చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమావేశం తర్వాత.. గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌కు ఫోన్ చేసి కూలీల ఎన్‌కౌంటర్ వివరాలను నివేదించారు.
హైదరాబాద్: చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమావేశం తర్వాత.. గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌కు ఫోన్ చేసి కూలీల ఎన్‌కౌంటర్ వివరాలను నివేదించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం ఫోన్ చేసి ఎన్‌కౌంటర్ పరిణామాలను వివరించారు. శేషాచలం అడవుల్లో ఏడాది కిందట ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఇద్దరు అటవీశాఖ అధికారులపై దాడి చేసి చంపారని.. మంగళవారం కూడా అదే తరహాలో టాస్క్‌ఫోర్స్ బలగాలపై దాడి చేశారని రాజ్‌నాథ్‌కు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. టాస్క్‌ఫోర్స్ బలగాలు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లోనే 20 మంది చనిపోయారని.. పలువురు పోలీసులు గాయపడ్డారని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.
ఆత్మరక్షణ కోసమే కాల్పులు: డీజీపీ
సీఎం చంద్రబాబుతో భేటీ ముగిసిన అనంతరం డీజీపీ రాముడు విలేకరులతో మాట్లాడుతూ.. శేషాచలం అడువుల్లోకి ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ప్రవేశించారన్న సమాచారంతోనే టాస్క్‌ఫోర్స్ బలగాలు సోమవారం నుంచి కూంబింగ్ చేస్తున్నాయని చెప్పారు. మంగళవారం ఉదయం చంద్రగిరి సమీపంలోని అటవీ ప్రాంతంలో స్మగ్లర్ల బృందం టాస్క్‌ఫోర్స్ బలగాలపై దాడుకు దిగిందన్నారు. టాస్క్‌ఫోర్స్ బలగాలు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో 20 మంది చనిపోయారన్నారు. చనిపోయిన 20 మందిలో స్మగ్లర్లు ఎవరు, కూలీలు ఎవరు అన్నది తేలాల్సి ఉందన్నారు.