ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను కడప పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
- పట్టుబడిన వారందరూ కర్ణాటక, కడప ప్రాంత వాసులే
- ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడి
కడప అర్బన్(వైఎస్‌ఆర్ జిల్లా),న్యూస్‌లైన్ :ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను కడప పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వారి నుంచి రూ.12.70 లక్షల నగదు, 31 దుంగలు, టవేరాకారు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. మరో ఇద్దరు దొంగలు తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఆయన పట్టుబడిన ఎర్రచందనం దుంగలను విలేకరుల ఎదుట హాజరుపరిచారు.
దొరికింది ఇలా..
ఎర్రచందనం అక్రమ రవాణాపై కడప అర్బన్ సర్కిల్ పోలీసులతో పాటుు అటవీ శాఖ అధికారులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో ఉదయం 6.30 గంటలకు కడప సాయిపేట చెరువు కట్ట సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన టవేరా కారును ఆపారు. అయితే కారును ఆపకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే వెంటబడి పట్టుకున్నారు. అందులో పది మంది ఉన్నారు. వారందరూ కర్ణాటకతో పాటు కడపకు చెందిన వారు ఉన్నారు.
అరెస్టైన వారిలో కర్ణాటక రాష్ట్రం మంగుళూరుకు చెందిన డ్రైవర్ షర్ఫుద్దీన్(32), అబ్దుల్ మజీద్(29), బద్రుద్దీన్(22)తో పాటు కడపకు చెందిన వడుగూరి రవికుమార్ అలియాస్ సతీష్(25), గుంట అనిల్‌బాబు(25), ఖాదర్‌ఖాన్ కొట్టాలకు చెందిన వ్యాన్ డ్రైవర్ చాగలమర్రి మల్లికార్జున(25), మరో వ్యాన్ డ్రైవర్ మారే రవి(23), పులివెందులకు చెందిన వేబ్రిడ్జి మేనేజర్ వల్లెపు వెంకటరమణ(54), డ్రైవర్ ఖాదర్‌బాషా(30), సిద్ధవటానికి చెందిన మెడికల్ రెప్రజంటేటివ్ నిమ్మకాయల గంగిరెడ్డి(30) ఉన్నారన్నారు.
నిందితుల నేపథ్యం :
కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన మొదటి నిందితుడు షర్ఫుద్దీన్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతను అదే రాష్ట్రం హోసకోటే తాలూకా మాలూరు రోడ్డులోని కాటేగానహల్లికి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ షబ్బీర్ అలియాస్ రహమత్(45)తో పరిచయం ఏర్పరచుకున్నాడు. రెండేళ్లుగా కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లతో షర్పుద్దీన్ సంబంధాలు పెట్టుకొని యథేచ్చగా ఎర్రచందనం దుంగలను తరలించేవాడు.
దుంగలను కాటేగానహల్లికి చెందిన షబ్బీర్‌కు కిలో రూ.1500 చొప్పున విక్రయిస్తూ తాను కమీషన్ తీసుకునేవాడు. వాటిని షబ్బీర్ చెన్నై, ముంబై, ఢిల్లీలో తనకు తెలిసిన స్మగ్లర్లకు అమ్మేవాడని ఎస్పీ వివరించారు. ప్రస్తుతం పట్టుబడిన ముఠా సభ్యులంతా గత నెల 21న ఈచర్ వ్యాన్(ఏపీ 02 డబ్ల్యూ 5000) షబ్బీర్‌కు ఎర్రచందనం దుంగలు అమ్మి, దారిలో వస్తూ హసనకోటలోని చింతామణి రస్తాలో పోలీసుల తనిఖీలను గమనించి వ్యాన్‌ను అక్కడే వదిలేసి పరారయ్యారని చెప్పారు.