వేడి నుంచి ఉపశమనం పొందేందుకు.. | increase the beer sales in the ananthapur district | Sakshi
Sakshi News home page

వేడి నుంచి ఉపశమనం పొందేందుకు..

Apr 8 2017 8:48 PM | Updated on Jun 1 2018 8:36 PM

వేడి నుంచి ఉపశమనం పొందేందుకు.. - Sakshi

వేడి నుంచి ఉపశమనం పొందేందుకు..

జిల్లాలో మందుబాబులు రూట్‌ మార్చారు. ఎప్పుడూ హాట్‌తాగే వారు కూడా భానుడు ప్రచండ నిప్పులు కురిపిస్తుండటంతో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు బీర్లు తాగడం మొదలెట్టారు.

- రూటు మార్చుకున్న మందుబాబులు
అనంతపురం: జిల్లాలో మందుబాబులు రూట్‌ మార్చారు. ఎప్పుడూ హాట్‌తాగే వారు కూడా అనంతలో భానుడు ప్రచండ నిప్పులు కురిపిస్తుండటంతో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు బీర్లు తాగడం మొదలెట్టారు. ఫలితంగా మూడు నెలలుగా బీర్ల అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 246 మద్యం షాపుల్లో నెలకు సగటున 50 వేల నుంచి 60 వేల కేసులు అమ్ముడుపోతాయి.

అయితే ఈ ఏడాది జనవరిలో 70వేల కేసులు, ఫిబ్రవరిలో 89,350 కేసులు, మార్చిలో 1,35,000 కేసులు విక్రయించారు. ఎండలు మండుతుండటంతో హాట్‌ తాగేవారు సైతం కూల్‌కూల్‌గా బీర్లు తాగుతుండటం వల్లే బీర్ల అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని, ఏప్రిల్, మే నెలలో వీటి అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని వైన్‌షాపులవారు చెబుతున్నారు.
 
సిండికేట్ల చేతివాటం
బీర్ల అమ్మకాలు జోరందుకోవడంతో వైన్‌షాపుల నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రతి బాటిల్‌పైనా రూ.15 నుంచి రూ.20 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రూ.25 కూడా తీసుకుంటున్నారు. అదేమని ప్రశ్నిస్తే డిమాండ్‌ ఎక్కువగా ఉంది. కూలింగ్‌ చార్జ్‌ ఎవరిస్తారు. కరెంట్‌ బిల్లు చాంతాడంత వస్తోంది అంటూ వైన్‌షాపుల వారు పదర్శిస్తున్నారు.

నగరంలో అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటుకు విక్రయిస్తున్నారు. ఎక్కడికక్కడ సిండికేట్లుగా ఏర్పడి ఒప్పందం ప్రకారం ఒక్కో సిండికేట్‌ పరిధిలో ఒకే రేటుకు విక్రయిస్తున్నారు. దీంతో గుత్తిరోడ్డులో ఓ రేటుకు, బైపాస్‌లో మరో రేటుకు మద్యం దొరుకుతోంది. ఈ లెక్కన మద్యాన్ని అదనపు రేట్లకు విక్రయించి నెలకు రూ.కోట్లలో ఆదాయం పొందుతున్నారు. కేవలం బీరు అమ్మకాలపైనే దాదాపు రూ.3 కోట్ల వరకూ అదనపు ఆదాయం పొందుతున్నట్లు అంచనా.
 
జిల్లాలో బీరు అమ్మకాలు ఇలా..
నెల కేసులు మొత్తం రూ.
జనవరి      70000      రూ. 63 లక్షలు
ఫిబ్రవరి      89350      రూ. 80.41 లక్షలు
మార్చి      1.3500      రూ. 12.15 లక్షలు
 
బీరు అమ్మకాలు పెరిగాయి
జిల్లాలో బీరు అమ్మకాలు పెరిగాయి. ఇందుకు కారణం భారీగా ఎండలు పెరగడమే. ప్రతి ఏటా వేసవిలో బీరు అమ్మకాలు మామూలుగానే పెరిగుతాయి. అయితే ఈ సారి ఎక్కువ ఎండలు ఉండడంతో బీర్లు అమ్మకాలు జోరందుకున్నాయి. గత మార్చి నెలలో 13500 కేసులు అమ్ముడుపోయాయి. భవిష్యత్‌లో మరెంతపెరిగే అవకాశాలు ఉన్నాయి.
- అనిల్‌కుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement