రాకాతి మెట్ట అక్రమాల పుట్ట | Irregularities in rakatimetta | Sakshi
Sakshi News home page

రాకాతి మెట్ట అక్రమాల పుట్ట

Jul 15 2016 2:11 AM | Updated on Aug 10 2018 8:16 PM

మండలంలోని అమలాపురంలో ఉన్న రాకాతిమెట్ట అక్రమాల పుట్టగా మారింది. ఈ గ్రామంలో భూ కుంభకోణాలు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి.

నక్కపల్లి: మండలంలోని అమలాపురంలో ఉన్న రాకాతిమెట్ట అక్రమాల పుట్టగా మారింది. ఈ గ్రామంలో  భూ కుంభకోణాలు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి.  ఊరకొండలోనే కాకుండా  రాకాతిమెట్టలో కూడా అక్రమాలు జరిగాయి. ఇక్కడ కోట్లాది రూపాయల విలువైన భూమిని అధికారులు టీడీపీ నాయకులకు ధారాదత్తం చేస్తూ రికార్డుల్లో తారుమారు చేశారు.  సర్వేనెం 375లో  ఉన్న  ఊరకొండలో 53 ఎకరాలు ఎటువంటి పట్టాలు జారీ చేయకుండా పట్టాలు జారీ అయినట్లు ఆన్‌లైన్‌లో, వెబ్‌ల్యాండ్, వన్‌బీల్లో మార్పు చేసిన అధికారులు రాకాతిమెట్టను కూడా వదల్లేదు. సర్వేనెం 253లో ఉన్న ఈ రాకాతిమెట్టలో రూ. రెండు కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ శ్రీరామచంద్రరాజు పేరున 2.96 ఎకరాలు, ఆయన  అనుచరుడు, మరో టీడీపీ నాయకుడికి 2 ఎకరాలు, మరో అనుచరుడికి 2  ఎకరాల చొప్పున పట్టాలు  జారీ అయినట్లు, వీరే సాగుచేస్తున్నట్లు వన్‌బీ రికార్డుల్లో నమోదు చేశారు.

ఇదే మాజీ సర్పంచ్ అమలాపురంలో ఎనిమిదేళ్ల కిత్రం  2.04 ఎకరాలు డీఫాం పట్టా తీసుకుని పాసు పుస్తకాలు కూడా పొందినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఆయనకు  మరో గ్రామంలో సొంత భూమి ఐదెకరాలు పైబడే ఉన్నట్లు సమాచారం. పేదలకు ఇవ్వాల్సిన డీఫాం పట్టా భూములు   ఈ గ్రామంలో భూస్వాములకు ఇచ్చినట్లు వెల్లడవుతోంది. ఇప్పటికే  సర్వే నెంబరు 375లో ఊరకొండలో 53 ఎకరాలను టీడీపీ నాయకుల పేరున మార్చిన సంగతి తెలిసిందే. ఇలా ఆన్‌లైన్‌లో పేర్లు నమోదైన వారిలో టీడీపీలో కీలక నాయకులు, వారి  అనుచరులు, జన్మభూమి కమిటీ సభ్యులు, ఆ పార్టీ తరపున ఎంపీటీసీలు, సర్పంచ్‌లుగా పోటీచేసి ఓటమి పాలైన వారే ఉండటం గమనార్హం.

దొంగలు  దొంగలు కలిసి..: దొంగలు  దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెలుగు తమ్ముళ్లు  ప్రభుత్వ భూములను తమ పేరున మార్చుకున్నార ని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.  ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల పరిహారం కాజేసేందుకు పన్నాగం పన్నారు. వీరి మాటలు నమ్మి  పలువురు మోసపోయారు. సర్వేనెం 375 ఉన్న 295 ఎకరాలకు సబ్ డివిజన్ చేయలేదని తహసీల్దార్, సర్వేయర్ చెబుతుంటే వెబ్‌ల్యాండ్, వన్‌బీల్లో మాత్రం  ఈ 375 సర్వే నెంబరును 4 సబ్‌డివిజన్లు చేసినట్లు  మొత్తం భూమికి పట్టాలు ఇచ్చినట్లు పేర్కొంటున్నారు.  మీ ఇంటికి  మీభూమి కార్యక్రమం ద్వారా రెవెన్యూ రికార్డులన్నీ  సరిచేసి ఆన్‌లైన్‌లో ఉంచామని సీఎం చంద్రబాబు  గొప్పలు చెబుతున్నారు.  రెవెన్యూ రికార్డులు పారదర్శకంగా ఉంచుతామని,  అవినీతికి  ఆస్కారం లేకుండా చేశామని డప్పు వాయించారు. ఏడాది నుంచి అధికారులంతా కష్టపడి ప్రభుత్వ భూములను, జిరాయితీ భూములను,  పాసు పుస్తకాలను పొందిన వారిని, పొందని వారిని, వేరు చేసి ఈ వెబ్‌ల్యాండ్ రికార్డు తయారు చేశారు.  ఇదంతా పూర్తయిన తర్వాతే వెబ్‌ల్యాండ్ పోర్టల్‌ను  ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.  

తప్పు మాది కాదంటే మాది కాదు..: ఇంత జరిగిన తర్వాత కార్యాలయంలో అత్యంత గోప్యంగా ఉండాల్సిన రెవెన్యూ రికార్డులు ఇలా తారుమారై   బహిరంగంగా అక్రమాలు జరిగినట్లు   స్పష్టంగా కనిపిస్తుంటే.. మాకు తెలియదంటే మాకు తెలియదని సిబ్బంది ఒకరిపై ఒకరు నెట్టుకునే ప్రయత్నాలు చేయడం   విమర్శలకు తావిస్తోంది. తన వద్ద ఉన్న డిజిటల్‌కీని డీటీకి, మరో ఉద్యోగికి ఇచ్చానని తనకు తెలియకుండా ఈ బాగోతం జరిగిందని ఈ స్కాంలో తన ప్రమేయమేమీ లేదని  గతంలో పనిచేసిన తహసీల్దార్ సుందరరావు  చెప్పుకొస్తున్నారు. డీటీ మాత్రం   ఇదంతా అమలాపురం వీఆర్వో చేశాడని ఈ కార్యాలయంలో కాకుండా వేరో చోట చేశాడని చెప్పడం గమనార్హం. అసలు ఈ వ్యవహారానికి బాధ్యులెవరు? కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు, డిజిటల్‌కీలు బయటకు ఎలా వెళ్లాయి. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌ల ఆధీనంలో ఉండాల్సిన డిజిటల్‌కీ  యూజర్‌నేం, పాస్‌వర్డ్ ఇతర సిబ్బందికి ఎలా తెలిసిందనే విషయం సమాధానం దొరకని ప్రశ్నగా మారింది. ఈ బాగోతానికి మూలకారకులెవరు..  ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పేరున మార్చి కోట్లాది రూపాయల పరిహారాన్ని స్వాహా చేసేందుకు స్కెచ్ వేసిన వారెవరన్నది బహిర్గతం కావాలంటే  ప్రభుత్వం స్పందించి విచారణాధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లేదా  అడిషనల్ జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని  నియమించి  సమగ్ర విచారణ జరపాలని ప్రతిపక్ష నేతలతో పాటు స్థానికులు కోరుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement