నకిలీ మకిలీ..!

Illeagal Granite Transportation In Prakasam - Sakshi

జిల్లాలో నకిలీ ఈ– వే బిల్లుల కుంభకోణం

కంపెనీలు లేకుండా దొంగ పేర్లతో ఈ– వే బిల్లులు పొందుతున్న వైనం

అడ్రస్‌ లేని 33 గ్రానైట్‌ ఫ్యాక్టరీల పేరుతో 33 ఈ– వే బిల్లులు తీసుకున్న అక్రమార్కుడు

చనిపోయిన వ్యక్తుల ఆధార్‌ కార్డులతో అక్రమ దందా

ఫోన్‌ నంబర్, ఈ మెయిల్‌ లాంటి వివరాలు లేకుండానే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

గ్రానైట్‌ అక్రమ రవాణాతో  ప్రభుత్వ ఖజానాకు రూ.వందల కోట్ల గండి

సాక్షి, ఒంగోలు : జిల్లాలో నకిలీ వే బిల్లులతో గ్రానైట్‌ లారీలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయి.  అడ్రస్‌ లేని కంపెనీలకు ఎటువంటి విచారణ లేకుండా అడ్డగోలుగా వే బిల్లులు ఇచ్చేస్తుండటంతో అక్రమ దందా యథేశ్ఛగా కొనసాగుతోంది. చనిపోయిన వ్యక్తుల ఆధార్‌ కార్డులు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పెట్టి  వందల కంపెనీలు సృష్టించేస్తున్నారు. ఫోన్‌ నంబర్‌లు, ఈ మెయిల్‌ అడ్రస్‌లు వంటి కనీస వివరాలు కూడా లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయగానే వెంటనే ఈ– వేబిల్లులు ఇచ్చేస్తున్నారు. రోజుకు సుమారుగా 200 వరకూ గ్రానైట్‌ లారీలు జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటే అందులో సగానికిపైగా లారీలకు బిల్లులు లేకుండా నకిలీ వే బిల్లుల ద్వారా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.

గ్రానైట్‌ అక్రమ వ్యాపారుల జీరో దందా వల్ల ట్యాక్స్‌ల రూపంలో ప్రభుత్వ ఖజానాకు వచ్చే వందల కోట్ల రూపాయలకు గండి పడుతుంది. ఓ అదృశ్య వ్యక్తి మార్టూరు కేంద్రంగా 33 కంపెనీలను ఏర్పాటు చేసి 133 వే బిల్లులు పొందడమే కాకుండా వాటితో గ్రానైట్‌ను ఇతర రాష్ట్రాలకు తరలించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన 18 శాతం పన్నును చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న పరిస్థితి. దీన్ని గుర్తించిన సేల్స్‌ట్యాక్స్‌ అధికారులు  నెల 7వ తేదీన అడ్రస్‌ లేకుండా వే బిల్లులు పొందిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మార్టూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఒక్క మార్టూరుకే పరిమితం కాకుండా జిల్లాలో గ్రానైట్‌ క్వారీలు ఉన్న బల్లికురవ, చీమకుర్తిల్లో సైతం నకిలీ వే బిల్లుల ద్వారా జోరుగా అక్రమ రవాణా జరుగుతందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

ప్రకాశం జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షాలాది మంది గ్రానైట్‌ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారు. కొందరు అక్రమ వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా ఈ వ్యాపారాన్ని కలుషితం చేసేస్తున్నారు. జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ, మార్టూరు వంటి ప్రాంతాల్లో కొందరు అక్రమ వ్యాపారులు మాఫియాలాగా ఏర్పడి అవినీతి అధికారుల సహకారం, రాజకీయ నేతల అండదండలతో వక్ర మార్గంలో జీరో వ్యాపారం సాగిస్తున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా ఈ అక్రమ దందా సాగుతోంది. గ్రానైట్‌ రవాణా చేయాలంటే వే బిల్లుల ద్వారా ప్రభుత్వానికి 18 శాతం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే కొందరు వ్యాపారులు మాత్రం నకిలీ వే బిల్లుల కుంభకోణంతో వందలాది లారీలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన వందల కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొడుతూ తమ జేబులు నింపుకుంటున్నారు. విజిలెన్స్‌ అధికారులు ఏడాది కాలంలో రూ.2 కోట్ల వరకూ పెనాల్టీలు వేయాలని లక్ష్యంగా ఉంది. అయితే గ్రానైట్‌ అక్రమ రవాణాకు పాల్పడే వారి నుంచి పది నెలల వ్యవధిలోనే రూ.6.70 కోట్లు పెనాల్టీలు వసూలు చేశారంటే అక్రమ దందా ఏ స్థాయిలో జరుగుతందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో పిడుగురాళ్ల, దాచేపల్లి, విజయవాడ, వినుకొండ, వంటి ప్రాంతాల్లో నకిలీ వేబిల్లులతో వెళ్తున్న గ్రానైట్‌ లారీలు పట్టుబడిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో అయితే టీడీపీ నేతల అండతో అధికారులెవరూ వాటి జోలికి వెళ్లలేని పరిస్థితి ఉండేది. ఇప్పటికీ కొందరు అధికారులు, అక్రమ వ్యాపారులు మాత్రం వారి తీరు మార్చుకోవడం లేదు. 

అక్రమాలకు పాల్పడుతుందిలా... 
బిల్లులు లేకుండా నకిలీ వే బిల్లులతో గ్రానైట్‌ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రానైట్‌ రవాణాకు వే బిల్లులు ఇవ్వాలంటే గతంలో స్థానిక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపి నిజంగా కంపెనీ ఉంటేనే వే బిల్లులు మంజూరు చేసేవారు. అయితే జీఎస్‌టీ వచ్చిన తరువాత ఇందులో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే చాలు వారి గురించి ఎటువంటి విచారణ చేపట్టకుండానే ఇతర ప్రాంతాల అధికారుల ద్వారా వే బిల్లులు ఇచ్చేస్తున్నారు.

దీంతో లోపాలను గుర్తించిన అక్రమార్కులు చనిపోయిన వారి ఆధార్‌కార్డులను సేకరించి దరఖాస్తులు చేయడం, ఫేక్‌ అడ్రస్‌లు, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేస్తూ వందల సంఖ్యలో వే బిల్లులు సేకరిస్తున్నారు. వీటి ద్వారా అక్రమ రవాణాకు పాల్పడుతూ పక్క రాష్ట్రమైన తెలంగాణాకు వెళ్లగానే వే బిల్లులు రద్దు చేసేస్తున్నారు. కొందరు కోట్ల రూపాయల పన్నులు చెల్లించకుండా ఎగనామం పెట్టినా అడ్రస్‌ కూడా కనిపెట్టలేక వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నకిలీ వే బిల్లుల వ్యవహారంపై ఇప్పటికే ఏడు కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగతున్నా నకిలీ వే బిల్లుల డొంక మాత్రం కదలడం లేదు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top