామ్‌ వద్ద పైడిపాక వద్ద గొట్టాలతో ఏర్పాటు చేసిన మార్గం ద్వారానే నీరు బయటకు వెళ్లే అవకాశం ఉంది. సాధారణంగా భద్రాచలం వద్ద 43 అడుగులుకు మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు నాలుగో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తుంటారు.

అయితే కాఫర్‌ డ్యామ్‌ 2,500 మీటర్ల ఎత్తులో నిర్మించాలి. ప్రస్తుతం 1,850 మీటర్ల మేర ఎత్తు చేసి పనులు కొనసాగిస్తున్నారు. 35 అడుగుల ఎత్తున ఈ డ్యామ్‌ను నిర్మించారు. దీంతో గోదావరి వరదల సమయంలో బ్యాక్‌ వాటర్‌ గ్రామాలను ముంచేత్తుతుంది. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేసే పరిస్థితి లేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top