భారీ అగ్నిప్రమాదం | Huge Fire Accident in anantapur district | Sakshi
Sakshi News home page

భారీ అగ్నిప్రమాదం

May 8 2018 8:48 AM | Updated on Sep 5 2018 9:47 PM

Huge Fire Accident in anantapur district - Sakshi

నల్లమాడ:  రెడ్డిపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్‌ జరిగి కిరాణాషాపు దగ్ధమైంది. కిరాణా సరుకులు, నగదు, బంగారు నగలు కాలిపోయాయి. బాధితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రెడ్డిపల్లిలో కోటా విజయ్‌కుమార్, మనోహర్‌ అన్నదమ్ములు. ఇరు కుటుంబాలు రోడ్డుపక్కన రెండంతస్తుల భవనంలో కలసి ఉంటూ కింద భవనంలో కిరాణా షాపు నిర్వహించేవారు. ఆదివారం రాత్రి వారు మేడపై నిద్రిస్తుండగా కిరాణా షాపులో మంటలు చెలరేగాయి. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రోడ్డుపైకి వచ్చిన వారు దుకాణం తగలబడటాన్ని గమనించి కేకలు వేశారు. చుట్టుపక్కల వారు మేల్కొని మేడపై నిద్రిస్తున్న వారిని నిచ్చెన ద్వారా కిందికి దింపారు. షార్ట్‌సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. 

భారీ నష్టం 
కదిరి ఫైర్‌స్టేషన్‌కు, నల్లమాడ పోలీసులకు ఫోన్‌ద్వారా సమాచారం అందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఎస్‌ఐ సత్యనారాయణ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గంట తర్వాత కదిరి, పుట్టపర్తి నుంచి రెండు ఫైర్‌ ఇంజిన్లు వచ్చి స్థానికుల సహకారంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే దుకాణంలో సరుకులు, బీరువాలోని నగదు, నగలు, బట్టలుతో పాటు తిండిగింజలు, వంటపాత్రలు మొత్తం కాలిబూడిదయ్యాయి. ఐదు గంటలపాటు మంటలు చెలరేగాయి. ఇంటర్, బీటెక్‌ చదువుతున్న పిల్లల ఫీజుల కోసం సమకూర్చుకున్న రూ.10 లక్షల నగదు, 50 తులాల బంగారు అగ్నికి ఆహుతై పనికిరాకుండా పోయినట్లు బాధితులు విలపించారు. అగ్ని కీలలకు చుట్టూ గోడలు నెర్రెలు చీలడంతో భవనం కూలడానికి సిద్ధంగా ఉంది.  

బాధితులకు పలువురి పరామర్శ 
పుట్టపర్తి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్‌ పల్లె రఘునాథరెడ్డి అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి రూ.15 వేల ఆర్థిక సాయం అందజేశారు. బాధితులకు ఐఏవై కింద పక్కాగృహాలు మంజూరు చేస్తామని, ప్రభుత్వం నుంచి పరిహారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే టీడీ నాగరాజారెడ్డి, ఎంపీడీఓ రాబర్ట్‌విల్సన్‌ బాధితులను పరామర్శించారు. తహసీల్దార్‌ హమీద్‌బాషా, ఆర్‌ఐ శ్రీధర్‌ నష్టాన్ని అంచనా వేశారు. కోటి రూపాయల దాకా నష్టం వాటిల్లిందని బాధితులు చెబుతుండగా.. రూ.56 లక్షల మేరకు నష్టం జరిగిందని అధికారులు తేల్చారు. సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

సహాయక చర్యల్లో పాల్గొన్న దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి
రెడ్డిపల్లిలో కిరాణా షాపు అగ్నికి ఆహుతవుతోందన్న సమాచారం అందగానే వైఎస్సార్‌ సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. దుద్దుకుంట ఫౌండేషన్‌ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసి మంటలు అదుపులోకి వచ్చేవరకు మోటారుతో నీరు కొట్టించారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్‌ కే.సూర్యనారాయణ, బూత్‌ కమిటీ కన్వీనర్‌ రెడ్డిపల్లి టీడీ కేశవరెడ్డి, బీసీ సెల్‌ జిల్లా నాయకులు నాగప్ప, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి శేషాద్రిరెడ్డి, మైనార్టీ సెల్‌ మండల కన్వీనర్‌ సుబహాన్, ఏ.గంగిరెడ్డి, షాకీర్‌ తదితరులు మంటలను ఆర్పడంలో పాలుపంచుకున్నారు. సమన్వయకర్త శ్రీధర్‌రెడ్డి బాధితులను పరామర్శించి తనవంతు తక్షణ సాయంగా కొంతమొత్తం అందజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement