వరద పొడిచిన లంక గ్రామాలు

Guntur District Lanka Villages Lies Under Flood Water - Sakshi

సాగర్, పులిచింతల ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

రాజధాని పరిధిలో మునిగిన వంతెనలు

వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం

నీట మునిగిన పత్తి, కంద, పసుపు, బొప్పాయి, మిరప పంటలు

లంక గ్రామాల్లో పర్యటించిన మంత్రి మోపిదేవి, ఎంపీ సురేష్

సాక్షి, అమరావతి: కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. సాగర్, పులిచింతల ప్రాజెక్టులను ముంచెత్తుతోంది. గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతుండడంతో వరద నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. వరద దెబ్బకు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో లంక గ్రామాలకు ముప్పు ఏర్పడింది. పల్నాడుతోపాటు డెల్టా ప్రాంతంలో ఇప్పటికే సాగులో ఉన్న పంటలు నీట మునిగాయి. రాజధాని ప్రాంతంలో వాగులు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరాయి. లంక గ్రామాలను వరద చుట్టుముట్టడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న మంత్రి మోపిదేవి, ఎంపీ సురేష్, ఎమ్మెల్యే నాగార్జున

ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి వరద కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుకు నుంచి దిగువకు భారీగా నీటి విడుదల చేస్తుండటంతో కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాల్లోకి నీరు చేరుతోంది. పలు లంక గ్రామాలు నీట మునిగాయి. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రికి వరద ప్రకాశం బ్యారేజీకి చేరుతుందన్న అంచనాతో లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబు నివాసంలోకి నీరు చేరాయి. కరకట్ట లోపల ఉన్న పలు గృహాలలోకి వరద నీరు వచ్చింది. అక్కడ ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. 

ముంచెత్తిన వరద 
కృష్ణా నది పరివాహక ప్రాంతాలు, దాచేపల్లి మండలంలోని పొందుగల, కాట్రపాడులో దాదాపు 500 ఎకరాలు, అచ్చంపేట మండలంలోని కస్తల, అంబడిపూడి, క్రోసూరు, మాదిపాడు, అమరావతి, పెద్దమద్దూరు, మునుగోడు, మల్లాది, దిడుగు, ధరణికోట ప్రాంతాల్లో సుమారు 6,500 ఎకరాల్లో పత్తి, మిరప పంటలు నీటి పాలయ్యాయి. పెద్దమద్దూరు గ్రామంలోకి నీరు చేరింది. విజయవాడ– అమరావతి– క్రోసూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అమరావతి–ధరణికోట మధ్య గన్నేరువాగు, జూపూడి–మునుగోడు మధ్య నక్కల వాగు ప్రవహించటంతోనే  ఇబ్బందులు తలెత్తాయి. తుళ్లూరు మండలంలోని పలు లంక గ్రామాలు నీట మునిగాయి. తాడేపల్లి కరకట్ట లోపల ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరింది. వరద వచ్చిన విషయాన్ని టీడీపీ నేతలు రాద్ధాంతం చేసి హంగామా చేశారు. 

మాదిపాడు చప్టాపై ప్రయాణికుల రాకపోకలకు ఏర్పాటు చేసిన పడవ 

లంక గ్రామాల్లో పంటలు నీట మునక 
కొల్లిపర మండలంలో అన్నవరపు లంక, కొత్తలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ గ్రామాలకు బోట్లపైన వెళ్లాల్సి వస్తోంది.  వల్లభాపురం,, మున్నంగి, పిడపర్రు, పిడవర్తిపాలెం, పాతబొమ్మవానిపాలెం, అన్నవరం, అన్నవరపులంక, కొత్తూరులంకలో పంట పొలాల్లోకి నీరు చేరాయి. ఈ మండలంలో 2815.75 ఎకరాల్లో అరటి, పసుపు, కంద, జామ నిమ్మ, కూరగాయల తోటల్లోకి నీరు వచ్చినట్లు ప్రాథమిక అంచనా వేశారు. కొల్లూరు మండలంలో పెసర్లంక–అరవింద వారధి సమీపంలో గండి పడటంతో రోడ్డు కోతకు గురైంది. అరవిందవారిపాలెంలో చినపాయలోకి నీరు ప్రవేశించకుండా వేసిన అడ్డుకట్టకు గండి పడటంలో పలు గ్రామాల్లోకి నీరు చొచ్చుకొచ్చింది. దీంతో చిలుమూరు లంక, సుగ్గులంక, ఈపూరిలంక, చింతర్లక, పెసరలంక, పెదలంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోతార్లంక, తిప్పలకట్ట, తోకల వారిపాలెం, కిష్కింపాలెం, జువ్వలపాలెం పంట పొలాల్లోకి నీరు చేరింది. దాదాపు 4000 ఎకరాల్లో పసుపు, కంద, అరటి, బొప్పాయి, మొక్క జొన్న పంటలు మునిగిపోయాయి. కొల్లూరు మండలం పెసర్లంక వద్ద పడిన గండితో రాకపోకలకు అంతరాయంగా మారింది. దుగ్గిరాల మండలంలో వీర్లపాలెం, పెదకొండూరు, గొడవర్రు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. 

ముంపు గ్రామాల్లో మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ పర్యటన 
కొల్లూరు, కొల్లిపర, దుగ్గిరాల, రేపల్లి భట్టిప్రోలు, ప్రాంతాల్లో మంత్రి మోపిదేవి వెంకటరమణరావు, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, కలెక్టర్‌ ఐ.శ్యామూల్‌ అనందకుమార్, జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పర్యటించారు. కొల్లూరులో వరద పరిస్థితిపై మంత్రి మోపిదేవి వెంకటరమణరావు అధికారులతో సమీక్షించారు. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. తాగు నీరు, భోజనం అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. తుళ్లూరు మండలంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. తాడేపల్లిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పర్యటించి వరద పరిస్థితిని అంచనా వేశారు. అమరావతి మండలంలో నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పర్యటించి వరద పరిస్థితిని సమీక్షించారు. గజ ఈతగాళ్లను, పడలవలను సిద్ధంగా ఉంచారు.

వరద నివారణకు ప్రత్యేక చర్యలు 


పోతార్లంక వద్ద వరదలో చిక్కుకుపోయిన వారిని కాపాడుతున్న గజ ఈతగాళ్లు

గుంటూరు జిల్లాలో వరద ముప్పును ఎదుర్కొనేందుకు వీలుగా 60 మంది సభ్యులు గల ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను విజయవాడ, కొల్లిపర, కొల్లూరు, తెనాలిలో సిద్ధంగా ఉంచారు. జిల్లాలోని 12 మండలాలు, 39 గ్రామాల్లో 537 కుటుంబాలు, 709 మంది ప్రజలకు వరద ముప్పు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1619 మంది తరలించారు. సాగర్‌ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో 7,13,052 క్యూసెక్కులు వస్తుండగా,  బయటకు 7,13,042 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 8,39,136 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 7,97,502 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో 7,57,005 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 7, 71,134 క్యూసెక్కులను పంపుతున్నారు. శనివారం నాటికి వరద ఉద్ధృతి పెరిగి  దాదాపు 10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top