ఏపీ అప్‌డేట్స్‌: భారీగా వరద.. ఎర్రకాలువకు గండి

Heavy Rains In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమయింది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి, ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ, విజయవాడ సహా పలు పట్టణాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలో నదిలోకి వరద పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 14.7 అడుగులకు చేరింది. 14.37 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక మంగళవారం కూడా కొనసాగుతోంది. జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇవి..

పది ఇళ్లు నేలమట్టం..

  • పశ్చిమగోదావరి జిల్లాలోని ఎర్రకాలువ జలాశయానికి గండి పడడడంతో చోడవరం గ్రామం నీట మనిగింది. సుమారు 10 ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎర్రకాలువ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 83.70 అడుగులు. కాగా, ఇన్‌ఫ్లో 60 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 30 వేల క్యూసెక్కులు.
     
  • పశ్చిమగోదావరి : ఏజెన్సీ ప్రాంతంలో రికార్లు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. కోయిదాలో 38.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుక్కునురులో 29.1, వేలేరుపాడు 28.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

చుట్టూ నీరుతో అమరాతి

  • కృష్ణా, గుంటూరు జిలాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదు. వర్షాల కారణంగా జిల్లాల్లోని వరినాట్లు నీట మునిగాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విజవాడ జలమయంగా మారింది. ఆటోనగర్‌, రోటరీ నగర్‌ కాలనీ వాసులు వాననీరు చుట్టుముట్టడంతో తవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  
     
  • ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాజధాని అమరావతి నీటిలో చిక్కుకుంది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలు వరద తాకిడికి అతలాకుతలమయ్యాయి. కాగా, కొండవీటి వాగు, కృష్ణా నది ఉప్పొంగితే రాజధానికి వరద ముప్పు రెట్టింపవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విజయవాడ, జగదల్‌పూర్‌ హైవేపై వరదనీరు భారీగా నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.

పునరావాస కేంద్రాలకు తరలింపు..

  • గోదావరి నదిలో వరద ఉధృతి పెరగడంతో కొవ్వూరు వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాలతో 7,174 హెక్టార్లలో పంట నీటమునిగింది. ఇళ్లు, కాలనీల్లోకి నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాల్లోని 11,950 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
  • గోదావరి, శబరి నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా విలీన మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తాగునీరు, నిత్యావసరాలు, విద్యుత్‌ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
  • భారీ వర్షాలు, వరదల కారణంగా అయిదు రోజులుగా కోనసీమ లంక గ్రామాలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. దీంతో వైద్యం అందక పలు గ్రామాల్లో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కోనసీమలో అధికారులు 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

స్కూళ్లకు సెలవు..

  • జిల్లా వ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురుస్తుండడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు మంగళవారం కూడా కలెక్టర్‌ సెలవు ప్రకటించారు. 

తమ్మిలేరుకు భారీ వరద..

  • పశ్చిమగోదావరిలోని తమ్మిలేరు జలాశయానికి వరద ఉధృతి పెరగడంతో లింగరావు గూడెం వద్ద గండి పడిందని అధికారులు తెలిపారు. డ్యామ్‌లోని నీరు మదేపల్లి, జలిపుడి గ్రామాల్లోకి చేరింది. దెందులూరు మండలం కొవ్వలిలో వెయ్యి ఎకరాల పంట నీట మునిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ్మిలేరు డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 10వేలు, ఔట్‌ ఫ్లో 5 వేల క్యూసెక్కులుగా ఉంది.

  • బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. దీంతో కోస్తాంధ్రలో ఓ మోస్తరు, తెలంగాణలో విస్తారంగా మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడొచ్చని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్ధని హెచ్చరించింది.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top