
మాట వినకుంటే..
ఆ నేతకు మైదుకూరు నియోజకవర్గంలోని ఇరువురు వ్యవసాయాధికారులు టార్గెట్ అయ్యారు. ఆయనగారి సామాజిక వర్గం కాకపోవడం, అనుకూలంగా వ్యవహరించలేదన్న కారణాలతో ఫిర్యాదులు మొదలుపెట్టారు.
ఆ నేతకు మైదుకూరు నియోజకవర్గంలోని ఇరువురు వ్యవసాయాధికారులు టార్గెట్ అయ్యారు. ఆయనగారి సామాజిక వర్గం కాకపోవడం, అనుకూలంగా వ్యవహరించలేదన్న కారణాలతో ఫిర్యాదులు మొదలుపెట్టారు. ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసి, ఆపై విజిలెన్సు విచారణ చేపట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆ ఇరువురు అధికారులు మనవాళ్లే అని సర్దుబాటు చేయాలని ప్రయత్నించిన కేడర్ సైతం విస్మయం వ్యక్తం చేసేలా సామాజిక వర్గ వ్యాఖ్యానాలు చేశారు. తనకున్న పరపతితో సస్పెన్షన్ చేయిస్తానని శపధం చేశారు.
వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు అధికమే. ఎంతో నిక్కచ్ఛిగా ఉంటేనే పోలీసు అధికారులు అక్కడ పనిచేయడం గగనం. పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం ఇక్కడ సర్వసాధారణం. ఈక్రమంలో రాష్ట్రపతి అవార్డు పొందిన ఓ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ క్రికెట్ బుకీ మునవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. పెపైచ్చు బెట్టింగ్ కేంద్ర బింధువు నరసింహ ఎక్కడ ఉన్నాడో తెలపాలని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. స్టేషన్ బెయిల్ పొందిన మునవర్ వెంటనే మాజీ ఎమ్మెల్యే ఒకర్ని ఆశ్రయించారు. అప్పటికే పలుమార్లు పలు కేసుల్లో తాము చెప్పినట్లు వినలేదని కోపంతో ఉన్న ఆయన బుకీని వెంటేసుకుని హైదరాబాద్‌కు పయనమయ్యారు. వ్యవహారాన్ని డిజిపి దృష్టికి తీసుకెళ్లి బదిలీ చేయిస్తానని బెదిరించారు.
సాక్షి ప్రతినిధి, కడప: పై రెండు ఉదాహరణలు మచ్చుకే. జిల్లాలో నిజాయితీగా పనిచేసే అధికారులకు తావు ఉండడం లేదు. పూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తేనే నెత్తికి ఎత్తుకుంటున్నారు. సమర్థత, అసమర్థతతో నిమిత్తం లేకుండా వ్యవహరించిన వారికి అగ్రపీఠం వేస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా, ప్రజాస్వామ్యానికి అనుగుణంగా వ్యవహరిస్తామంటే సహించేది లేదని వేధింపులకు గురిచేస్తున్న పలు ఘటనలు ఇప్పటికే వెలుగుచూశాయి. రాజభక్తి ప్రదర్శించడంలో పోటీ పడే వారికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తామంటోంది అధికారపక్షం. ఈక్రమంలో అసాంఘిక కార్యక్రమాలను సైతం తలకు ఎత్తుకుంటూ ప్రజల్లో అభాసుపాలవుతున్నారు. నిబద్ధతతో వ్యవహరిస్తూ కిందిస్థాయి యంత్రాంగానికి మార్గదర్శకంగా ఉండాల్సిన ఉన్నత శ్రేణి యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. దాంతో కింది స్థాయి సిబ్బందిపై అధికారపార్టీ జులుం ప్రదర్శిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటే....
నిబంధనలకు విరుద్ధంగా నడుచుకునే యంత్రాంగమంటే అధికార పార్టీ నేతలు మరింత మక్కువ ప్రదర్శిస్తున్నారు. రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇవ్వడంపై ప్రశ్నించాల్సిన ఉన్నతాధికారులు మౌనం దాలుస్తుండడంతో ఈతరహా వ్యవహారాలు పదేపదే ప్రస్ఫుటం అవుతున్నాయి. ఓ తిరుణాల సందర్భంగా రాజ్యాంగ ప్రతినిధి అయినా బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు వాహనాన్ని నిలిపేయడం, ఆపై ఎన్నికల్లో ఓడిపోయిన విజయజ్యోతి వాహనాన్ని అనుమతించడం జిల్లాలో వివాదాస్పదమైంది.
ఇలాంటి చర్యల్ని తప్పుబట్టాల్సిన ఉన్నతాధికారులు చూస్తుండి పోతున్నారు. దాంతో పదేపదే పునరావృత్తం అవుతున్నాయి. ఒక ప్రాంతంలో ఏకపక్ష ఘటనలు ప్రోత్సహిస్తుంటే మరో ఏరియాలో నిక్కచ్ఛి అధికారులు ఏక పక్షంగా వ్యవహరించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. పద్దతి ప్రకారం నడుచుకుంటున్న అధికారులకు అండగా జిల్లా యంత్రాంగం నిలవడం లేదనే ఆరోపణ మెండుగా ఉన్నాయి. అందులో భాగంగానే మైదుకూరులో వ్యవసాయాధికారులకు వేధింపులు తీవ్రతర మయ్యాయి.
దూషణలకు దిగినా..
సంఘీభావం కరువే...
తెలుగుదేశం నాయకులు ఒకరి తర్వాత మరొకర్ని టార్గెట్ చేస్తూ అధికారులపై దూషణలకు దిగుతున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారి వరకూ అదే పరిస్థితి నెలకొంది. అలాంటి వారికి అండగా ఉండాల్సిన సహోద్యోగుల నుంచి సైతం ఎలాంటి సంఘీభావం వ్యక్తం కావడం లేదని సమాచారం. గతంలో అప్పటి ట్రాన్సుకో ఎస్‌ఈ ఉదంతం అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా పలువురు చెప్పుకొస్తున్నారు. అధికారపార్టీ నేత ప్రత్యక్ష దూషణలు తోపాటు, దాడికి సైతం ఉపక్రమించారు. అక్కడే ఉన్న ఓ రాజ్యసభ సభ్యుడు సైతం ఖండించిన దాఖలాలు లేవు.
వెరసి అనతికాలంలోనే ట్రాన్సుకో ఎస్‌ఈకి ట్రాన్సుఫర్ వచ్చింది. ఇలా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు వాపోతున్నారు. ముఖ్యమంత్రిగా జిల్లా వాసి ఉన్నప్పటికీ ఇంతటి విచ్చలవిడి అధికార దుర్వినియోగం కన్పించలేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. అధికారిపై వేధింపులు ఉంటే జిల్లా యంత్రాంగం ఏకమయ్యే సంస్కృతి జిల్లాలో దూరం అవుతుండడమే విచ్చలవిడి దూషణలకు కారణం అవుతోందని పలువురు భావిస్తున్నారు. ఉన్నత యంత్రాంగం ఏకపక్ష చర్యల్ని ప్రోత్సహించడంతోనే జిల్లాలో ఛీత్కారాలు అధికమౌతున్నాయని పలువురు అధికారులే చెప్పుకొస్తుండడం విశేషం.