అన్నదాతకు హంద్రీ–నీవా వరం

Handri-Neeva is a blessing to the farmers - Sakshi

ప్రాజెక్టు ఫేజ్‌–1ద్వారా ఆయకట్టుకు సాగునీరు ఇస్తామని బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

కర్నూలు, అనంతలో 1.98 లక్షల ఎకరాలకు కృష్ణా జలాలు 

ఫేజ్‌–2లో చెరువులకు కూడా నీరు

2012 నుంచి కృష్ణా జలాలు ‘సీమ’కు వస్తున్నా ఆయకట్టుకు నీరివ్వని వైనం

డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయవద్దని 2015లో జీవో 22 జారీ చేసిన టీడీపీ సర్కారు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: కళ్లెదుటే గలగలా నీళ్లు పారుతున్నా ఏడేళ్లుగా పొలాలకు పారించుకోలేని దుస్థితి సీమ రైతన్నలకు ఇక తొలగిపోనుంది. రాయలసీమ సాగునీటి కష్టాలు తీర్చే బృహత్తర ప్రాజెక్టు హంద్రీ–నీవా సుజల స్రవంతి ఫేజ్‌–1 ద్వారా ఆయకట్టుకు సాగునీరు ఇస్తామని, ఫేజ్‌–2లో చెరువులకు నీరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బడ్జెట్‌లో ప్రకటించడం పట్ల అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ‘సీమ’ వాసుల 15 ఏళ్ల స్వప్నం సాకారమై బీడు భూములు కృష్ణా జలాలతో తడిసి బంగారు పంటలు పండించనున్నాయని పేర్కొంటున్నారు. 

2004 జూలై 24న వైఎస్సార్‌ శంకుస్థాపన
దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రూ.6,850 కోట్ల వ్యయంతో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం పనులకు శ్రీకారం చుట్టారు. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి 40 టీఎంసీలను ఎత్తిపోసి ‘సీమ’లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకానికి 2004 జూలై 24న శంకుస్థాపన చేశారు. ఐదేళ్లలో రూ.4,340.36 కోట్లు ఖర్చు చేశారు. అయితే వైఎస్‌ మృతి చెందటం హంద్రీ–నీవాకు శాపంగా మారింది. ఎట్టకేలకు 2012లో కృష్ణమ్మ కర్నూలు జిల్లాలోని పందికోన, కృష్ణగిరితోపాటు ‘అనంత’లోని జీడిపల్లి రిజర్వాయర్‌లకు చేరుకున్నా రైతులకు మాత్రం నిరాశే మిగిలింది. 2012 నవంబర్‌ 29న ‘అనంత’లోని జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు చేరాయి.

2014 ఖరీఫ్‌లోనే హంద్రీ–నీవా తొలి దశ కింద 1.98 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని ప్రకటించిన నాటి టీడీపీ సర్కారు మాట నిలబెట్టుకోలేదు. పైగా ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులు చేయవద్దని 2015 ఫిబ్రవరిలో చంద్రబాబు ప్రభుత్వం జీవో 22 జారీ చేయడం గమనార్హం. దీంతో ఐదేళ్లుగా కృష్ణా జలాలు కళ్లెదుటే పారుతున్నా పొలంలోకి మళ్లించుకోలేని దుస్థితిలో సీమ రైతులు ఉన్నారు. హంద్రీ–నీవా ద్వారా 40 టీఎంసీలను ఎత్తిపోసి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించాలని డీపీఆర్‌లో నిర్దేశించారు. ఫేజ్‌–1లో 1.98 లక్షల ఎకరాలున్నాయి. కృష్ణగిరి, పందికోన, జీడిపల్లి రిజర్వాయర్లు ఇందులో ఉన్నాయి. వీటి డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించాలి. ఇందులో కర్నూలు జిల్లాలో 80 వేల ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1.18 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. నిత్యం కరువుతో అల్లాడే ఆలూరు నియోజకవర్గంలో 48 వేల ఎకరాలు, పత్తికొండలో 10 వేల ఎకరాలకు నికరంగా సాగునీరు అందనుంది. ఉరవకొండలో కూడా 70 వేల ఎకరాలకు అత్యధికంగా సాగునీరు అందనుంది. సాగునీరు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో డిస్ట్రిబ్యూటరీ పనులు ఇక వేగవంతం కానున్నాయి. 

పిల్ల కాలువ పనుల్లో గత సర్కారు తాత్సారం..
కర్నూలు జిల్లాలో పందికోన రిజర్వాయర్‌ నుంచి 61,400 ఎకరాలకు సాగునీరు అందించాలి. ఇందులో కుడి కాలువ కింద 50,626 ఎకరాలు, ఎడమ కాలువ కింద 10,774 ఎకరాల ఆయకట్టు ఉంది. కుడి కాలువ పరిధిలో 32 డిస్ట్రిబ్యూటరీలు ఉండగా 28 డిస్ట్రిబ్యూటరీలు పూర్తయ్యాయి. ఎడమ కాలువ పరిధిలోని మొత్తం 11 డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తయ్యాయి. అయితే వీటి నుంచి పిల్ల కాలువల పనులు చేయడంలో గత ప్రభుత్వం తాత్సారం చేసింది. రెండు ప్యాకేజీలుగా పిల్ల కాలువ పనులకు టెండర్లు పిలిచారు. 28వ ప్యాకేజీ పనులను మాక్స్‌ ఇన్‌ఫ్రా దక్కించుకుంది. 29వ ప్యాకేజీ పనులను ఆర్‌మెహిత్, బూరత్నమ్‌(జాయింట్‌ వెంచర్‌) కంపెనీలు దక్కించుకున్నాయి. ఈ రెండు కంపెనీలు 87–90 శాతం పనులు పూర్తి చేశాయి. మిగతా పనులు నిలిపివేయడంతో పిల్ల కాలువల పనులకు బ్రేక్‌ పడింది. అనంతపురం జిల్లాలో 36వ ప్యాకేజీ ద్వారా అత్యధికంగా 80,600 ఎకరాల ఆయకట్టుకు నీరందించాలి. ఈ పనులను రూ.336 కోట్లతో ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్‌ సంస్థ దక్కించుకుంది. ఈ పనులు కూడా పూర్తి కాకపోవడంతో ఆయకట్టుకు నీరు అందలేదు. వీటిని సమీక్షించి పనులు చేయని కాంట్రాక్టులను రద్దు చేసి త్వరగా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేస్తే కనీసం వచ్చే ఖరీఫ్‌ నుంచైనా ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. 

అప్పుల నుంచి అన్నదాతలకు విముక్తి
హంద్రీ–నీవా ద్వారా ఆయకట్టుకు నీరందిస్తే కర్నూలు, అనంతపురం జిల్లాల్లో దాదాపు 2 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. వర్షాధారంగా పంటలు సాగు చేసి అప్పుల పాలయ్యే దుస్థితి రైతన్నలకు తప్పుతుంది. రైతులు, రైతు కూలీలు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పని ఉండదు. ఫేజ్‌–2లో కూడా చెరువులకు నీరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో గొల్లపల్లి, చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్ల పరిధిలోని రైతులకు మేలు జరుగుతుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top