కమిషనర్‌ వర్సెస్‌ కాంట్రాక్టర్లు

Guntur Municipal Staff Neglect on Road Works - Sakshi

గుంటూరు కార్పొరేషన్‌లో ప్రచ్ఛన్న యుద్ధం

బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్ల ఆందోళన

రూ.100కోట్ల దాకా పెండింగ్‌

ఒకేసారి 80 ఫైళ్లను వెనక్కిపంపిన కమిషనర్‌

ఇంజినీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారని కమిషనర్‌ ఆగ్రహం

కలెక్టర్, సీఎస్‌ను కలసి ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్న కాంట్రాక్టర్లు

బిల్లులు రాకపోవడంతో పనులు నిలిపివేత

సాక్షి, గుంటూరు: ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ ఉందన్న సామెతకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులు అద్దం పడుతున్నాయి. నిధులు ఉన్నా కార్పొరేషన్‌ కమిషనర్, కాంట్రాక్టర్ల మధ్య విభేదాలతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. బిల్లులు ఇస్తేనే చేస్తామంటూ కాంట్రాక్టర్లు.. ఇంజినీరింగ్‌ అధికారులతో కుమ్మక్కై ఇష్టానుసారం చేస్తుండటం వల్లే ఇవ్వకుండా తిప్పుతున్నామంటూ కమిషనర్‌ భీష్మించి కూర్చోవడంతో నగరంలో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. పనుల దగ్గరకు రాకుండానే ఆరోపణలు ఎలా చేస్తారంటూ కాంట్రాక్టర్లు కమిషనర్‌పై మండిపడుతున్నారు. బిల్లులు చెల్లించాలంటూ వెళ్లిన తమపై కమిషనర్‌ అవమానకరంగా ప్రవర్తించారంటూ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్, కార్పొరేషన్‌ ప్రత్యేక అధికారి కోన శశిధర్‌తోపాటు, సీఎస్‌ను కలసి ఫిర్యాదు చేసేందుకు సమాయత్తం అవుతుండటంతో వివాదం ముదిరి పాకాన పడింది. దీనికి తోడు ప్రభుత్వం కార్పొరేషన్‌ నిధుల్ని సైతం పసుపుకుంకుమ వంటి పథకాలకు మళ్లించడంతో ఖజానా ఖాళీ అయి కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగానే కమిషనర్‌ బిల్లులు పెట్టడం లేదనే వాదనలు ఉన్నాయి. ఏదేమైనా కమిషనర్‌ వర్సెస్‌ కాంట్రాక్టర్స్‌ పోరు నగర ప్రజలకు శాపంగా మారిందని చెప్పవచ్చు.

ఆచితూచి వ్యవహరిస్తున్న కమిషనర్‌
గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌గా శ్రీకేష్‌ లఠ్కర్‌ ఏడాది కిందట బాధ్యతలు చేపట్టారు. ఇంజినీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే గత కమిషనర్‌పై వేటు పడిందనే విషయం తెలుసుకున్న ఆయన మొదటి నుంచి ఇంజినీరింగ్‌ అధికారులు పెట్టే బిల్లులపై కొర్రీలు వేస్తూ వస్తున్నారు. కొందరు కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కై అడ్డగోలుగా పనులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు రావడంతో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. గత డిసెంబరు నుంచి బిల్లులన్నీ పెండింగ్‌లో పెట్టడంతో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా వారు పనుల్ని నాసిరకంగా నిర్వహించారనే అనుమానం వస్తే క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు చేపట్టడం, బాగా చేసిన వారికి ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించడం చేస్తే ఇబ్బందులు లేకుండా ఉండేవని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కాని అందరినీ ఒకే విధంగా భావించి నిలిపివేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

కమిషనర్‌ తీరుపై మండిపడుతున్న కాంట్రాక్టర్లు
నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు సుమారు రూ. 100 కోట్ల వరకు బకాయిలు ఉండటంతో బుధవారం అసోసియేషన్‌ నాయకులు కమిషనర్‌ను కలసి బిల్లులు చెల్లించాలని కోరేందుకు వెళ్లారు. అయితే, ఆ సమయంలో సైతం తమను అవమానకరంగా మాట్లాడారంటూ అసోసియేషన్‌ నేతలు మండి పడుతున్నారు. కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న కమిషనర్‌పై కలెక్టర్,  సీఎస్‌లకు ఫిర్యాదు చేసేందుకు కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ నాయకులు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా 14వ ఆర్థిక సంఘం, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులతో పూర్తిచేసిన పనులకు సైతం సుమారుగా రూ. 25 కోట్ల వరకు బిల్లులు చెల్లించకుండా కమిషనర్‌ నిలిపివేయడంపై కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. ఇంజినీరింగ్‌ అధికారులు పనుల్ని పరిశీలించి బిల్లులు చెల్లించాలంటూ పంపిన 80 ఫైళ్లను ఒకేసారి వెనక్కు పంపడం చూస్తుంటే కమిషనర్‌ ఇంజినీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లపై ఏస్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో అర్థమవుతోంది.

నిలిచిపోయిన అభివృద్ధి పనులు
గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్, కాంట్రాక్టర్ల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఎఫెక్ట్‌ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పడింది. కొంత మేర పనులు నిర్వహించినప్పటికీ బిల్లులు చెల్లించకుండా కమిషనర్‌ ఇబ్బందులు పెడుతున్నారంటూ కాంట్రాక్టర్లు నిలిపివేశారు. ముఖ్యంగా లాల్‌పురం రోడ్డు విస్తరణ, డ్రెయిన్‌ నిర్మాణ పనులు చేపట్టేందుకు రూ. 6 కోట్లు మంజూరయ్యాయి. కొంత మేర పూర్తయినప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్‌ నిలిపివేశారు. పొన్నూరు రోడ్డు, విజయవాడ రోడ్లలో డివైడర్‌ నిర్మాణంతోపాటు, సెంట్రల్‌ లైటింగ్‌ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లకు సైతం పార్ట్‌ బిల్లులు చెల్లించకపోవడంతో నిలిపివేశారు. రింగ్‌రోడ్డు రోడ్డు విస్తరణ పనులు సైతం మధ్యలోనే ఆగిపోయాయి. అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య జరుగుతున్న గొడవలు నగరంలో పనులు నిలిచిపోయే స్థాయికి వెళ్లడం నగర ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top