మురుగు శుద్ధికి గ్రీన్‌ సిగ్నల్‌

Green Signal For Drainage Water Filter Visakhapatnam - Sakshi

పెందుర్తిలో 46 ఎంఎల్‌డీ ప్లాంట్‌ ఏర్పాటు

రూ.150 కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

మున్సిపల్‌ బాండ్స్‌ ద్వారా జీవీఎంసీ నిధులు

విశాఖసిటీ: మహా విశాఖలో పారిశ్రామిక అవసరాల కోసం వృథా నీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు కొత్త ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.762 కోట్లతో హైబ్రిడ్‌ సివరేజ్‌ ప్రాజెక్టు తొలి విడత పనులకు సర్కారు పచ్చజెండా ఊపింది. పెందుర్తిలో 46 ఎంఎల్‌డీ సామర్థ్యంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రూ.150 కోట్ల నిధులను మున్సిపల్‌ బాండ్స్‌ ద్వారా సమీకరించుకోవాలని సూచించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు జీవీఎంసీ కసరత్తులు చేస్తోంది.

మహా విశాఖ నగర పాలక సంస్థలో దేశంలోనే అతి పెద్ద హైబ్రిడ్‌ సివరేజ్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. గ్రేటర్‌ పరిధిలో ఉత్పత్తవుతున్న మురుగు వృథా నీటిని పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నారు. పెందుర్తి, గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ లేని ప్రాంతాల్లో అభివృద్ధి చెయ్యడంతో పాటు ఆ నీటిని శుద్ధి చేసి పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం ఖరీదు రూ.762 కోట్లు. తొలి విడతలో రూ.412 కోట్లతో వేస్ట్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌తో పాటు పరిశ్రమలకు రీసైకిల్‌ వాటర్‌ను పంపిణీ చేసే వ్యవస్థకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు. ప్యాకేజీ–1లో కింద పెందుర్తి ఏరియాలో పనులు నిర్వహించనున్నారు.

ఇందుకోసం మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత జీవీఎంసీపై ఉండటంతో ఈ ప్రాజెక్టులో రూ.150 కోట్లను కార్పొరేషన్‌ ఖర్చు చేయనుంది. ఏపీ అర్బన్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌(ఏపీయూఐఏఎంఎల్‌) మిగిలిన మొత్తాన్ని రుణాల ద్వారా సమకూర్చుకోనుంది. పెందుర్తి ప్రాంతంలో పనులు ప్రారంభమైన ఆరు నెలల తర్వాత ప్యాకేజీ–2లో భాగంగా గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో వేస్ట్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌తో పాటు పరిశ్రమలకు ట్రీటెడ్‌ వాటర్‌ పంపిణీ చేసే వ్యవస్థకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే జీవీఎంసీ బాధ్యతగా ఖర్చు చేయాల్సిన రూ.150 కోట్లను మున్సిపల్‌ బాండ్ల ద్వారా సమీకరించుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. జీవీఎంసీ స్థిరాస్థిని బట్టి వాటిని తనఖా పెట్టి రూ.150 కోట్లు సమీకరించుకునే వెసులుబాటు కల్పించింది.

ఓపెన్‌ టెక్నాలజీ ఆపరేషన్‌ ద్వారా నిర్వహణ
46 ఎంఎల్‌డీతో సామర్ధ్యం కలిగిన ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్‌కు సంబంధించి పరిశీలన, సర్వే, డిజైన్, నిర్మాణం, సివరేజ్‌ కలెక్షన్, కన్వెయిస్‌ సిస్టమ్‌ పర్యవేక్షణ పనులకు సంబంధించిన నివేదికను త్వరలోనే జీవీఎంసీ అధికారులు సిద్ధం చెయ్యనున్నారు. అదే విధంగా 15 సంవత్సరాల పాటు ఓపెన్‌ టెక్నాలజీతో నిర్వహించనున్నారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ద్వారా ప్రస్తుతం పనులు జరుగుతున్న నరవ సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నుంచే ఈ ప్రాజెక్టును నిర్వహించనున్నారు. ఈ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ద్వారా శుద్ధి చేసిన నీటిని పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తే ఇప్పటి వరకూ పరిశ్రమలకు మళ్లిస్తున్న నీటిని విశాఖ ప్రజల తాగునీటి సరఫరాకు కొంత మేర ఉపయోగపడనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top