అపరిశుభ్రంగా ప్రభుత్వ ఆస్పత్రులు

అపరిశుభ్రంగా  ప్రభుత్వ ఆస్పత్రులు - Sakshi


స్వచ్ఛ భారత్‌కు తిలోదకాలు

పట్టించుకోని అధికారులు


 

ప్రభుత్వ ఆస్పత్రులు అపరిశుభ్రతకు నిలయాలుగా మారుతున్నాయి. స్వచ్ఛ భారత్ స్ఫూర్తికి విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో ఆస్పత్రుల ఆవరణలు పిచ్చి మొక్కలతో నిండిపోతున్నాయి. ప్రతి శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛ భారత్ నిర్వహించి పరిసరాలను శుభ్రం చేసుకోవాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు.

 

వేమూరు :  స్థానిక పీహెచ్‌సీ పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ప్రహరీ అధ్వానంగా ఉంది. దీంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోగులకు ఏర్పాటు చేసిన బెడ్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం లేదు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీని కొన్ని నెలల క్రితం రద్దు చేయడంతో దీని ఆలనాపాలనా పట్టించుకునే వారే కరువయ్యారు. తాగునీటి వసతి సైతం లేదు. మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.



పారిశుధ్యం అధ్వానం..

అమృతలూరు : మండలంలోని 4 పీహెచ్‌సీలలో పారిశుధ్యం అధ్వానంగా మారాయి. మండలంలోని మోపర్రు, మూల్పూరు, అమృతలూరు, ఇంటూరు పీహెచ్‌సీలలో స్వీపర్లు లేరు. సిబ్బంది కొరతగా ఉంది. దీంతో ఆస్పత్రి ఆవరణ అంతా పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. అమృతలూరు, ఇంటూరు పీహెచ్‌సీలకు వెనుక భాగంలో ప్రహరీ లేదు. ముందువైపు ప్రహరీ శిథిలావస్థకు చేరాయి. రెండేళ్లుగా ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు లేవు. నిధుల జాడ లేదు. మరుగుదొడ్లు దుర్వాసనను వెదజల్లుతున్నాయి. తాగునీటి సమస్య కూడా ఉంది. దీంతో రోజురోజుకూ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య తగ్గిపోతోంది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 

వైద్యశాల నిర్వహణ అస్తవ్యస్తం

కొల్లూరు : స్థానిక పీహెచ్‌సీ ఆవరణ పరిశుభ్రత విషయాన్ని సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఆస్పత్రి సిబ్బందికి వేరే వ్యాపకాల్లో తల మునకలై ఉంటుండటంతో ఆస్పత్రిపై అశ్రద్ధ వహిస్తున్నారు. దీంతో రోగులు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. వైద్యశాలను శుభ్రపర్చాల్చిన క్లీనర్ (తోటి) పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆస్పత్రి లోపల, బయట పరిశుబ్రత కానరావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

 

ఆర్భాటమే తప్ప చర్యలు శూన్యం..

భట్టిప్రోలు : ప్రభుత్వ వైద్యశాలల్లో ఆర్భాటంగా ‘స్వచ్ఛ భారత్’ నిర్వహించారు. మొదట్లో హడావిడి చేశారు. రానురాను ఆస్పత్రుల ఆవరణ శుభ్రతను పట్టించుకోవడం మానేశారు. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. మండలంలో భట్టిప్రోలు పీహెచ్‌సీ (రౌండ్ ది క్లాక్), వెల్లటూరు పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటి ఆవరణలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. చెత్తా చెదారంతో దర్శనమిస్తున్నాయి. అభివృద్ది కమిటీలు ఏర్పాటు చేయకపోవటంతో వీటిని పట్టించుకునేవారే లేరు. నిధులు సైతం రావడం లేదు. భట్టిప్రోలు పీహెచ్‌సీ ఆవరణలో ‘స్వచ్ఛ భారత్’ లో భాగంగా ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు నాటిన మొక్క ఆలనా,పాలనా లేకపోవటంతో ఎండుముఖం పట్టింది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top